కాపుల అంబేడ్కర్‌ కోట్ల కాదా? వేమూరి రాధాకృష్ణ గారేనా?

Nancharaiah merugumala: (senior journalist)

=============

అగ్రవర్ణ పేదలకు (ఈడబ్ల్యూఎస్‌) కేంద్ర (బీజేపీ) సర్కారు ఐదేళ్ల క్రితం కల్పించిన కోటాలో కాపులకు 2019లో 5 శాతం రిజర్వేషన్లు ఇస్తూ ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ చేసిన చట్టంపై కేంద్రం నిన్న పార్లమెంటులో వివరణ ఇచ్చింది. విద్యాసంస్థల్లో సీట్లు, ఉద్యోగాల్లో కోటా కల్పించే కులాల (ఎస్యీబీసీ) జాబితా రూపొందించుకునే అధికారం రాష్ట్రాలదేనని కూడా కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత శాఖ మంత్రి ప్రతిమా భౌమిక్‌ తన లిఖిత పూర్వక సమాధానంలో వెల్లడించారు. ఈ ప్రశ్న అడిగింది బీజేపీ రాజ్యసభ సభ్యుడు గుంటుపల్లి వెంకట లక్ష్మీ (జీవీఎల్‌) నరసింహారావు. ఉత్తర్‌ ప్రదేశ్‌ నుంచి బీజేపీ టికెట్‌ పై పార్లమెంటుకు ఎన్నికైన నరసింహారావు గారు ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఓ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినా వ్యవసాయశాస్త్రంలో పట్టభద్రుడు. మొదట జర్నలిస్టు–సెఫాలజిస్టుగా బతికిన ఆయన బీజేపీ అధికార ప్రతినిధిగా ఎదిగారు. తర్వాత యూపీ నుంచి చట్టసభకు తొలిసారి ఎన్నికయ్యారు. వచ్చే లోక్‌ సభ ఎన్నికల్లో నర్సరావుపేట నుంచి బీజేపీ తరఫున పోటీచేయాలని భావిస్తున్న జీవీఎల్‌ –కాపులపై ఈ మాత్రం శ్రద్ధ చూపించడం హర్షణీయం.

 

గత ఐదేళ్లుగా కాపులే ఏపీ బీజేపీ శాఖకు నాయకత్వం వహిస్తున్న నేపథ్యంలో జీవీఎల్‌ పై ప్రశ్న అడగడం సముచితమే. అదీగాక కాపు కుర్రాళ్లలో మంచి ఆదరణ ఉన్న జనసేనతో బీజేపీకి పొత్తు ఉండడం కూడా జీవీఎల్‌ ఈ ప్రశ్న అడగడానికి కారణమై ఉండాలి. ఏదేమైనా 2018 నుంచీ కాపు నేతలకే రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి ఇస్తున్న బీజేపీ కోటా సదుపాయం లేని కాపు, బలిజ, తెలగ, ఒంటరి సముదాయం సంక్షేమం కోసం పనిచేయడం పాన్‌ (విశాల) తెలుగు సమాజానికి మేలే చేస్తుంది.

కాపుల అంబేడ్కర్‌ కోట్ల కాదా? వేమూరి రాధాకృష్ణ గారా?

……………………………………………………………….

ఆధునిక ఆంధ్రప్రదేశ్‌లో దివంగత వంగవీటి మోహన రంగారావు తర్వాత కాపు జాతి జననేతగా అవతరించిన మద్రగడ పద్మనాభం గారు 1994లో కాపు కోటా కోసం ఉద్యమించారు. అంతేగాదు, నాటి కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర రెడ్డి ప్రభుత్వం నుంచి కాపు రిజర్వేషన్లకు సంబంధించిన కొన్ని రాయితీలు వీరోచిత పోరాటం ద్వారా సాధించారు. అంతటితో ఆగకుండా కోట్ల గారికి కాపు జనసందోహాల మధ్య గొప్ప సన్మానం చేశారు. భారతదేశంలో సామాజికంగా నలిగిపోయిన వర్గాల ప్రజలకు డా.బీఆర్‌ అంబేడ్కర్‌ ఎలాంటి మేలు చేశారో కోట్ల గారు కూడా తెలుగునాట కాపులకు అంతటి మేలు చేశారని ముద్రగడ కొనియాడారు. ఆ భారీ బహిరంగసభలో లక్షలాది కాపుల సమక్షంలో కోట్ల విజయభాస్కర రెడ్డిని ‘కాపుల అంబేడ్కర్‌’ అని అభివర్ణించారు ముద్రగడ.

