రాష్ట్రపతి ఎన్నికల్లో గెలుపెవరిది..?

దేశంలో రాష్ట్రపతి ఎన్నికలు హీటెక్కిస్తున్నాయి. దేశ అత్యున్నత పీఠంపై.. చరిత్రలో తొలిసారిగా ఆదివాసి మహిళను కూర్చోబెట్టాలని అధికార ఎన్డీఏ భావిస్తుండగా.. విపక్ష ఇంద్రధనస్సు కూటమి తమ అభ్యర్థిగా.. సుధీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న యశ్వంత్ సిన్హాను బరిలోకి దింపి అధికార పక్షాన్ని ఢీకొట్టేందుకు వ్యూహాలను రచిస్తోంది. ఇప్పటికే అభ్యర్థుల నామినేషన్లు ప్రక్రియ పూర్తవడంతో ఇరు పక్షాలు ప్రచార పర్వానికి తెరలేపారు.

రాష్ట్రపతి ఎన్నికల అభ్యర్థి ఎంపిక విషయంలో ఎన్డీఏ వ్యూహాత్మంగా వ్యవహరించింది. తొలుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును అభ్యర్థిగా ప్రకటిస్తారని అందరూ భావించారు. విపక్షాలు సైతం రాజకీయాల్లో అజాత శత్రువుగా పేరున్న వెంకయ్యనాయుడును పేరునే వెల్లడిస్తారని ఊహించారు. వెంకయ్యనాయుడితో పాటు అనసూయ ఉయికి, అజిత్ దోవల్ వంటి పేర్లు తెరపైకి వచ్చిన.. చివరకి ఆదివాసి మహిళ ద్రౌపది ముర్మును అభ్యర్థిగా ప్రకటించి షాకిచ్చింది ఎన్డీఏ.

ఇక 2017 రాష్ట్రపతి ఎన్నికల్లో దళిత కార్డు వాడిన బీజేపీ.. చరిత్రలో తొలిసారిగా సంతాల్​ తెగకు చెందిన ఆదివాసి మహిళ ద్రౌపది ముర్మును తెరపైకి తెచ్చి విపక్షాలను ఇరుకున పెట్టే ప్రయత్నం చేసింది. ముర్మును తెరపైకి తేవడం వల్ల విపక్ష కూటమిలోని కొన్ని పార్టీలు బీజేపీ అభ్యర్థికి ఓటు వేసే పరిస్థితి నెలకొంది. ఈనేపథ్యంలో జార్ఖండ్ సీఎం హేమంత్.. ముర్ముకు మద్దతు ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో ముర్ము ఆరాష్ట్రానికి గవర్నర్ గా పనిచేయడమే కాక.. ఆమె కూడా సోరెన్ సంతాల్ తెగకు చెందిన వ్యక్తి కావడంతో మద్దతు ప్రకటించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇప్పటికే బీఎస్పీ అధినేత్రి మాయావతి కూడా ముర్ముకు మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే.

అటు మహారాష్ట్రలో రాజకీయ సంక్షోబం విపక్ష ఇంద్రధనస్సు కూటమిపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. అంతేకాక కాంగ్రెస్​ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, రాహూల్​ గాంధీని ఈడీ కేసులు చుట్టుముట్టడం.. విపక్షాల ఐక్యతపై ప్రభావం చూపనుంది. ఇప్పటికే వైకాపా, బీజేడీ, బీఎస్పీ ముర్ముకు మద్దతు తెలిపాయి. ఇంద్రధనస్సు కూటమి కీలక నేత శరద్ పవార్… మహారాష్ట్ర సంక్షోభం నేపథ్యంలో రాష్ట్రపతి ఎన్నికలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించలేకపోతున్నారు. దీంతో యశ్వంత్ సిన్హా విజయం క్లిష్టతరంగా కనిపిస్తోంది.

సుధీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న యశ్వంత్ సిన్హా టీఎంసీలో చేరకముందు ఆయన బీజేపీ అభ్యర్థి కావడం గమన్హారం.అయితే ప్రధాని మోదీతో అతనికి సత్సంబంధాలు లేకపోవడంతో.. ఆయన బీజేపీ నుంచి బయటికి వచ్చి తృణముల్ లో చేరారు.ప్రస్తుతం ఆయనకు అన్ని పార్టీలతో సత్ససంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అధికార పక్షంలోని కొంతమంది సభ్యులు ఆయనకు మద్దతు నిలుస్తారని వార్తలు వినిపిస్తున్నా.. మోదీ- షా ద్వయం ముందు వారి ఆటలు సాగవన్నది జగమెరిగిన సత్యమని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.