Jammu Kashmir:
మంచు లోయలతో పర్యాటకుల మనస్సులను ఆహ్లాదపరుస్తూ చల్లని వాతావరణంతో కేరింతలు కొట్టించే భూతల స్వర్గం జమ్మూ కశ్మీర్ వేసవి కాలం కాకపోయినా ఎన్నికల రాజకీయాలతో వేడెక్కుతోంది. పదేళ్ల అనంతరం ప్రత్యేకించి స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు తర్వాత శాసనసభ ఎన్నికలు జరుగుతుండడంతో దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా రాజకీయ పండితులు జమ్మూ కశ్మీర్ రాజకీయాలపై ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ ఎన్నికలను అధ్యయనం చేస్తున్న విశ్లేషకులు, మీడియా వర్గాలు తమ తమ కోణాల్లో రాజకీయ అంచనాలు వేస్తున్నారు. ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత జమ్మూ కశ్మీర్‌లో లోక్‌సభ ఎన్నికలు జరిగినా, త్వరలో మూడు విడతలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆ ఆర్టికలే ప్రధానాంశంగా మారుతోంది. బీజేపీ లక్ష్యంగా ఆర్టికల్ చుట్టూ ఎన్నికల రాజకీయాలు తిరుగుతున్నాయి.
ఆర్టికల్ 370 రద్దుపై కక్ష…
ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకించే శక్తులు అసెంబ్లీ ఎన్నికలను ఒక సాధనంగా వాడుకోవాలని చూస్తున్నాయి. జమ్మూ కశ్మీర్‌లో జనాభా పరంగా అధికంగా ఉన్న ముస్లింల ఆధిపత్యమే ఎక్కువ. రెండు ప్రాంతాలని కలిపి జనాభా చూస్తే ముస్లింలు 70 శాతానికిపైగా, హిందువులు దాదాపు 25 శాతం ఉంటారు. కశ్మీర్ వ్యాలీలో ముస్లింలు 90 శాతానికిపైగా ఉంటారు. అదే జమ్మూ ప్రాంతంలో చూస్తే హిందువులు 65 శాతానికిపైగా ఉంటే, ముస్లింలు 30 శాతానికిపైగా ఉంటారు. అంటే స్థూలంగా జమ్మూ కశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంలో రాజకీయాలను, ఎన్నికలను ముస్లింలు శాసించబోతున్నారనడంలో సందేహం లేదు. ఇది ఇక్కడ కొత్తేమి కాదు. రాబోయే ఎన్నికల్లో ఈ ధోరణి మరింత ఎక్కువగా ఉండబోతుంది. ఒకే దేశంలో రెండు చట్టాలు, రెండు అధికారాలు ఉండడాన్ని వ్యతిరేకించే జాతీయవాదుల కల మోదీ సర్కారు హయాంలో 2019 ఆగస్టు 5వ తేదీన నెరవేరింది. ముస్లింలు అధికంగా ఉన్నంతమాత్రాన ప్రత్యేక చట్టాలు, స్వయం ప్రతిపత్తిలు కల్పించడం బుజ్జగింపు, ఓట్ల రాజకీయాలే. అందుకనే ఆర్టికల్ రద్దును కుహనా సెక్కులర్‌వాదులు అనేక రూపాల్లో వ్యతిరేకించారు. వారి కోరిక నెరవేరకపోవడంతో కక్షగట్టిన ఒక వర్గం ఇప్పుడు మోదీ ప్రభుత్వాన్ని అదే ఆర్టికల్ రద్దు అంశంతో ఇబ్బందులపాలు చేయాలని చూస్తుంది.