అలా 1994 నుంచి 2008లో మెగాస్టార్‌ కొణిదెల చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టే వరకూ కోట్లను కాపుల అంబేడ్కర్‌ గానే కా–బ–తె–ఒం కులాల సమాఖ్య పరిగణించింది. ఇంతకీ అసలు విషయం ఏమంటే..పైన చెప్పిన వార్తను విస్తృత వివరణతో, సామాజిక, గణాంక అంచనాలతో, రాజకీయ విశ్లేషణతో గురువారం ఆంధ్రజ్యోతి దినపత్రిక (ఏపీ ఎడిషన్‌) ప్రచురించింది. అమ్మకాల్లో, తెలుగు పాఠకుల సంఖ్యలో మొదటి స్థానంలో ఉన్న ఈనాడు మాత్రం ఎక్కడో లోపలి పేజీల్లో ఈ విషయమై నాలుగైదు లైన్ల వార్త ప్రచురించింది. ఎప్పుడూ సామాజిక కట్టుబాట్లు, కుల నిగ్రహం పాటించే ఈనాడు తన పాత ఆనవాయితీనే కొనసాగించింది. కృష్ణా జిల్లా గుడివాడ ప్రాంతంలో పెరగడం వల్లనేమో మరి ఈనాడు స్థాపకుడు చెరుకూరి రామోజీ రావు గారు కులం, కోటా వంటి విషయాల్లో, కాపుల విషయంలో రెచ్చిపోకుండా తన పత్రికలో ‘బ్యాలెన్స్‌’ ఉండేలా చూసుకుంటున్నారనిపిస్తోంది. మరి ఆంధ్రజ్యోతిని బతికించి, విజయవంతంగా నడిపిస్తున్న ‘ఎండీ’ వేమూరి రాధాకృష్ణ గారు కృష్ణా జిల్లాలో మూలాలు ఉండి నిజామాబాద్‌ జిల్లాలో పుట్టి పెరగడం వల్లనేమో గాని కాపుల కోటా, రాజకీయాల విషయంలో ఎక్కువ సానుభూతి ప్రదర్శిస్తారు. కోస్తాంధ్రలో నివసించకపోవడం వల్ల ఆయన మితిమీరిన చొరవతో కుల రాజకీయాలను ఎక్కువ విశ్లేషిస్తారు. లోతుగా కులాన్ని తడిమేస్తారు. పిప్పిపిప్పి చేస్తారు. ఈడబ్ల్యూఎస్‌ కోటాలో కాపుల రిజర్వేషన్లపై కేంద్ర మంత్రి ఇచ్చిన సంక్షిప్త లిఖిత జవాబుపై ఆంధ్రజ్యోతి ఈరోజు మొదటి పేజీ పై భాగంలో అంత పెద్ద వార్త ఇచ్చిందంటే దానికి కారణం కాపు సమాజంపై రాధాకృష్ణ గారికి ఉన్న సింపతీ, ఎంపతీయే అని చెప్పుకావాలి. ఈ లెక్కన కాపుల అంబేడ్కర్‌ కోట్ల కాదు, కాపుల అంబేడ్కర్‌ వేమూరి రాధాకృష్ణ గారేననిపిస్తోంది. కోస్తా జిల్లాల కాపు, తెలగ సోదరులు, రాయలసీమ బలిజ సోదరులు కూడా ఈ ప్రతిపాదనకు అంగీకరిస్తారని ఆశిస్తున్నాను.

 

 

Related Articles

Latest Articles

Optimized by Optimole