అంతరిక్షంలోకి మరో తెలుగమ్మాయి..!

అంతరిక్షంలోకి తొలిసారిగా తెలుగు మూలాలున్న ఓ మహిళ అడుగుపెట్టబోతున్నారు. జులై 11న అమెరికాకు చెందిన వర్జిన్‌ గెలాక్టిక్‌ సంస్థ అంతరిక్ష వాహక నౌకను ప్రయోగించనుంది. తొలిసారిగా నలుగురు ప్రయాణికులతో వెళ్లనున్న ఈ వాహకనౌకలో భారత సంతతికి చెందిన శిరీష బండ్ల కు చోటు దక్కింది. వర్జిన్‌ గెలాక్టిక్‌ ప్రభుత్వ వ్యవహారాల ఉపాధ్యక్షురాలి హోదాలో ఉన్న ఆమె అంతరిక్ష యానం చేయనున్నారు.
అంతరిక్ష పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు గానూ వర్జిన్‌ గెలాక్టిక్ ఈ ప్రయోగం చేపట్టనుంది. అంతరిక్షంలోకి ప్రయాణికులను తీసుకెళ్లేందుకు ఈ కంపెనీకి జూన్‌ 25న ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ లైసెన్సు జారీ చేసింది. దీంతో ఈ నెల 11న న్యూ మెక్సికో నుంచి ఈ స్పేస్‌ఫ్లైట్‌ బయల్దేరనుంది. వర్జిన్‌ గెలాక్టిక్‌ చేపడుతున్న నాలుగో అంతరిక్షయానం ఇది. అయితే ప్రయాణికులను తీసుకెళ్లడం ఇదే తొలిసారి అని సంస్థ వెల్లడించింది. జులై 11న ప్రయోగించే వాహక నౌకలో ఇద్దరు పైలట్లతో పాటు వర్జిన్‌ గెలాక్టిక్‌ అధిపతి రిచర్డ్‌ బ్రాన్సస్‌, మరో ముగ్గురు కంపెనీ ప్రతినిధులకు అంతరిక్షంలోకి వెళ్లే అవకాశం లభించింది. అందులో ఒకరు శిరీష బండ్ల కాగా చీఫ్‌ ఆస్ట్రోనాట్‌ ఇన్‌స్ట్రక్టర్‌ బెత్‌ మోసెస్‌, లీడ్‌ ఆపరేషన్స్‌ ఇంజినీర్‌ కాలిన్‌ బెన్నెట్‌ అంతరిక్ష యానం చేయనున్నారు.
ఆంధ్రా టు అమెరికాక..
శిరీష బండ్ల ఆంధ్రప్రదేశ్‌ లోని గుంటూరు లో జన్మించారు. ఆ తర్వాత కుటుంబంతో కలిసి అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. ప్రస్తుతం ఆమె వాషింగ్టన్‌లో నివసిస్తున్నారు. అంతరిక్షంలోకి వెళ్తోన్న తొలి తెలుగు మహిళ ఈమే కావడం విశేషం. అంతకుముందు భారత్‌కు చెందిన కల్పనా చావ్లా, భారత సంతతికి చెందిన సునితా విలియమ్స్‌ అంతరిక్షంలో అడుగుపెట్టారు.