సూపర్ స్టార్ సోదరుడు మృతి.. షాక్ లో అభిమానులు!

సూపర్ స్టార్ కృష్ణ తనయుడు, మహేశ్ బాబు సోదరుడు…ఘట్టమనేని రమేశ్ బాబు అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన….శనివారం తీవ్ర అస్వస్థతకు గురవడంతో హుటహుటీన AIG ఆసుపత్రికి తరలిస్తుండగా తుదిశ్వాస విడిచారు.
కాగా రమేష్ బాబు అల్లూరి సీతారామరాజు చిత్రం ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. మోసగాళ్ళకు మోసగాడు, దేవుడు చేసినమనుషులు చిత్రాల్లో నటించి తండ్రికి తగ్గ తనయుడిగా పేరుతెచ్చుకున్నారు. ఏడేళ్ల విరామం అనంతరం సామ్రాట్ చిత్రంతో కథానాయకుడిగా ఆకట్టుకున్నారు.ఆయన దాదాపుగా 15 సినిమాల్లో హీరోతో పాటు వివిధపాత్రల్లో నటించారు.1997 నుంచి నటనకు దూరంగా ఉన్న ఆయన..2004లో మహేశ్ బాబు హీరోగా నటించిన అతిథి చిత్రానికి నిర్మాతగా మారారు. కొన్ని చిత్రాలకు సమర్పకునిగా కూడా వ్యవహరించారు.

అటు రమేశ్‌బాబు మృతి పట్ల ఘట్టమనేని ఫ్యామిలీ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసింది. రమేశ్‌బాబు మన హృదయాల్లో ఎప్పటికీ చిర స్థాయిగా నిలిచి ఉంటారని పేర్కొంది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా శ్రేయోభిలాషులందరూ కొవిడ్‌ నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేసింది.

రమేశ్‌బాబు మృతి పట్ల రాజకీయ ప్రముఖులు, అభిమానులు,ఆత్మీయులు సోషల్ మీడియా వేదికాగా సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఆయన కుటంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. కృష్ణ నట వారసుడిగా చిత్ర నిర్మాణంలో రమేశ్‌బాబు విజయాలు సాధించారని ఆయన పేర్కొన్నారు. రమేశ్‌బాబు కుటుంబ సభ్యులకు మనోస్థైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థిన్నట్లు పవన్‌ కల్యాణ్‌ తెలిపారు.