అనకొండ జగన్ సొంత చిన్నాయనను మింగేశాడు: పవన్ కళ్యాణ్

Varahivijayayatra: సీఎం జగన్ తను పెట్టిన గుడ్లను తినే అనకొండ పాము లాంటి వాడని ఆరోపించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ముఖ్యమంత్రి సొంత చిన్నాయననే మింగేశాడని.. దళితులకు మేనమామ అని గొప్పలు చెప్పుకొంటూ వారికి చెందిన 23 పథకాలను రద్దు చేశాడని మండిపడ్డారు. వారాహి విజయయాత్రలో భాగంగా మలికిపురంలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా  పవన్ మాట్లాడుతు.. ‘పాము ఆకలి వేస్తే ఎక్కడపడితే అక్కడ ఉన్న గుడ్లు తినేస్తుంది.. అప్పటికీ ఆకలి తీరకపోతే తన సొంత గుడ్లను సైతం తినేస్తుంది..తను పెట్టిన గుడ్లను తినే అనకొండ పాము లాంటి వాడు సీఎం జగన్ అని తీవ్ర స్ధాయిలో విరుచుకుపడ్డారు.అంబేద్కర్ విదేశీ విద్యా పథకం పేరు మార్చి జగనన్న విదేశీ విద్యా పథకం అని పెట్టాడని ఎద్దేవ చేశారు. ఈ ముఖ్యమంత్రి అంబేద్కర్ కంటే గొప్పవాడా? నాకు జెడ్ క్యాటగిరీ, వై క్యాటగిరీ సెక్యూరిటీ లేదు. ప్రభుత్వం ఇచ్చిన గన్ మ్యాన్ లేరు. నాకు రక్షణగా ఉన్నదల్లా వారాహి రథం, నా అన్నదమ్ములు, ఆడపడుచులు దీవెనలు మాత్రమే. నా మీద కానీ, జనసైనికుల మీద గానీ చిన్న చేయి పడ్డా, రాయి పడ్డా.. క్రిమినల్స్, బ్లేడ్, కత్తి బ్యాచ్ లకు ఒకటే చెబుతున్నాను జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మీరు ఎక్కడున్నా వెతికి మరి బయటకు తీసుకొచ్చి మీ పని పడతామని హెచ్చరించారు. మాతో గొడవ పెట్టుకోవాలంటే 25 ఏళ్ల యుద్ధానికి సిద్ధమై మాత్రమే రండి’ అని అల్టిమేటం జారీ చేశారు.

కాగా  “రాజకీయం అంటే ఓ బాధ్యత. లక్షలాది మంది ఓటర్ల ఆకాంక్ష. కేవలం రాజకీయ స్వలాభం కోసం ఓ పార్టీ తరఫున గెలిచి, వ్యక్తిగత అవసరాల నిమిత్తం ఇతర పార్టీల్లోకి వెళ్లే రాజకీయం సరికాదని పవన్ హితువు పలికారు. అందరి నిర్ణయం మీద గెలిచిన వ్యక్తి చివరి వరకు దానికి కట్టుబడి పనిచేయాలని.. గెలిచిన ఒక్కడి నిర్ణయం పని చేయదని స్పష్టం చేశారు. ప్రజలు వేసిన ఓటును బోటుగా చేసుకొని ఎన్నికల సముద్రం దాటిన వ్యక్తి అవసరం తీరాక, ఆ తెప్ప తగలేస్తామంటే ప్రజాస్వామ్యంలో పద్ధతి కాదని… కచ్చితంగా అలాంటి నాయకులను నిలదీసే హక్కు ప్రజలకు ఉండాలని.. రీకాల్ చేసే అధికారం ప్రజలకు చెందాలని జనసేనాని తేల్చిచెప్పారు.

