APEXITPOLL2024 : ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ-కూటమి విజయం సాధించే అవకాశాలు ఉన్నట్లు newsminute24 సంస్థ ఎగ్జిట్ పోల్ వెల్లడించింది.ఆసంస్థ ఎగ్జిట్ పోల్ ప్రకారం అధికార వైసీపీని ఓడించి ఎన్డీయే కూటమి గెలవనుండటంతో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నాలుగో సారి ముఖ్యమంత్రి కావడం ఖాయంగా కనిపిస్తోంది. 175 అసెంబ్లీ నియోజకవర్గాలున్న ఏపీలో టీడీపీ సొంతంగానే 105 నుంచి 115 స్థానాలు గెలిచే అవకాశం ఉంది. అధికారం నిలబెట్టుకోవాలని తీవ్రంగా యత్నిస్తున్న వైఎస్సార్సీపీ 48 నుంచి 58 స్థానాలకు పరిమితమయ్యే అవకాశాలు ఉన్నట్లు సర్వే గణాంకాలు చెబుతున్నాయి. కూటమికి మొత్తంగా 115 నుంచి 125 స్థానాలు రావొచ్చన్నది సర్వే గణాంకాల సారాంశం. కూటమి భాగస్వాములుగా బరిలో నిలిచిన జనసేన 15 నుంచి 20 స్థానాలు, బీజేపీ 3 నుంచి 5 స్థానాలు గెలిచే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
ఇక ఆంధ్రప్రదేశ్ లోని 25 పార్లమెంటు స్థానాల్లో.. టీడీపీ 13 నుంచి16, జనసేన 2 , బీజేపీ 2 నుంచి 4 స్థానాలు కైవసం చేసుకునే అవకాశం ఉన్నట్లు సర్వేలో తేలింది. అధికార వైసీపీ 6 నుంచి 10 స్థానాల మధ్య పార్లమెంటు సీట్లను గెలిచే అవకాశం ఉంది. ఓట్ల శాతం పరంగా టీడీపీ-జనసేన-బీజేపీ కూటమికి 49-52%, వైసీపీకి 43-45%, కాంగ్రెస్ కి 1- 2%, ఇతరులకు 3-4% ఓట్లు వచ్చే అవకాశం ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది.
ఇదిలా ఉంటే ఏపీ ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుందన్న ప్రశ్నకు.. ప్రస్తుత సీఎం జగన్ ముఖ్యమంత్రి కావాలని 29 శాతం, చంద్రబాబు కావాలని 38 శాతం మంది, పవన్ కళ్యాణ్ కావాలని 22 శాతం మంది ప్రజలు కోరుకుంటున్నట్లు సర్వేలో వెల్లడైంది. ప్రధానమంత్రి ఎవరు కావాలని అడిగినప్పుడు నరేంద్రమోదీకి 55 శాతం, రాహుల్ గాంధీకి 28 శాతం మంది మద్దతు తెలిపినట్లు newsminute24 సంస్థ ఎగ్జిట్ పోల్ రిపొర్ట్ చెబుతోంది.