ఆర్టికల్ రద్దు తర్వాత 2024 పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. అయితే అప్పుడు అంతగా ప్రాముఖ్యత లభించని ఆర్టికల్ రద్దు అంశాన్ని అసెంబ్లీ ఎన్నికల్లో కీలకంగా చేయడానికి సెక్యులరిస్టులు ముఖ్యంగా మేధావులు, వారిని అనుసరించే మీడియాతో పాటు పలు వర్గాలు ప్రయత్నిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా ఆర్టికల్ రద్దుపై ప్రజలు సానుకూలంగా ఉండడంతోపాటు నరేంద్ర మోదీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం మూడో సారి అధికారంలోకి రావడం ఖాయమని తెలిసిన ఈ వర్గం ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో ఆర్టికల్ రద్దు అంశాన్ని ఉద్ధేశపూర్వకంగానే ప్రస్తావించలేదు. ఆ ఎన్నికల్లో వారు ఊహించినట్టే జమ్మూ కశ్మీర్‌లో ఐదు నియోజకవర్గాలుండగా బీజేపీ, నేషనల్ కాన్ఫిరెన్స్ చెరో రెండు, ఇండిపెండెంట్ మరో స్థానంలో గెలవడంతో మోదీ సర్కార్‌కు వ్యతిరేకంగా ఏకపక్ష తీర్పు రాలేదు. దీంతో అవకాశం కాచుకొని కూర్చున్న వీరు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడిరచి మోదీ ఆర్టికల్ 370 రద్దుకు ప్రజామోదం లేదని ఎండగట్టాలని చూస్తున్నాయి. దీన్ని దేశవ్యాప్తంగా రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవాలని గంపెడాశలు ప్రమాదకర పాచికలు వేస్తున్నాయి.
మతప్రాతిపదికన గట్టేందుకు యత్నాలు
బీజేపీని మతతత్వ పార్టీ అని విమర్శించే కూహనా పార్టీలు జమ్మూ కశ్మీర్‌లో అభివృద్ధి, శాంతిభద్రతల ప్రాతిపదికన కాకుండా మతవిభజనతో గట్టెక్కాలనే ఆశయంతో మతతత్వ పార్టీలతో, దేశద్రోహులతో పొత్తు పెట్టుకొని బీజేపీని అడ్డుకోవాలని శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. జమ్మూ కశ్మీర్‌లో నియోజకవర్గాల పునర్విభజన తర్వాత 90 అసెంబ్లీ సెగ్మంట్లుండగా వాటిలో జమ్మూలో 43, కశ్మీర్‌లో 47 ఉన్నాయి. కశ్మీర్ లోయలో బలహీనంగా ఉన్న బీజేపీకి ఏమాత్రం అవకాశం కూడా ఇవ్వద్దనే ఆలోచనతో కాంగ్రెస్ ‘ఇండి’ కూటమి పేరుతో పాకిస్తాన్‌కు వత్తాసు పలికే ఫరూక్ అబ్దులా నేతృత్వంలోని నేషనల్ కాన్ఫిరెన్స్‌తో పొత్తు పెట్టుకుంది. నేషనల్ కాన్ఫిరెన్స్ అభ్యంతరం చెప్పకపోయుంటే పాకిస్తాన్ పాటపాడే మరో పార్టీ పీడీపీతో కూడా జట్టకట్టడానికి సిద్ధమైంది. గత లోక్‌సభ ఎన్నికల్లో జమ్మూ కశ్మీర్‌లో ఈ రెండు పార్టీలతో పొత్తు పెట్టుకొని పోటీ చేసిన కాంగ్రెస్‌ను అక్కడి ప్రజలు తిరస్కరించడంతో ఆ పార్టీకి రిక్తహస్తమే మిగిలింది. ఆ అనుభవంతో పాఠం నేర్వని కాంగ్రెస్ ఇప్పుడు దేశ ప్రయోజనాలనే పణంగా పెట్టడానికి సిద్దమైంది. ముస్లింలు అధికంగా ఉండే కశ్మీర్ లోయలోని 47 స్థానాల్లో కూటమి అత్యధిక స్థానాలు పొందాలని, మరోవైపు బీజేపీ పట్టున్న జమ్మూ ప్రాంతంలో హిందూ ఓట్లను చీల్చే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రణాళికలు రూపొందించింది. ఇందులో భాగంగా ఎన్సీతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ 32 స్థానాల్లో పోటీ చేస్తుండగా అందులో పాతిక పైగా జమ్మూ ప్రాంతంలోనే ఉన్నాయి. ముస్లింలు అధికంగా ఉండే కశ్మీర్‌లో ఎన్సీకి దాసోహమై నామమాత్రపు స్థానాల్లో పోటీ చేస్తూ ఓటర్లలో మతతత్వ చీలికను తెస్తోంది సెక్యులర్ పార్టీగా చెప్పుకునే వందేళ్ల చరిత్ర గల కాంగ్రెస్. ముస్లిం ప్రయోజనాలకు పెద్ద పీట వేస్తూ రాజకీయ ప్రయోజనాలను పొందాలనుకునే ఈ పార్టీ వ్యూహాలు భవిష్యత్తులో హిందువులు అధికంగా జమ్మూ ప్రాంతానికి ఉరి తాడుగా మారడం ఖాయం.
