ప్రపంచ శక్తికి ప్రతీకగా చెప్పుకునే అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షునిగా డెమొక్రటిక్ పార్టీకి చెందిన 78 ఏళ్ల జో బైడెన్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. తొలి మహిళా ఉపాధ్యక్షురాలిగా భారత సంతతికి చెందిన కమలా హారీస్ బాధ్యతలు చేపట్టారు. ‘పెను సవాళ్లు.. సంక్షోభం నెలకొన్న తరుణంలో.. అగ్రరాజ్యం పేరుకు తగ్గట్టు అందరం కలసికట్టుగా ముందుకెళ్లాలి.. అలా చేస్తే వైఫల్యానికి చోటు ఉండదు. నేను అందరివాడిని ‘ అని బైడెన్ అన్నారు.
బుధవారం మధ్యాహ్నం కాంగ్రెస్ భవనం క్యాపిటల్ హిల్ వెలుపల ఏర్పటు చేసిన వేదిక వద్దకు భార్య జిల్ తో కలిసి చేరుకున్నారు. హరిస్ భర్త డగ్లస్ తో కలిసి వచ్చారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాబర్ట్స్ బైడెన్ తో ప్రమాణ స్వీకారం చేయించారు. దాదాపు 25 వేల మంది నేషనల్ గార్డ్స్ పహరలో ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసింది.
ప్రమాణ స్వీకరణ కార్యక్రమంలో బైడెన్ మాట్లాడుతూ ‘ఈరోజు అమెరికా ప్రజాస్వామ్యం గెలిచిన రోజు.. అధ్యక్షుడిగా రాజ్యాంగాన్ని పరిరక్షిస్తా.. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తా.. అమెరికాను పరిరక్షిస్తా.. ఇది చరిత్రలో నిలిచిపోయే రోజు.. ప్రపంచ శాంతి, ప్రగతి భద్రత లో విశ్వసనీయ భాగస్వామ్యంగా ఉంటాం’ అని బైడెన్ పేర్కొన్నారు.