రాదిరె: శిశిర కాలపు శీతగాలి ఒరిపిడి పెడుతోంది. స్వెటర్ కూడా లేదు, వేడి వయసు బద్దకమేమో… కొనాలి అనుకుంటూనే వాయిదా వేస్తున్నా. ఏముందిలే, ఒకపూటేగా….! ఆ ఉత్సాహం, ఆ ఉద్వేగం మాత్రం చూడాలి! ఎందుకనుకున్నానో… ఆ పూట అలా ఫిక్సయిపోయా! 1989 జర్నలిజం వృత్తిలోకొచ్చి నెలలు అవుతోందంతే! రిపోర్టింగ్ కి రాలేదింకా… ట్రయినీ సబెడిటర్ గానే వున్నా! సోమాజీగూడ ఆఫీస్ లో పని కాస్త తొందరగానే ముగించుకొని, బయటపడేటప్పడికి 8 దాటినట్టుంది. జాగుచేయకుండా నేరుగా నిజాం కాలేజీ గ్రౌండ్ కి చేరుకున్నా! క్రిక్కిరిసిన మైదానం కిటకిటలాడుతోంది. ఉద్వేగం… పోటెత్తిన సంద్రపు అలల్లా ఎగిసిపడుతుంటే… మొత్తం మైదానమంతా పూనకం వచ్చినట్టే ఊగిపోతోంది. దానికి కేంద్రబిందువైన గరిమనాభి మాత్రం ఓ మూలన వేదికై వెలుగులు చిమ్ముతోంది. వేదిక మీద చాలా మందే ఉన్నారు, వారి నడుమ నల్ల గొంగడి భుజానేసుకొని గద్దర్ వెలిగిపోతున్నాడు. నూనుగు మీసాల డప్పు రమేశ్ యువకిశోరంలా ఉన్నాడు. ఇంకా చాలా చాలా మందే! సాంస్కృతిక సంఘాల మహిళలూ వున్నారు. ఉపన్యాసాలు కాదుగానీ… మధ్యమధ్య మాటలతో పాట రాజ్యమేలుతోంది. అవతలి కొసనున్న స్టేజీ నుంచి ఈ అంచునున్న బషీర్ బాగ్ చౌరస్తా వరకు కదులుతున్న కడలిలా వుంది. జనం నిర్నిమేషంగా స్పందిస్తున్నారు. అప్పటిదాకా…. అదిమిపెట్టి అమలు పరచిన రాజ్యపు నిర్బంధం వీడి, స్వేచ్చ… ఒక్కసారిగా మాటై పేలిన ఉద్వేగపు హోరు, ఓ గానమై వీచిన పెనుగాలి, పాటై కదం తొక్కిన పరవళ్లు కలగలిసి అంతటి ఉర్రూతలు పుట్టించాయి! ఎవర్ని ముట్టుకున్నా షాక్ కొట్టేంత అండర్ కరెంట్ దాదాపు ఆహుతులు అందరిలోనూ ప్రవహించింది! కాలం కళ్లుగప్పి గంటలలా గడిచిపోతున్నాయ్! నేను మధ్యరాత్రి పన్నెండు వరకున్నట్టున్నా! బషీర్ బాగ్ వెనుక, స్కైలైన్ థియేటర్ లేన్ లోంచి, నేను నివాసముంటున్న దోమల్ గూడాకు నడిచి వెళ్లా! అలా నడచి వెళుతున్నపుడు నాకొచ్చిన ఓ ఊహాత్మక ఆలోచన… నాకే గగుర్పాటును కలిగించింది. నాటి వేదిక నుంచి చిటికె పడ్డ శబ్దానికి, మువ్వ కదిలిన రవానికి, డప్పు మోగిన దరువుకు, గొంతు పెగిలే పాటకు, పెదవి పలికే మాటకు…. ఇలా ప్రతి కదలికకు స్పందిస్తున్నారు, ఏది చెవినపడ్డా ఉవ్వెత్తున సాగర కెరటంలా లేస్తున్నారు! ఆ క్షణంలో ఎవరైనా కొంచెం చొరవతోనో, ఒకింత తెగింపుతోనో……
“ఎంతకాలమీ నిర్బంధం? ప్రజాపోరులో బంధీలైన మన ఉద్యమ సోదరులు కొందరు బలవంతంగా జైళ్లలో మగ్గుతున్నారు. ఇంకెంతకాలమిలా….? పదండి, ముషీరాబాద్ లో ఉన్న మన వాళ్లను, గేట్లు బద్దలుగొట్టి మనతో తెచ్చుకుందాం” అనుంటే, పరిస్థితేంటి? అనే సందేహాలు, ప్రశ్నలు, పరిపరి ఆలోచనలు…. చీకట్లో నడుస్తున్న నన్ను చుట్టుముట్టాయి. అవును, అదే జరిగితే…. అంతటి ఉద్విగ్నత నిండిన జనవాహిని, కట్టలు తెంచుకు ప్రవహించే కడలి అయితే… అడ్డుకునే పోలీసు యంత్రాంగం, శక్తి, వ్యవస్థ వుంటుందా? ఆ జనోజ్వల ప్రవాహాన్ని అక్కడికక్కడ, అప్పటికప్పుడు అడ్డుకోవడం సాధ్యమయ్యేదా?
అదుగో, నాటి అంతటి ఉద్వేగపు, ఉద్విఘ్నపు , ఉద్రేకపు జనసంద్రానికి నూక్లియస్ అయిన మన గద్దర్!
తెలుగునాటనే కాదు మొత్తం భారతదేశంలోనే… ప్రజా ఉద్యమానికి పాటై ఊపిరులూదిన ఓ శకం గద్దర్!
జీవన చరమాంకంలో ఆలోచన, ఆచరణ, వ్యవహారం, వ్యక్తిత్వం…. మారినా, విప్లవోద్యమానికి ఆయన అందించిన తోడ్పాటుకు యే కళంకమూ అంటదు. అదదే, ఇదిదే!
ప్రశ్నించే ఓ గొంతుక,
పల్లె పదమై, పాటై పలికిన ప్రతీక,
ప్రజను పోరుబాట పట్టించిన యుద్దనౌక!