 మన పార్టీ ఎదుగుదలలో ప్రజల ఆకాంక్ష ఉంది

జనసేన పార్టీ ఎదుగుదలలో అంతులేని ఆవేదనలు, గళమెత్తే గొంతులు, లక్షలాది జవాబులేని ప్రశ్నలు, అధికార దర్పం చూపిన అవమానాలు, న్యాయం దక్కని ఆక్రందనలు దాగున్నాయన్నారు పవన్. కేవలం 150 మందితో మొదలైన జనసేన ప్రస్థానం ఈ రోజు కేవలం రాజోలు నియోజకవర్గంలోనే 10,274 మంది క్రియాశీలక సభ్యుల సమూహంగా మారిందన్నారు. బలమైన ప్రజా సిద్ధాంతం, సమస్యలపై రాజీలేని పోరాట భావజాలం అందరినీ కలిపిందని.. ఇదే జనసేన ఎదుగుదలలో ప్రత్యేక భూమిక పోషిస్తోంది. జనసేన పార్టీ ఏ అంశం మీద అయినా పోరాటానికి సిద్ధం అయితే ప్రభుత్వానికి ఎందుకు అంత భయం అంటే నిజాయతీనే నమ్ముకున్న వ్యక్తుల సమూహం రోడ్డు ఎక్కితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని.. ఇదే జనసేన పార్టీ బలమని పవన్ పేర్కొన్నారు.

నీడనిచ్చే జనసేన చెట్టును కాపాడుకుందాం

ప్రతి పార్టీలోనూ, ప్రతి నియోజకవర్గంలోనూ సమస్యలు సహజమన్నారు జన సేనాని. కొందరు వ్యక్తుల సమూహాన్ని నడిపించగలిగే వ్యక్తుల మధ్య పోటీ అనేది సాధారణమన్నారు. అయితే జనసేన పార్టీ అంతర్గతంగానూ ప్రజాస్వామ్యాన్ని బలంగా నమ్మిన పార్టీ అని.. ఎక్కువమంది ఆమోదం ఎవరికి ఉంటుందో, అందరి మన్ననలు పొందగలిగే వారికే ప్రాధాన్యం ఉంటుందన్నారు. జనసేన పార్టీ తన అంతర్గత ప్రజాస్వామ్యాన్ని అనుసరించి నాయకులను ఎంపిక చేసినా, మిగిలిన వారికి సైతం అదే ప్రాధాన్యం ఇస్తుందన్నారు. అలాగే ఆశయాల కోసం ఎదుగుతున్న జనసేన పార్టీ అనే చెట్టు నీడను కాపాడుకుంటూ ప్రయాణం చేద్దామని.. ఏ వైసీపీ నాయకుడికి భయపడాల్సిన పని లేదన్నారు. పూర్తిస్థాయిలో  అందుబాటులో ఉంటానని.. అవసరం అయితే తానే వచ్చి ప్రజల  కోసం పోరాటం చేస్తానని పవన్ వెల్లడించారు.

ఏ హామీనీ నెరవేర్చని ముఖ్యమంత్రి

పదవి కాంక్షతో నోటికొచ్చిన హామీలు ఇచ్చిన ముఖ్యమంత్రి కేవలం బటన్లను నొక్కుతూ కాలక్షేపం చేస్తున్నారని పవన్ ఆరోపించారు. క్షేత్రస్థాయిలో రోడ్లు, డ్రైన్లు, తాగునీరు వంటి కనీస అవసరాలను వైసీపీ ప్రభుత్వం తీర్చలేకపోతోందన్నారు. కొత్తతరం ఈ తీరును ప్రశ్నించాల్సిన అవసరం ఉందన్నారు. మలికిపురంలో కనీసం శ్మశానవాటిక కూడా లేదని.. ఇలాంటి స్థానిక సమస్యలపై యువత చొరవ తీసుకొని నాయకులను ప్రశ్నించాలని పిలునిచ్చారు. నాయకులకు కేవలం ఎన్నికల్లో ఓట్లే ప్రధానం కాదని… అవి అయిపోయాక బాధ్యత లేకుండా మొఖం చాటేయడం సరికాదన్నారు. అభివృద్ధిని ఉభయ గోదావరి జిల్లాల్లోనే మొదలుపెట్టాలన్నారు . ప్రజలు కూడా ఇష్టానుసారం హామీలు ఇచ్చి తర్వాత మొహం చూపించని వారిని నమ్మకుండా, ఎవరు సంపూర్ణంగా మన కోసం చివరి వరకు నిలబడతారో అనేది ఆలోచించాలని అభ్యర్ధించారు. విద్యా, వైద్యం, ఉపాధి ఎవరు చూపగలరో, కట్టుబడగలరో అర్ధం చేసుకొని జనసేనకు అండగా నిలబడండని పవన్ విజ్ఞప్తి చేశారు.

 

Related Articles

Latest Articles

Optimized by Optimole