ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించింది కేంద్ర ఎన్నికల సంఘం. మొత్తం ఏడు విడతల్లో పోలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపింది. యూపీలో ఏడు విడతల్లో పోలింగ్ జరగనుండగా,మణిపూర్‌లో రెండు, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవాల్లో ఒకే విడతల్లో పోలింగ్ ముగియనుంది. మార్చి 10న ఓట్ల లెక్కింపు చేపడతామని ప్రకటించింది ఎన్నికల కమిషన్. కరోనాను దృష్టిలో పెట్టుకున్ని అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని, ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ వేగంగా పూర్తి చేయాలని ఆదేశించింది.
ఇక షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు నిర్వహించడం ప్రజాస్వామ్యానికి నిదర్శనమన్నారు సీఈసీ సుశీల్ చంద్ర. కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉండడంతో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పారు. గతంలో కంటే 16 శాతం పోలింగ్ కేంద్రాలు పెంచామన్నారు. మొత్తం ఐదు రాష్ట్రాల్లో 2 లక్షల 15 వేలకు పైగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఒక్కొ పోలింగ్ బూత్‌లో ఓటర్ల సంఖ్యను 1600 నుంచి 1250కి కుదించినట్లు చెప్పారు. మొత్తం 5 రాష్ట్రాల్లో 18 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకుంటారని తెలిపారు.
అటు కరోనా వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో.. రెండు డోసులు తీసుకున్న వారే పోలింగ్ సిబ్బందిగా ఉంటారని….వారికి ప్రికాషనరీ డోసు కూడా ఇస్తామని ప్రకటించారు సుశీల్ చంద్ర. జనవరి 15 వరకు ర్యాలీలు, పాదయాత్రలపైనా నిషేధం విధించారు. డోర్ టూ డోర్ క్యాంపెయిన్‌లో ఐదుగురికి మించి ఉండరాదన్నారు. కౌంటింగ్ తర్వాత విజయోత్సవ ర్యాలీలపైనా నిషేధం విధించారు. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో నామినేషన్ దాఖలు చేసేందుకు వెసులుబాటు కల్పించారు. కరోనా పాజిటివ్ ఉన్న ఓటర్ల కోసం పోస్టల్ ఓటుకు అవకాశమిచ్చినట్లు చెప్పారు. ఎన్నికల్లో అభ్యర్థుల వ్యయ పరిమితి 40 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. ప్రతి నియోజకవర్గంలో ఒక పోలింగ్ బూత్‌ను మొత్తం మహిళల చేతుల మీదుగా నడిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.