విశీ: విమానాలు మన వేదాల్లోనే ఉన్నాయిష..!
… ఈ వీడియో ఏదో ఇంట్రెస్టింగ్‌గా అనిపించి యూట్యూబ్‌లో వెతుక్కుని చూశాను. ‘రావణుడి కోసం బ్రాహ్మణులు పుష్పక విమానం తయారు చేశారు’ అనే మాట కొంపెల్ల మాధవి గారు వాడలేదు. అది Thumb Nail పైత్యం. “రావణుడు ఎక్కి తిరిగే పుష్పకవిమానాన్ని ఒక వేదపండితుడు, బ్రాహ్మణుడు తయారు చేశాడు” అని ఆమె అన్నారు. బేసిగ్గా పుష్పక విమానం తయారు చేసింది విశ్వకర్మ. దాన్ని ఆయన బ్రహ్మకు ఇస్తే, తపస్సుతో ఆయనను మెప్పించి కుబేరుడు దాన్ని పొందాడని పురాణగాథ. ఆ తర్వాత దాన్ని రావణుడు బలవంతంగా లాక్కున్నాడని రాశారు. సరే! తయారు చేసింది విశ్వకర్మ అనేది ఫిక్స్.(ఈ విశ్వకర్మ బ్రాహ్మణుడో, కాదో నాకు క్లారిటీ లేదు. ఎవరికి గొప్పతనం ఉంటే వాళ్లని బ్రాహ్మణులుగా మార్చి పురాణాలు రాసే ఆచారం మనకుంది కదా!)
విశ్వకర్మలనే ఐదు కులాలవారు వడ్రంగులుగా, కమ్మరులుగా, శిల్పాలుగా, స్వర్ణకారులుగా, కంచర్లుగా మన దేశం నిండా ఉన్నారు కదా! నేటికీ ఆ వృత్తులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు కదా! వాళ్ల గురించి, వాళ్ల శ్రామిక జీవనం గురించి చెప్పడం మానేసి, ‘బ్రాహ్మణులు పుష్పక విమానం తయారు చేసిరి.. దాన్ని రైట్ బ్రదర్స్ తస్కరించిరి’ అనే మాటలను వేదాలు చదివే పిల్లల ముందు పలికి లాభం ఏమిటి? పైగా బ్రాహ్మణులు నిస్వార్థ సేవ చేస్తారు కాబట్టి వారు కష్టపడకండా ఉండేందుకు జనం వారిని పోషించాలట! సమాజంలో వారే అధికులట! వారి జ్ఞానం అంతా సమాజం కోసం అంట! ఇవన్నీ చెప్పి ఆ పిల్లల్ని ఎంత దారుణంగా తయారు చేస్తారో అర్థం చేసుకోవచ్చు.
… ఛానెల్ ఏదో గుర్తు లేదు కానీ, ‘పాతబస్తీలో ముస్లింల ఇబ్బందులు’ అనే ఒక టాపిక్ మీద మాట్లాడుతుండగా నాలుగైదు నెలల క్రితం మాధవిలత గారిని చూశాను. ఈమె ఎవరో పాతబస్తీ ముస్లింల గురించి ఇంత ప్రేమగా మాట్లాడుతూ ఉందే అనుకున్నాను. కొన్నాళ్లు ఆ పాతబస్తీ వీడియోలు నడిచాయి. ఆ తర్వాత మెల్లగా స్త్రీల వస్త్రధారణ, కట్టు బొట్టు వరకు ఆమె ఇంటర్వ్యూలు వచ్చాయి. సరే! ఆ తర్వాత పిల్లల పెంపకం, ఆడవాళ్ల రక్షణ, ముల్లొచ్చి ఆకు, ఆకొచ్చి ముల్లు టాపిక్. ఓకే! మెల్లగా పురాణాలు. ఆ.. ఇంక మొదలైందిరా అనుకున్నాను. ఈమె రాజకీయాల్లోకి రాబోతోంది అని అర్థమైంది. అందుకే ఈ పెయిడ్ ఇంటర్వ్యూలు అని తేలిపోయింది. పురాణాల తర్వాత రావాల్సిన టాపిక్ ‘బ్రాహ్మణులు గొప్ప.. వాళ్లే సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్‌లు’ అనే నినాదం. ఆ తర్వాత దేశం నుంచి ఇతర మతాలను వెల్లగొట్టాలి, బైబిల్ ఎంత బూటకమో తెలుసా, పాకిస్థాన్‌లో హిందువుల పరిస్థితి, భారతదేశం సెక్యులర్ కాదు.. ఇలా వరుసగా వస్తాయి టాపిక్స్. చూస్తూ ఉండండి.
