×

Kerala:

దశాబ్దాలుగా ఎడతెగని దళిత మద్దతుతో పాలన సాగిస్తూ వస్తున్న కమ్యూనిస్టు సంకీర్ణ సర్కారుకు కేరళలో కష్టాలు మొదలయ్యాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వారిది నల్లేరు మీద బండి నడక కాదని ఎస్సీ ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గాల్లో ఇప్పుడు వీస్తున్న గాలి సంకేతాలిస్తోంది. దళిత రిజర్వు నియోజకవర్గాల్లో ఒటర్లంతా దళితులే ఉండరు. కానీ, గత మూడు అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్ష ఫ్రంట్ (ఎల్డీఎఫ్)కు ఎస్సీ రిజర్వుడు స్థానాల్లో లభించిన మద్దతు అటువంటిది. ఇప్పుడది సన్నగిల్లి, దాదాపు అలాంటి పరిణామాలే ఇతర చోట్ల కూడా బలపడుతుండటంతో స్థూలంగా ఎల్డీఎఫ్‌కు ఎదురుగాలి వీస్తోందని ‘పీపుల్స్ పల్స్‌’ ప్రాథమిక సర్వే చెబుతోంది. బీజేపీ నేతృ త్వపు ఎన్డీయే కూటమి అక్కడక్కడ ఉనికి పెంచుకుంటుంటే కాంగ్రెస్ నాయకత్వంలోని ప్రధాన ప్రత్యర్థి కూటమి ‘యూడీఎఫ్‌’ క్రమంగా బలపడుతోంది. ఎన్నికల నాటికి ఏయే పరిణామాలు ఎలా మలుపు తిరుగుతాయో తెలియని స్థితిలో ఎల్డీఎఫ్ ఎదురీతి స్పష్టంగానే కళ్లకు కడుతోంది. విలక్షణ రాష్ట్రం కేరళ అసెంబ్లీకి మరో మూడు నెలల్లోనే ఎన్నికలున్నాయ్!

దేశంలోనే ఏకైక కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని కేరళలో నడుపుతున్న వామపక్ష ప్రజాస్వామ్య కూటమి (ఎల్డీఎఫ్) పదేళ్ల పాలన తర్వాత ఎదురీదుతోంది. ప్రభుత్వ వ్యతిరేకతకు తోడు సైద్దాంతిక మందగింపు, కులాల కుమ్ములాటలు కూటమిని బలహీనపరుస్తున్నాయి. ముఖ్యంగా రిజర్వుడు స్థానాల్లో వివిధ ప్రభావకాల వల్ల ఎల్డీఎఫ్ క్రమంగా బలహీనపడ్డతీరు కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. గత సంవత్సరం (2025) జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు, ఇతర పరిణామాల్లో ఇది స్పష్టంగానే వెల్లడయింది. ఇక్కడి సంకేతాల్ని బట్టి ఇవే అంశాలు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఇతర ప్రాంతాల్లోనూ ప్రభావితం చేస్తే కమ్యూనిస్టు కూటమికి కష్టాలు తప్పవన్నట్టే! 140 అసెంబ్లీ స్థానాలున్న కేరళలో గెలుపు వరించాలంటే 71 స్థానాల మేజిక్ ఫిగర్ చేరుకోవాలి. 16 రిజర్వుడ్ (పద్నాలుగు ఎస్సీ, రెండు ఎస్టీ) స్థానాలపై పట్టు కీలకం! 2011, 2016, 2021 మూడు అసెంబ్లీ ఎన్నికల్లోనూ 14లో 12 ఎస్సీ స్థానాల్లో ఎల్డీఎఫ్ తన విజయపరంపర కొనసాగించింది. ఇక్కడే కాకుండా ఇతర స్థానాల్లోనూ ఎల్డీఎఫ్ దళితుల మద్దతు అపారంగా పొందుతూ వచ్చింది. కార్మికోద్యమాలు, బడుగుల సంక్షేమం, ఫించన్లు-రిజర్వేషన్లు వంటి అంశాల్లో కమ్యూనిస్టుల సహజ సైద్దాంతిక బలం, వ్యవస్థీక త నిర్వహణ, విధానం వంటివి దళితుల నిరంతర మద్దతు కూడగట్టడంలో కూటమికి కలిసి వచ్చిన అంశాలు. కానీ, ఇప్పుడా మద్దతు సన్నగిల్లుతూ వస్తోంది. ఈ పరిస్థితుల్లో…. వరుసగా గత రెండు పర్యాయాలు గెలిచి పదేళ్లుగా అధికారంలో ఉన్న ఎల్డీఎఫ్, వచ్చే ఎన్నికల్లోనూ గెలిచి అధికారం తిరిగి నిలబెట్టుకుంటుందా? కాంగ్రెస్ నేత త్వంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి (యూడీఎఫ్) గెలిచి అధికార పగ్గాలు చేపడుతుందా? అన్న చర్చ దేశమంతటా ఆసక్తి రేకెత్తించే అంశమే! పశ్చిమ బెంగాల్, త్రిపుర రాష్ట్రాల్లో పతనం తర్వాత దేశంలో మిగిలిన ఏకైక కమ్యూనిస్టు (కూటమి) ప్రభుత్వం ఇక్కడుంది. రాబోయే ఎన్నికలకు సంబంధించి కేరళలో ‘పీపుల్స్ పల్స్’ సర్వే ప్రారంభించింది. త్వరలోనే ఒక సమగ్ర నివేదికను వెలువరించనుంది.

