jadcherla :జడ్చర్ల నియోజకవర్గంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అనిరుథ్ రెడ్డి చేపట్టిన రైతు దరఖాస్తు ఉద్యమానికి అనూహ్య ప్రజాస్పందన లభించింది. తెలంగాణలో తొలిసారిగా చేపట్టిన ఈఉద్యమానికి రైతన్నల నుంచి దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఒక్క రాజాపూర్ మండలంలోనే ఇప్పటివరకు వెయ్యికి పైగా దరఖాస్తులు వచ్చాయి. దీంతో సేకరించిన దరఖాస్తులను రైతన్నలతో కలిసి అనిరుధ్ భారీ ఎత్తున ర్యాలీగా వెళ్లి .. మండల కార్యాలయంలో తహాశీల్దార్ కు అందజేశారు. రైతులు పడుతున్న ఇబ్బందులను గౌరవముఖ్యమంత్రి కేసీఆర్ , వ్యవసాయ శాఖ మంత్రికి, సంబంధిత అధికారులకు తెలియజేయాలనే ఉద్ధేశంతో కాంగ్రెస్ పార్టీ ఈఉద్యమానికి శ్రీకారం చుట్టిందని అనిరుథ్ రెడ్డి పేర్కొన్నారు.
కాగా అన్నదాతలకు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ‘రైతు రుణమాఫీ’ పథకం జడ్చర్ల నియోజకవర్గంలో పూర్తిస్థాయిలో అమలు కావడం లేదన్నారు అనిరుథ్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ తరపున ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు నియోజకవర్గంలోని పలు గ్రామాలలో పర్యటించి.. రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిపారు. రాష్ట్రంలోని రైతులకు రుణమాఫీ అందజేస్తామని 2018 ఎన్నికల్లో హామీ ఇచ్చిన బీఆర్‌ఎస్ ప్రభుత్వం.. అధికారంలోకి వచ్చాకా పూర్తిస్థాయిలో అమలుజేయడం లేదన్నారు. నాలుగేండ్లు గడిచినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో రైతులు వడ్డీలకు అప్పులు చేసి వాటిని తిరిగి చెల్లించలేకపోతున్నారని .. బ్యాంకులు కూడా రుణాలపై నోటీసులు జారీ చేస్తుండడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్యలకు సిద్ధమవడం దురదృష్టకరమని అనిరుధ్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.