… “కృష్ణం నియమం హరయః సుపర్ణా అపో వసానా దైవం ఉత్పతంతి.. ద్వాదశ ప్రధాయశ చక్రం ఏకం త్రిణి నాభ్యని కా ఉ తాక్ సికేత.. తస్మింత్ సకం త్రిశత న శాంకవో ర్పితాః శాస్తిర్ న కాలచలాసః”.. ఇలాంటి శోకాలు రుగ్వేదంలో ఉన్నాయి. ఒప్పుకుందాం! కానీ ఏళ్లకేళ్లు వాటిని చదివిన బ్రాహ్మణులు విమానాలు ఎందుకు తయారు చేయలేదో, వాటిని తస్కరించారని చెప్తున్న రైట్ బ్రదర్స్ మాత్రమే ఎందుకు విమానం తయారు చేశారో అంతుచిక్కని ప్రశ్న! పోనీ ఈ వందేళ్లలో బ్రాహ్మణులు తయారు చేసిన వస్తువు ఏదైనా ఉందా? దాని గురించి వేదాల్లో ప్రస్తావన ఉందా? అదైనా చెప్పండి.
“విమానం తయారీ మా నుంచి మీరు తీసుకున్నారు కాబట్టి, ఆ విమానాలన్నీ మాకు ఇచ్చేయండి” అని మనం విదేశీ ప్రభుత్వాలతో గనుక అంటే పళ్లు రాలగొడతారు. ఇవన్నీ బ్రాహ్మణులు & వేదాల మీద బోలెడంత నమ్మకం ఉన్నవారూ చెప్పుకొని తృప్తి పడేందుకే కానీ, అంతర్జాతీయ మార్కెట్లో ఇలాంటివేవీ చెల్లవు. ‘విమానం మా వేదాల్లో ఉంది కాబట్టి, మేం ఫ్రీగా అమెరికా ప్రయాణం చేస్తాం’ అంటే తంతారు పట్టుకుని. చెప్పాగా! ఇదంతా మనలో మనం చెప్పుకుని ఛాతీలు పెంచుకోవడానికి తప్ప దేనికీ పనికిరాదు. అమెరికన్ డాలర్ల రుచి ముందు ఏ సెంటిమెంట్లూ పని చేయవు.
… ఆ పార్టీ వారు(ఏ పార్టీయో ప్రత్యేకంగా చెప్పాలా) నాలుగైదు ఛానెళ్ల ఆఫీసుల ముందు కుర్చీలు వేసి కూర్చుంటారేమో అనిపిస్తుంది. లోపల ఇంటర్వ్యూల్లో ఎవరు పాకిస్తాన్‌కి వ్యతిరేకంగా మాట్లాడారు, ఎవరు స్త్రీల బట్టలను విమర్శించారు, ఎవరు ‘అన్నీ వేదాల్లో ఉన్నాయిష’ అనే డైలాగ్ వాడారు, ఎవరు పురాణాలను సైన్స్‌లో మిక్స్ చేశారు.. ఇత్యాది విషయాలన్నీ తెలుసుకొని వాళ్లని పట్టుబట్టి తమ పార్టీ ఆఫీసుకి లాక్కుపోతున్నట్టు ఉంది. జనాలను మాయలో ముంచాలంటే వాళ్లే కరెక్ట్ అనుకుని ఫిక్స్ అయిపోతున్నట్టు ఉంది.
… సత్యవాణి, చాగంటి, గరికపాటి.. ఎమ్మెల్యే/ఎంపీ అభ్యర్థుల జాబితాలో వీళ్ల పేర్లు ఉండే కాలం ఎంతో దూరంలో లేదేమో?!