వేగంగా మార్పులు…

కేరళ అసెంబ్లీకి జరుగనున్న ఎన్నికల్లో మూడు ముఖ్య కూటముల గెలుపోటములను ప్రధానంగా మూడంశాలు ప్రభావితం చేసే సూచనలు కనిపిస్తున్నాయి. అధికార ఎల్డీఎఫ్ తో పాటు కాంగ్రెస్ నేతృ త్వంలోని యూడీఎఫ్, బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే కూటములు ఇక్కడ పోటీ పడుతున్నాయి. కమ్యూనిస్టు మూస విధానాలను వ్యతిరేకిస్తూ ఆశావహంగా పెరిగిన నగర-పట్టణ ఓటర్ ఆకాంక్షలు, కులాల కుంపట్లతో, విభిన్న సామాజిక వాదాలతో వచ్చిన చీలికల్లో ‘ఎల్డీఎఫ్ ఓటుబ్యాంకులు’ బలహీనపడటం, కొత్త ప్రాంతాలకు విస్తరిస్తూ బీజేపీ-తిరిగి పుంజుకుంటూ యూడీఎఫ్ కిందటి అసెంబ్లీ ఎన్నికల నుంచి బలపడుతూ రావటం…. ఈ మూడంశాలు వచ్చే ఎన్నికల్లో కేరళ ‘ఓటు రాజకీయాల్ని’ గట్టిగానే ప్రభావితం చేసే సూచనలు కనిపిస్తున్నాయి. అవే ఎల్డీఎఫ్, యూడీఎఫ్ గెలుపోటముల్ని ఖరారు చేసినా ఆశ్చర్యం లేదు. అక్కడక్కడ బీజేపీ ఎదుగుదల నేరుగా సొంతానికైనా లాభించవచ్చు, లేదా ఓటుబ్యాంకు చీలికల వల్ల పరోక్షంగా యూడీఎఫ్‌కైనా మేలు చేయవచ్చన్న వాదన వినిపిస్తోంది. స్థానిక ఎన్నికల్లో తిరువనంతపురం కార్పొరేషన్‌ను బీజేపీ కైవసం చేసుకోవడం, అంతకు ముందరి అసెంబ్లీ ఎన్నికల (2021) ఫలితాలకు భిన్నంగా పలుచోట్ల యూడీఎఫ్ కొత్తగా బలపడటం ఇందుకు నిదర్శనం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే వాతావరణం కొనసాగితే…. నికరంగా నష్టపోయేది ఎల్డీఎఫ్ అనడంలో సందేహమే లేదు. పైన ప్రస్తావించిన మూడు పరిణామాలు ముందు దళితుల్లో మొదలైనా, దాదాపు ఇదే పరిస్థితి క్రమంగా ఇతర వర్గాలకూ విస్తరించాయి. గతంతో పోల్చి చూస్తే దేశవ్యాప్త రాజకీయ పరిణామాల ప్రభావం కేరళ రాజకీయాలపైన ఇప్పుడు అధికంగా కనిపిస్తోంది. వయనాడ్ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ గెలిచి రాజీనామా చేయడం, ఫలితంగా జరిగిన ఉప ఎన్నికలో ఆయన సోదరి, పార్టీ ప్రధానకార్యదర్శి అయిన ప్రియాంక గాంధీ గెలవడం ఓ పెద్ద పరిణామమే! పార్టీ మరో ప్రధానకార్యదర్శి అయిన రాష్ట్ర నాయకుడు కే.సీ.వేణుగోపాల్ కి ఏఐసీసీలో ప్రాధాన్యత పెరగటం వంటివి కేరళ రాజకీయాల్ని నేరుగా ప్రభావితం చేస్తున్నాయి. 2024 ఎన్నికల్లో బీజేపీ ఒక లోక్‌సభ స్థానాన్ని గెలవటం, మరుసటి యేడు (2025) జరిగిన స్థానిక ఎన్నికల్లో తిరువనంతపురం కార్పొరేషన్‌ను కైవసం చేసుకోవడం బీజేపీకి కలిసివచ్చిన అంశాలే! లోక్‌సభ ఎన్నికల్లో 11 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీకి ఆధిక్యత లభించగా అందులో 2 ఎస్సీ రిజర్వుడు స్థానాలున్నాయి. ఈ పరిణామాలన్నీ అటు యూడీఎఫ్ లో, ఇటు ఎన్డీయేలో కొత్త ఆశల్ని పెంచాయి. పరిమిత వర్గాల్లోనే అయినా దళితుల్లో బీజేపీ బలపడటం సీపీఎం కు ఎంతో ఆందోళన కలిగిస్తున్న అంశం.

