అక్షయ తృతీయ విశిష్టత!

భారతీయ పండుగలలో అక్షయ తృతీయ పర్వదినానికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ పండుగను వైశాఖ శుద్ధ తదియన హిందువులు, జైనులు జరుపుకుంటారు. శివయ్య అనుగ్రహంతో కుబేరుడు సంపదలకు రక్షకుడిగా నియమితుడైన రోజని.. మహాలక్ష్మిని శ్రీహరి వివాహం చేసుకున్న శుభదినంగా పేరుంది. ఈరోజు లక్ష్మీ దేవిని బంగారంతో అలంకరించి పూజిస్తే ఇల్లు సిరిసంపదలతో కలకళలాడుతుందన్నది భక్తులు నమ్మకం. అంతేకాకుండా ఈ రోజున చేసే యజ్ఞయాగాది క్రతువులూ, పూజలు, జపాలు దివ్యమైన ఫలితాలనిస్తాయని నమ్మకం. ఈ విషయాన్ని పార్వతీదేవికి శివుడు చెప్పినట్టుగా మత్స్యపురాణం ఉంది. ఈ రోజున దాన ధర్మాలు చేస్తే అద్భుతమైన ఫలం సిద్ధుస్తుందని నారద పురాణం చెబుతోంది.

“వైశాఖమాసస్య చ యా తృతీయా నవమ్య సౌ కార్తీక శుక్లపక్షే
నభస్య మాసస్య తమిస్రపక్షే త్రయోదశీ పంచదశీ చ మాఘే”

అక్షయ తృతీయ వైశాఖ శుద్ధ తదియ రోజున కృతయుగం ప్రారంభమైనదని పురాణాలు చెబుతున్నాయి. ధర్మం నాలుగు పాదాలమీద నడిచిన కాలమది. ఆ యుగంలో పొలాన్ని దున్నకుండానే పంటలు పండేవట! నేలను ఒక అడుగులోతు తవ్వినా జలధార పొంగుకొచ్చేదట! నిరు పేద అయిన కుచేలుడు బాల్య స్నేహితుడైన శ్రీకృష్ణుడి కటాక్షంతో అక్షయమైన సంపదల్ని పొందిన రోజు ఇదే. క్షీరసాగరమధనం తర్వాత లక్ష్మిదేవిని మహావిష్ణువు వరించిన రోజు ఇదే!
నరసింహ స్వామి ప్రహ్లాదుడిని అనుగ్రహించింది ఈ రోజే కాబట్టే అక్షయ తృతీయ నాడు…రాహుకాలాలూ వర్జ్యాలు వర్తించవు. ప్రతి నిమిషం సుముహూర్తమే. ఏ కార్యక్రమం చేపట్టినా శుభప్రదమే! అక్షరాభ్యాసాలూ అక్షయ తృతీయరోజే పెట్టకుంటారు. ఈ రోజు ఏ వ్రతం చేసినా, ఏ పూజ చేసినా,ఏ హోమం నిర్వహించినా ఫలం అక్షయం అవుతుంది.

సింహాచలంలో వరాహనరసింహస్వామికి ఏటా చందనోత్సవం జరుగుతుంది! ఈ రోజు మూలవిరాట్టు మీద ఉన్న చందనాన్ని తొలగించి స్వామివారి నిజరూపాన్ని దర్శించే భాగ్యాన్ని కల్పిస్తారు

అక్షయ తృతీయ ప్రాముఖ్యత:
1. పరశురాముని జన్మదినం
2. పవిత్ర గంగా నది భూమిని తాకిన పర్వదినం
3. త్రేతాయుగం మొదలైన దినం
4. శ్రీకృష్ణుడు తన బాల్యమిత్రుడైన కుచేలుని కలుసుకొన్న దినం
5. వ్యాస మహర్షి “మహా భారతము”ను, వినాయకుని సహాయముతో వ్రాయడం మొదలుపెట్టిన దినం
6. సూర్య భగవానుడు వనవాసములో వున్న పాండవులకు “అక్షయ పాత్ర” ఇచ్చిన దినం
7. శివుని ప్రార్థించి కుబేరుడు శ్రీమహాలక్ష్మితో సమస్త సంపదలకు సంరక్షకునిగా నియమింపబడిన దినం
8. ఆదిశంకరులు “కనకధారాస్తవం” ను చెప్పిన దినం
9. అన్నపూర్ణా దేవి తన అవతారాన్ని స్వీకరించిన దినం
10. ద్రౌపదిని శ్రీకృష్ణుడు దుశ్శాసనుని బారినుండి కాపాడిన దినం
11. ఏఏటికాఏడు ఒడిషా పూరి రథయాత్ర సంబరాల కొరకు నిర్మించే రథ నిర్మాణం ప్రారంబించే రోజు.
12. బృందావనంలోని బంకే బిహరి ఆలయంలో శ్రీకృష్ణుని పాదాలను దర్శించుకొనే అవకాశం ఒక్క అక్షయ తృతీయ రోజునే దక్కుతుంది.
13. ఈరోజే సింహాచలం దివ్యక్షేత్రం లో సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం మరియు చందనోత్సవం ప్రారంభపు రోజు.

Optimized by Optimole