సీనియర్ హీరోయిన్ సోనాలి బింద్రే బాలీవుడ్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది.తన కెరీర్ ఆరంభంలో బాలీవుడ్ మాఫియా గుప్పిట్లో ఉండటం వలన తనకు అవకాశాలు రాలేదంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి.
2018లో క్యాన్సర్ బారి నుంచి కోలుకున్న సోనాలి.. సెకండ్ ఇన్నింగ్స్ లో ‘ది బ్రోకెన్ న్యూస్’ అనే వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ..1990లో బాలీవుడ్‌ను అండర్‌వరల్డ్ తీవ్రంగా ప్రభావితం చేసిందని.. దానివల్ల తాను ఎన్నో సినిమా అవకాశాలు కోల్పోయినట్లు వెల్లడించింది.
అప్పట్లో బాలీవుడ్ సినిమాలకు ఫైనాన్స్ పరంగా బ్యాంకుల నుంచి డబ్బులు విషయంలో సమస్యలు తలెత్తినప్పుడు.. మాఫియా నుంచి సహకారం అందేదని సోనాలి చెప్పుకొచ్చింది. దీన్ని మూలంగా నేను చేయాల్సిన పాత్రలు.. వేరేవారికి దక్కేవని ఆవేదన వ్యక్తం చేసింది. ఇదేంటని నేను నిలదీస్తే.. నా చేతుల్లో ఏమీలేదని.. అందుకే తప్పించాల్సి వచ్చిందని సదరు మూవీ డైరెక్టర్ అనేవారని.. ఆ సమయంలో తన భర్త అండగా నిలిచారని సోనాలి పేర్కొంది.