జమ్మూ కశ్మీర్ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీల ముఖ్య భూమిక పోషిస్తున్నా, ప్రభుత్వ ఏర్పాటులో జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కీలక పాత్రను పోషిస్తున్నాయి. కాంగ్రెస్ జాతీయ ప్రయోజనాలకంటే అవకాశవాద రాజకీయాలకే ప్రాధాన్యతిస్తోంది. 2014లో బీజేపీ కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్నా ప్రాంతీయ పార్టీ పీడీపీ ఒంటెత్తు పోకడలకు అవకాశమివ్వకుండా మద్దతును ఉపసంహరించుకుంది. ప్రాంతీయ పార్టీలు ఉనికి కోసం ఎన్ని చేసిన అరాచకాలకు జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ వారి ఒత్తిడిలకు తలొగ్గడం దురదృష్టకరం. జమ్మూ కశ్మీర్‌లో ఈ జాతీయ పార్టీల బలాబలాలను పరిశీలిస్తే వీరు రాబోయే ఎన్నికల్లో, ఆ తర్వాత ఏర్పడబోయే ప్రభుత్వంలో పొషించే అవకాశాలపై ఒక అంచనాకు రావచ్చు.
జాతీయ పార్టీల బలాబలాలు..
జమ్మూ కశ్మీర్‌లో 1967, 1972 ఎన్నికల్లో వరుసగా మెజార్టీ సాధించి ప్రభుత్వాని ఏర్పాటు చేసిన చరిత్ర కాంగ్రెస్‌కు ఉంది. 2002లో ఎన్నికల్లో హంగ్ ఏర్పడడంతో, సంకీర్ణ ప్రభుత్వం ఒప్పందంలో భాగంగా కాంగ్రెస్ నేత గులాం నబీ అజాద్ రెండో విడతలో రెండున్నర సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2002లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ 2008లో 17 శాతం ఓట్లతో 17 స్థానాలు పొందింది. 2014లో 18 శాతం ఓట్లు పొందినా ఐదు సీట్లు కోల్పోయి 12 స్థానాలకు పరిమితమైంది. జమ్మూ కశ్మీర్‌లో లోక్‌సభ ఎన్నికలను పరిశీలిస్తే 2004, 2009 ఎంపీ ఎన్నికలలో 2 స్థానాలు గెలిచిన కాంగ్రెస్ 2014, 2019, 2024 ఎన్నికల్లో ఒక్క ఎంపీ సీటు కూడా సాధించలేదు. 2024 ఎన్నికల్లో ‘ఇండియా’ కూటమిలో భాగంగా ఎన్సీ, పీడీపీలతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ 19 శాతంకు పైగా ఓట్లు సాధించినా ఒక్క సీటు కూడా గెలవలేదు. ఇప్పుడు ఎన్సీతో పొత్తుపెట్టుకొని కశ్మీర్‌లో ఒకటి రెండు సీట్లు గెలిచి, జమ్మూలో మాత్రం పెద్ద ఎత్తున హిందువుల ఓట్లలో చీలిక తెచ్చే కుటిల యత్నాలకు పాల్పడుతోంది.
