Nancharaiah merugumala :(senior journalist)
=======================
“తమిళ వైష్ణవ బ్రాహ్మణ మాజీ పెద్ద పోలీసు నరసింహన్ గారిని పదేళ్లు భరించిన తెలుగోళ్లకు కన్నడ ముస్లిం మాజీ సుప్రీం జడ్జీ నజీర్ సాబ్ ను గవర్నర్ గా అంగీకరించడం అంత కష్టమా?”
అవశేషాంధ్ర ప్రదేశ్ మూడో గవర్నర్ గా సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జీ జస్టిస్ సయ్యద్ అబ్దుల్ నజీర్ నియామకంపై తెలుగునాట కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటక తీర ప్రాంతానికి చెందిన నజీర్ సాబ్ కొన్ని వివాదాస్పద అంశాలపై తీర్పులు ఇచ్చిన మాట వాస్తవమే. ముఖ్యంగా అయోధ్య వివాదంలో హిందువులకు అనుకూలంగా నిర్ణయం ప్రకటించిన న్యాయమూర్తుల బృందంలో ఆయన ఒకరు. అలాగే ఆయనను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదవీవిరమణ చేసిన 40 రోజులకే గవర్నర్ కుర్చీలో కూర్చోబెట్టడం కూడా నిజమే.
కాని, 2009 నుంచి 2019 వరకూ పదేళ్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా ఐదేళ్లూ, విభజిత రెండు తెలుగు రాష్టాల (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్) గవర్నర్ గా ఏకకాలంలో మరో ఐదేళ్లు పనిచేశారు ఈఎస్ ఎల్ నరసింహన్ గారు. తమిళ వైష్ణవ బ్రాహ్మణుడైన ఎక్కాడు శ్రీనివాసన్ లక్ష్మీ నరసింహన్ 1968 బ్యాచ్ ఏపీ కేడర్ ఐపీఎస్ అధికారి. యూపీఏ హయాంలో గవర్నర్ గా నియమితులవడానికి ముందు 2005–2006 మధ్య దాదాపు రెండేళ్ల పాటు ఆయన కేంద్ర కేంద్ర గూఢచారి నిఘా సంస్థ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) అధిపతిగా (డైరెక్టర్) పనిచేశారు. 2009 సెప్టెంబర్ మొదటి వారం సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం తెలంగాణ ఉద్యమం ఊపందుకున్న సమయంలో సీఎంగా ఉన్న కొణిజేటి రోశయ్య గారు ముచ్చెమటలతో ఏపీని పరిపాలిస్తున్న రోజులివి. తెలంగాణ ఆందోళనతో రాష్ట్రం వేడెక్కిన సమయంలో నాటి గవర్నర్ నారాయణ్ దత్ తివారీ పరాయి ఆడపిల్లలతో నగ్నంగా కలిసి ఉన్న వీడియో ఒకటి బయటికి వచ్చింది. దాంతో ఆయన స్థానంలో నరసింహన్ వచ్చారు.
ఇంటెలిజన్స్ బ్యూరో డైరెక్టర్ గా పనిచే సిన మాజీ ఐపీఎస్ అయిన ఆయన సీఎం రోశయ్యగారికి ధైర్యం ఇవ్వడంతోపాటు, తెలంగాణ ఉద్యమంపై గట్టిగా కన్నేస్తారనే ఉద్దేశంతో యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీయే స్వయంగా ఆయనను ఎంపికచేశారని వార్తలు కూడా వచ్చాయి. శ్రీవైష్ణవులైన నరసింహన్ గారు, ఆయన భార్య విమల గారు సాంప్రదాయ తమిళ బ్రాహ్మణ పద్ధతిలో పంచె, చీర కట్టుకుని హైదరాబాద్ నగరంలోని వైష్ణవాలయాలకు రోజు పోతూ ట్రాఫిక్ కు అంతరాయం కలిగించిన విషయం ఇంకా నగర ప్రజలు మరిచిపోలేదు. వైష్ణవ కట్టూబొట్టూతో ఈ పుణ్యదంపతులు ఇద్దరూ లక్ష్మీనారాయణులు మాదిరిగా కొందరికి కనిపించేవారు. ఐబీ మాజీ చీఫ్ గా ప్రజా ఉద్యమాన్ని అణచివేయడానికి ఏమీ చేయలేదు గాని తెలంగాణ వచ్చాక ఓసారి ఉమ్మడి రాజధాని హైదరాబాద్ పై మాత్రం తనకు ప్రత్యేక అధికారాలున్నాయంటూ సీఎం కేసీఆర్ ను బెదరగొట్టే ప్రయత్నం చేసి విఫలమయ్యారు నరసింహన్. ఏపీ విభజన జరిగాక కూడా రెండు రాష్ట్రాలకు ఆయన మరో ఐదేళ్లు గవర్నర్ గా ఉండడం నిజంగా విష్ణు మాయే అనుకోవాలి. కేంద్రం ఆధిపత్యాన్ని అడ్డుకునే విషయంలో తెగువ తక్కువ ఉన్న తెలుగువారు పదేళ్లు ఈ మాజీ పోలీసును ‘రాజ్యపాల్’గా భరించారు. ఇంత గొప్ప చరిత్ర పెట్టుకున్న కోస్తా, రాయలసీమ తెలుగుజనం సుప్రీం మాజీ జడ్జీ జస్టిస్ నజీర్ గారు గవర్నర్ పదవిలో ఉండగా నష్టపోయేది ఏమీ ఉండకపోవచ్చు.