చీలిక విసిరిన సవాల్

దళిత ఉప కులాల్లో వచ్చిన చీలిక రాజకీయ పక్షాలకు సవాల్-అవకాశంగా మారింది. ఇంతకాలం దళితుల మూకుమ్మడి మద్దతు పొందుతున్న ఎల్డీఎఫ్‌కు ఇదొక సమస్యగా పరిణమించింది. చీలికలు అటు యూడీఎఫ్‌కు ఇటు ఎన్డీయేకు ఎంతో కొంత మేలు చేస్తున్నాయి. ఫలితంగా రిజర్వుడు స్థానాల్లో రాజకీయ వాతావరణం వేగంగా మారుతోంది. మొత్తం కేరళలో ఎస్సీల జనాభా 9 శాతంగా ఉంది. దళితుల్లో ప్రధానంగా ఉన్న పులియలకు తోడు పరయ, కురవ, కనక్కన్, తండన్ వంటి ఉపకులాలున్నాయి. రెండు ఎస్టీ రిజర్వు స్థానాల్లో కాంగ్రెస్ గెలుస్తూ వస్తున్నా, 14 ఎస్సీ రిజర్వుడు స్థానాల్లో 12 చోట్ల ఎల్డీఎఫ్ వరుస ఎన్నికల్లో గెలుస్తూ వస్తోంది. మిగిలిన రెండు స్థానాల్లో ఒకటి కాంగ్రెస్ చేతిలో ఉంటే మరొక స్థానంలో స్వతంత్య్ర అభ్యర్థి గెలుపొందారు. రాబోయే ఎన్నికల్లో ఎస్సీ రిజర్వుడు స్థానాల్లో యూడీఎఫ్ ఆధిక్యత 3-6 స్థానాలకు పెరిగితే ఎల్డీఎఫ్ పట్టు 10-7 స్థానాలకు పరిమితం కావచ్చనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. దళితుల మద్దతు ఇదే దామాషా ఇతర సాధారణ నియోజకవర్గాల్లోనూ ప్రతిబింబిస్తే ఎల్డీఎఫ్ ఆ మేర నష్టపోయే ఆస్కారం ఉంటుంది. దళితుల్లో అధిక సంఖ్యాకులైన పులియ సామాజికవర్గంపైన కమ్యూనిస్టులకు గట్టి పట్టుంది. ఎస్సీల్లోని ఇతర ఉపకులాలు సహజంగానే దాన్ని వ్యతిరేకిస్తున్నాయి. కేంద్రంలోని బీజేపీ నేతృ త్వపు ఎన్డీయే ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకున్న ఎస్సీ వర్గీకరణ అంశం కూడా ఎస్సీల్లో కుల వివాదాలకు, వైషమ్యాలకు, తద్వారా చీలికకు హేతువవుతోంది. అది కూడా పరోక్షంగా కమ్యూనిస్టులు దళితుల్లో పట్టుకోల్పోవడానికి కారణంగా నిలుస్తోంది. పార్టీ సైద్దాంతికంగా మందగిల్లడం, ఇతరేతర కారణాల వల్ల పులియ వర్గంలోనూ కమ్యూనిస్టులకు కొంత పట్టు సడలింది. సంప్రదాయ పులియల్లో బలంగా ఉండటం వల్లే ఎల్డీఎఫ్‌కు కంచుకోటలుగా ఉన్న అలప్పుజ, కొల్లాం, కుట్టనాడ్ వంటి ప్రాంతాల్లోనూ అధికార/ప్రభుత్వ వ్యతిరేకత వల్ల 2025 స్థానిక ఎన్నికల్లో వారి ఆధిపత్యానికి గండిపడింది. కురవ సామాజికవర్గ మద్దతు పరంగా ఎల్డీఎఫ్ కు గట్టి పట్టున్న దక్షిణాది జిల్లాలు కొల్లాం, పత్తనంతిట్టలలోనూ కులాల్లో వచ్చిన చీలిక వారిని బలహీనపరిచింది.