మరోవైపు మోదీ శకానికి ముందు రాష్ట్రంలో బీజేపీ ప్రభావం నామమాత్రమే. 1972లో జన్ సంఘ్ 3 స్థానాలు గెలిచిన అనంతరం బీజేపీ 1987లో 2, 1996లో 8 స్థానాల్లో గెలిచి ఉనికిని చాటుకుంది. 2002లో ఒక్క సీటు కూడా గెలవని బీజేపీ 2008లో 12 శాతం ఓట్లతో 11 స్థానాలు గెలిచింది. 2014 ఎన్నికల్లో 22 శాతం ఓట్లతో 25 స్థానాల్లో గెలవడంతో బీజేపీ రాష్ట్రంలో కీలక పార్టీగా ఆవిర్భవించింది. పీడీపీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ జమ్మూ ప్రాంతంలో బలపడిరది. జమ్మూ కశ్మీర్‌లో లోక్‌సభ ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే 2014, 2019లో మూడు స్థానాలు గెలిచిన బీజేపీ, 2019 తర్వాత లద్దాఖ్ వేరుకావడంతో 2024లో జమ్మూలో మిగిలిన రెండు ఎంపీ స్థానాల్లో గెలిచి తన పట్టును నిలుపుకుంది. నియోజకవర్గాల పునర్విభజనతో జమ్మూలో సీట్లు పెరగడం తమకు సానుకూలమనే భావనలో బీజేపీ ఉంది. జమ్మూలో ఎక్కువ స్థానాలు సాధించి ప్రభుత్వ ఏర్పాటులో ప్రధాన పాత్ర పోషించేలా బీజేపీ ప్రణాళికలు రూపొందిస్తుంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితులను పరిశీలిస్తే కశ్మీర్ లోయలో ఏ మాత్రం బలంలేని బీజేపీ రాష్ట్రంలో చక్రం తిప్పడం అంత తేలిక కాదనేది సత్యం. తమ బలహీనత తెలిసిన బీజేపీ జమ్మూలో ఒంటరిగా పోటీ చేస్తూ, అదే సమయంలో కశ్మీర్‌లో మాత్రం దాదాపు పదికిపైగా స్థానాల్లో సైద్దాంతికంగా తమకు అనుకూలమైన స్వతంత్ర అభ్యర్థులతో ఎన్నికల అనంతరం అవగాహన కుదుర్చుకోవాలని చూస్తుంది.
జాతీయ దృక్పథంతో ఆలోచించకుండా సున్నితమైన మతవిభజనతో బీజేపీని లక్ష్యంగా చేసుకోవాలని చూస్తున్న వర్గాలు ఆర్టికల్ 370 రద్దును ఆయుధంగా మార్చుకుంటున్నాయి.
