జనవరి 26 నుంచి పాదయాత్ర : గిడుగు రుద్రరాజు

ఏపీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు జనవరి 26వ తేదీ నుంచి పాదయాత్ర చేపట్టనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాల వైఖరికి నిరసనగా  పాదయాత్ర నిర్వహించనున్నట్లు మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. సామాన్య కార్యకర్తకు గొప్ప హోదా కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందన్నారు. నూరేళ్ల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ విధానాలే మౌలిక మార్పులు చేసుకుంటూ నేటికీ అమలవుతున్నాయన్నారు. కాంగ్రెస్ పెద్దలందరితో కలిసి పనిచేసిన అనుభవం కలిగిన తాను.. పీసీసీ పదవిలా కాకుండా బాధ్యతగా భావిస్తానన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తొలి రోజుల్లో నాటి ప్రధాని నెహ్రూ పార్టీకి సంబంధం లేని వారికి సైతం మంత్రి పదవులు ఇచ్చి గౌరవించారని గుర్తు చేశారు. నెహ్రూ ఆలోచనల ప్రకారం ప్రతి గ్రామాన్ని ఒక దేవాలయంలా చూడాలని రుద్రరాజు స్పష్టం చేశారు. 

రుద్రరాజును కలిసిన అమరావతి రైతులు..

ఇదిలా ఉంటే..అమరావతి రైతులు గిడుగు రుద్రరాజుని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాజధాని విషయంలో వైసీపీ ప్రభుత్వ విధానాలు.. రైతులకు కౌలు విధివిధానాల గురించి రుద్రరాజు రైతులను అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ  రైతుల ఉద్యమానికి అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. ఇటీవల భారత్ జోడో యాత్ర లో భాగంగా రాహుల్ గాంధీ  అమరావతి రైతులకు ఈ విషయాన్ని స్పష్టం చేసినట్లు గుర్తుచేసారు.

 

Optimized by Optimole