ప్రజానాడి సంకేతాలే కీలకం…

ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తూ స్థానిక స్వపరిపాలనను పటిష్టపరచుకున్న కేరళలో గత స్థానిక ఎన్నికలు జనం మనోగతాన్ని కొంతమేర వెల్లడి చేశాయి. అలా చూసినపుడు 2021 అసెంబ్లీ ఎన్నికల్లో తీర్పుకు భిన్నమైన ఫలితాలు 2025 స్థానిక ఎన్నికల్లో వచ్చాయి. అవి యూడీఎఫ్, ఎన్డీయేకు కొంత ఆశావహంగానే ఉన్నాయి. వరుస రాజకీయ పరిణామాల్లో వచ్చిన మార్పు, దళిత ఉప కులాల్లో వచ్చిన చీలిక పాలక ఎల్డీఎఫ్ వ్యతిరేక వాతావరణాన్నే స్పష్టం చేస్తోంది. అందుకే గాలి వామపక్ష కూటమికి వ్యతిరేకంగా వీస్తున్న ప్రారంభ సంకేతాలు వెలువడుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకున్న దాదాపు మూడు మాసాల వ్యవధిలో పరిస్థితులు ఇంకా ఎలా మారనున్నాయో వేచి చూడాల్సిందే!

dilip reddy
-దిలీప్ రెడ్డి,
పొలిటికల్ ఎనలిస్ట్, పీపుల్స్ పల్స్ రిసర్చి సంస్థ డైరెక్టర్.

Author

dhoni.raju219@gmail.com

Related Posts

Literature: Where Books Live, Civilization Breathes….

World Book Day: A home is not measured by its size, but by the books it holds. A society is not judged...

Read out all
dilip reddy

journalism: సత్యాన్వేషణలో 37ఏళ్లు…!

Journalism: జర్నలిజం అంటే కేవలం వృత్తి కాదు… అది ఒక బాధ్యత. ప్రజల తరఫున నిజాన్ని వెలికి తీయడం, అధికారాన్ని ప్రశ్నించడం, సమాజానికి దిశా నిర్దేశం చేయడం ఇవన్నీ కలగలిపిన...

Read out all

National: ప్రత్యామ్నాయంతోనే ఏకాభిప్రాయం…!

Delimitation: నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేష‌న్ అమలు – కీలకమైన ఈ రెండు అంశాల్లో ఏకాభిప్రాయం సాధన దేశంలో ఒక సవాల్‌గా తయారయింది. వీటితో ముడిపడి ఉన్న కొన్ని సున్నితాంశాల్లో...

Read out all

DacoitReview: A Visually Rich Emotional Thriller That Falls Slightly Short of Its Potential

Dacoit Movie Review:  Rating: 3.25/5 By Anrwriting/ Film critic  Story: Dacoit revolves around Hari Das (Adivi Sesh), a man from a marginalized...

Read out all

tollywood: ఐకాన్ స్టార్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన TFJA టీం…

Tollywood: హైదరాబాద్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా (TFJA) సభ్యులు కలిసి ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా TFJA ప్రతినిధులు 2026 సంవత్సరానికి...

Read out all

“Biker Review: Style Over Substance in This Racing Drama”

BikerMovie Review: Rating : (2.75/5) By Anrwriting /Film Critic In an era where sports dramas often rely on emotional depth to leave...

Read out all
Optimized by Optimole