ప్రధాని మోదీ పంజాబ్ పర్యటనలో తలెత్తిన భద్రతా వైఫల్యంపై విస్తృత చర్చ నడుస్తోంది. ప్రధాని భద్రతా ఏర్పాట్ల వ్యవహారం కాక పుట్టిస్తున్న వేళ.. సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ప్రధాని పంజాబ్ పర్యటన భద్రతా లోపాలకు సంబంధించిన అన్ని ఆధారాలు, రికార్డులు సుప్రీంకోర్టు రిజిస్ర్టార్ జనరల్‌కు అందజేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈనేపథ్యంలో ఇదే అంశంపై దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా బీజేపీ నేతలు నిరసనలు చేపట్టారు.
కాగా ప్రధాని మోదీ భద్రతకు భంగం కలిగిందని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాలని దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. విచారణ సందర్భంగా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తన వాదనలు వినిపించారు. ప్రధానికి భద్రతా వైఫల్యం వెనక ఉగ్రవాదుల హస్తాన్ని తోసిపుచ్చలేమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. భద్రతా వైఫల్యం ఘటనపై కేంద్రం కమిటీ వేసిందని, రాష్ర్టాలకు నోటీసులు జారీ చేశామని అటార్నీ జనరల్ వేణుగోపాల్ ధర్మాసనానికి తెలిపారు. అన్ని రికార్డులను కోర్టుకు సమర్పించడంతో పాటు.. తాము ఆందోళనపడుతున్న విషయాలను కూడా కోర్టుకు వివరిస్తామన్నారు. విచారణను సోమవారం వరకు వాయిదా వేయాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోరారు.
ఇక దేశ రాజధాని దిల్లీలోని రాజ్‌ఘాట్ వద్ద మౌన దీక్ష చేపట్టారు బీజేపీ ఎంపీలు. ‘భారత్ స్టాండ్స్ విత్ పీఎం మోదీ’ అని ప్లకార్డులు పట్టుకొని గంట సేపు నిరసన తెలియజేశారు. పంజాబ్ కాంగ్రెస్ ప్రభుత్వం దేశానికి క్షమాపణలు చెప్పాలని నినాదాలు చేశారు.
అటు గుజరాత్‌లో బీజేపీ అధ్యక్షుడు సీఆర్ పాటిల్ నేతృత్వంలోని బృందం.. గవర్నర్ ఆచార్య దేవ్‌వ్రతాను కలిసి మెమోరాడం సమర్పించింది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కు అందించాల్సిందిగా కోరారు నేతలు. సీఎం భూపేంద్ర పాటిల్ కూడా నేతలు కలిసిన బృందంలో ఉన్నారు.
ఇటు పంజాబ్ ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టులో వాదించింది. భద్రతా వైఫల్యం విషయాన్ని అంత తేలికగా తీసుకోవడం లేదని పంజాబ్ అడ్వకేట్ జనరల్ తెలిపారు. ఎక్కడో లోపం జరిగిందని, ప్రతి అంశాన్ని సీరియస్‌గా తీసుకున్నామని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ వ్యవహారంపై ఇప్పటికే రిటైర్డ్ హైకోర్టు జడ్జి నేతృత్వంలో కమిటీ వేశామని, విచారణ జరుగుతోందని కోర్టుకు తెలిపారు. లోపం ఎవరి వైపు నుంచి జరిగింది..? స్పెషల్ ప్రొటక్షన్ గ్రూపు వైపు నుంచా లేక పంజాబ్ పోలీసులదా అనేది తేలుతుందని వివరించారు.