Literature:
ఒక గానం… ఒక ధ్యానం… గుల్జార్
గుల్జార్ కవితాత్మ ….. సాబిర్ షా ..2
మీ ఖాళీ సమయంలో ఎప్పుడైనా కవిత్వం చదివి చూడండి. పదాలకూ బాధ ఉంటుందని మీరూ నమ్ముతారు. ఇంత అందమైన ఎక్స్ప్రెషన్ ఉందంటే, అది గుల్జార్ రాసిందేనని పాఠకుడు తేలిగ్గా గుర్తుపడతాడు. బషో లాంటి జపనీయ హైకూ మహాకవుల వారసత్వానికి పుట్టిన భారతీయ కవి గుల్జార్. మృదువైన ఆలోచన, పదునైన వ్యక్తీకరణ… విరబూసే భావుకత్వం ఈ కవి సొంత ఆస్తి. రాఖీ అనే సౌందర్యరాశీ, గొప్పనటి వూరికే ప్రేమిస్తుందా మరి..!
మనకు అంతగా పట్టని, లేదా మనం గుర్తించని జీవితపు లోతుల మీద ఇంత కాంతిని వెదజల్లుతాడు. నాలుగైదు లైన్లే… పోనీ ఆరేడు పంక్తులే. ఆయన పదాల్లో ఓ కొత్త సత్యం ఆవిష్కారం అయ్యే తీరు పూలపరిమళంలాగా మనల్ని చుట్టుకుంటుంది. కల్లోలిత హృదయానికి ఇంత శాంతిని ప్రసాదిస్తుంది. కొద్దిసేపట్లోనే గుల్జార్ అనేవాడు మనికి స్నేహితుడూ, గురువూ, తండ్రి అయిపోతాడు.
ఆయన అసలు పేరు సంపూరన్ సింగ్ కల్రా. పంజాబ్లోని జీలం జిల్లాలో 1934 ఆగస్ట్ 18న పుట్టాడు. దేశవిభజనని కళ్ళారా చూసిన ఆ కుర్రాడు, ముంబై వీధుల్లో కవిగా మొగ్గతొడిగాడు. కొన్ని తరాలను ఊగించి ఉత్తేజపరిచాడు. లోతైన తాత్వికతను తాకే కన్నీటి అక్షరాలను కనిపెట్టినవాడు.
వర్షపు చినుకులు, పూల సుగంధం, రాత్రి నిశ్శబ్దం ఆయన కవిత్వంలో పాత్రధారుల్లా అనిపిస్తాయి.
ఉర్దూ భాషామాధుర్యం, హిందీ సారళ్యం కలిసి ప్రవహించే ఆయన కవిత్వం అనువాదంతో పనిలేకుండా పాఠకుణ్ణి అనునయంగా పలకరిస్తుంది. సాహిత్యం, సినిమా, సంగీతం…
ఈ మూడు రాగాలూ కలిసి పలికాయంటే, అది నిస్సందేహంగా గుల్జార్ సంతకం..! సాదాసీదాగానే రాస్తూ.. లోతైన గాయాలు చేయటం అనే విద్యలో నేర్పరి అతను.
“రాత్ పాస్మినాకా”, ” పర్ఛాయియా”, “గుల్జార్ నజ్మే” వంటి కవితా సంపుటాలు ఉత్తరాదిని వూగించాయి. దక్షిణాదిని దహించివేశాయి.
“తేరే బినా జిందగీ సే కోయీ… షిక్వా… తో నహీ..” అంటూ ప్రేమలోని బాధను పలికిస్తాడు. మరిచిపోగలమా…? వేదన, విరహం, దూరం, దగ్గరితనం, నిశ్శబ్దంగా మనల్ని చుట్టుకుంటాయి. తేలికైన, సున్నితమైన మాటల కూర్పులోనే ఉర్దూ పదజాలపు రుచిని కలిపి మనల్ని ఊరిస్తాడు. ఉర్దూ కవిత్వంలో ఉండే సౌండ్ ఆఫ్ మ్యూజిక్ వినిపిస్తాడు. గుల్జార్ వాన గురించి రాస్తే, ఆ వర్షపు చినుకుల చప్పుడు వినిపిస్తుంది. జపాన్ హైకూ తల్లి కనిపెంచిన భారతీయ బిడ్డ గుల్జార్. ఆ మహోన్నత సంప్రదాయం పరిచిన కాంతి దారుల్లో నడిచి తరించిన కవి గుల్జార్.
రోజువారీ జీవితంలోని చాయ్, చెప్పులు, వీధిదీపం, రాత్రిగాలి లాంటి అతి సాధారణమైన వాటిని తాత్విక అనుభూతులుగా మార్చేస్తాడు. ఆయన సాహిత్యమే పాట. ఆయన పాటే సాహితీ సౌరభం. దృశ్యాన్ని కవితలా మన కళ్ళకు కానుకగా ఇచ్చి, కవి గనక అదృశ్యమైపోతే… అతనే గుల్జార్. నిలువెల్లా విరజాజుల వనమై పరిమళించే భారతీయ కవితాత్మ పేరే… గుల్జార్. మన గర్వం గుల్జార్. మన సాహితీసర్వం గుల్జార్. అంతలా… గుండెల్లో గుచ్చుకునే గుల్జార్ కవితను తెలుగులోకి తేవటం సాహసమే. తెలివినీ, సాహసాన్ని పక్కనపెట్టి, భావుకత్వాన్ని ప్రేమతో తోడు పెట్టి.. అనువాదం చేసి మనకు అందించిన సాబీర్ షా, గుంటూరు జిల్లా తెనాలికి చెందినవాడు. ఏ మాత్రం తిన్నమైనవాడు కాదు. ఒకదానికొకటి సంబంధంలేనివి చేస్తుంటాడు. ఫిజిక్స్ ఎమ్సెస్సీ చేసి, హైస్కూలులెక్కల మాస్టారుగా కుదురుకున్నాడు. ఆ ఫిజిక్సూ.. లెక్కలకీ కవిత్వానికీ బంధుత్వం కుదరదు కదా. మరి ఎలా..?
సాబీర్ నడిచివచ్చిన దారి అతన్ని ఆకుపచ్చని చేతులు సాచి పిలిచింది. అమ్మ రహీమున్నిసా,
నాన్న అబ్దుల్ మునాఫ్- ఇద్దరూ ఉర్దూ అరబ్బీ భాషల్లో పండితులు. అమ్మ ఖవ్వాలీ పాడిందంటే.. దీవాలీ మనింటికి వచ్చినట్టే. ముస్లిం సంప్రదాయంలో ఉండే సాహితీ స్వరార్చన “మిలాద్”లో తను లేకుండా మహెఫిల్ ఉండేదే కాదు. బేగం అక్తర్, నూర్జహాన్ బాణీల్లో పదాలను కూర్చి అమె “ఖసీదా” పాడితే ఊరుఊరంతా పులకించిపోయేది. నాన్నకూ సంగీతం ఇష్టమే. “ఏక్ ప్యార్ క నగ్మా హై.. మౌజోంకీ రవానీ హై” వింటే ఆయన గొంతులోనే వినాలి. ఇంటిలో విరిసే సంగీత సాహిత్యాలే సాబీర్ ని భావుకుణ్ణి చేశాయి.
ఆ స్వచ్ఛమైన కవిత్వ వాతావరణమే గుల్జార్ అనే పూలతోటలోకి దారి చూపించింది. ప్రేమో, విషాదమో, కన్నీరో, పారవశ్యమో, విరహవేదనో… రఫీ, కిషోర్ పాటల్ని కూడా అంతే గంభీరంగా పాడతాడు.
సాబీర్ తెలుగు పలికించిన తీరు హృదయాన్ని కదిలిస్తుంది. గుల్జార్ సిక్కు, సాబీర్ ముస్లిం… భారతీయతత్వం అనే తల్లివేరు నుంచి వచ్చిన రెండు పచ్చనాకుకొమ్మలివి. జీలం నదీ కెరటాలు, కృష్ణా నదీతరంగాలను గలాగలా పలకరించినట్టుగా..
గుల్జార్ అనునాదం , సాబీర్ అనువాదం మనల్ని పరవశింపజేస్తాయి.
ఇప్పటికే కొన్ని సినిమాలకు రచయితగా ఉన్నాడు. యాదోంకీ బారాత్ అని బాల్య జ్ఞాపకాలను అందంగా రికార్డ్ చేశాడు. కొన్ని వందల కవితల్ని శ్రద్ధగా తర్జుమా చేస్తున్నాడు. ఇప్పుడో సినిమాకు కథ, మాటలు రాసి, దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మల్టీ టాలెంట్ కి అత్యవసరమైన క్రమశిక్షణకీ అలవాటుపడి ఉన్నాడు. సువాసన వెదజల్లే వాక్యాన్ని ఎంత తేలికగా రాస్తాడో, గొంతెత్తితే రఫీ, కిషోర్ పాటల్ని కూడా అంతే గంభీరంగా పాడతాడు. అది గానమా..? గజలా..? సంగీతమా..? కవిత్వమా..? సినిమానా..? సెంటిమెంటా..? ఏదైనా ఒకటే సాబీర్ కి. ప్రేమించటం ఒక్కటే తెలుసు.
అది పూలమొక్కా, టీ ఇచ్చే కుర్రాడా, కారు డ్రైవరా, గుల్జారా, గుంటూరు గోంగూర పచ్చడా.. ఏదైనా ఒక్కటే ఈ కవికి. ఒక్కగానొక్క కూతరు షాహిస్తా పేరులోని మొదటి అక్షరాన్ని చేర్చుకొని సాబీర్ షాగా రచనలు చేస్తున్న సాబీర్ , కొమ్మూరులో నేరేడు మొక్కయి మొలిచినవాడు.. కనగాలలో గంధపు చెట్టయి వెలిగినవాడు.. బతుకు రుచి తెలిసినవాడు… నీ కిటికీలో మెరిసే నెలవంక…వాడు.
– TAADI PRAKASH