ముస్లింలు కీలక పాత్ర పోషించే ఈ ఎన్నికల్లో వారు బీజేపీని ఎలాగూ ఓడిస్తారని, దీంతో ఆర్టికల్ రద్దు చేసిన బీజేపీ నిర్ణయాన్ని వారు వ్యతిరేకించారని ప్రపంచానికి చూపాలని వారి ఎత్తుగడ. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్టికల్ రద్దు కూడా కీలకం కావడంతో కాంగ్రెస్‌కు ముచ్చెమటలు పడుతున్నాయి. ప్రాంతీయ పార్టీలు వారికి లేని అధికారంతో ఆర్టికల్ 370 పునరుద్ధరిస్తామని ఎన్నికల్లో ప్రధానంగా కశ్మీర్ వ్యాలీలో వాగ్దానాలు చేస్తున్నా, కాంగ్రెస్ మాత్రం ఆచితూచి అడుగులేస్తుంది. రాష్ట్ర హోదా పునరుద్ధరణకు గట్టిగా డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ ఆర్టికల్ 370 పునరుద్ధరణ అంశాన్ని మాత్రం ప్రస్తావించడం లేదంటేనే దీని ప్రాధాన్యత తెలుస్తుంది. ఆర్టికల్ 370 రద్దు ఒక్క కశ్మీర్‌కు చెందిన విషయం కాదు. అది యావత్ భారతదేశ ప్రజల చిరకాల వాంఛ. దశాబ్దాల తర్వాత నెరవేరిన కల. భారతదేశంలో కశ్మీర్ కూడా ఒక అంతర్భాగం కావాలనే ప్రతి ఒక్క భారతీయుడి కల. అంతేకానీ వేర్పాటు వాదంతో ప్రత్యేకతలు కావాలనుకునే కశ్మీరులకు అన్యాయం జరిగిందని సగటు భారతీయుడు భావించడం లేదు. ఇది జమ్మూ కశ్మీర్‌కు చెందినదైనా దేశంతో ముడిపడిన అంశం. దేశంలో మరే ఇతర ప్రాంతం వారు కూడా స్వేచ్ఛ, స్వయం ప్రతిపత్తి అంటూ ఇలాంటి గొంత్తెమ్మ కోర్కెలనే కోరుకుంటే ఆమోదిస్తామా..? కాంగ్రెస్ అవకాశవాద రాజకీయాలతో పబ్బం గడుపుకోవడంతోనే కశ్మీర్ సమస్య ఇప్పటికీ మండుతూనే ఉందని చరిత్ర చెబుతుంది.
పలు ప్రయోజనాల కోసమే ఆర్టికల్ రద్దు
ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదం తుడిచిపెట్టుకుపోయిందా అంటూ మేధావులు ప్రశ్నిస్తూ పెడార్థాలు తీస్తూ వక్రభాష్యాలు చెబుతున్నారు. ఆర్టికల్ రద్దు తర్వాత ఉగ్రవాద దాడులు, రాళ్ల దాడులు తగ్గాయని గణాంకాలే చెబుతున్నాయి. 2004 తర్వాత యూపీఏ ప్రభుత్వ హయాంలో 7217 ఉగ్ర దాడులు జరగ్గా, 2014 తర్వాత అవి 2259కు తగ్గాయి. ఆర్టికల్ 370 రద్దు తర్వాత 900 మంది ఉగ్రవాదులు హతమయ్యారని, రాళ్లు రువ్వుడు ఘటనలు తగ్గాయని పార్లమెంట్‌లో హోం శాఖ సహాయ మంత్రి ఒక ప్రశ్నకు జావాబుగా చెప్పారు. మరోవైపు ఉగ్రవాదులు కశ్మీర్‌లో తమ ఆటలు సాగకపోవడంతో తమ పంథాను మార్చుకొని అమాయక ప్రజలను ముఖ్యంగా పండిట్లను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్నారు. కశ్మీర్ బదులు జమ్మూలో దాడులకు ప్రయత్నిస్తున్నారు. వారి ప్రధాన లక్ష్యం కశ్మీర్‌లోకి తిరిగి రావాలనుకునే పండిట్లను, అక్కడ వ్యాపారాలను ప్రారంభించాలనుకునేవారిని భయభ్రాంతులకు గురిచేయడం. ఇక్కడ మరో ప్రధానాంశం ఉగ్రవాద నిర్మూలన ఒక్కటే ఆర్టికల్ ముఖ్య ఉద్ధేశ్యం కాదు. స్వయం ప్రతిపత్తి ఆర్టికల్‌ను అడ్డుపెట్టుకొని అక్కడి రాజకీయ పార్టీలు, నేతలు, వేర్పాటు వాదుల అరాచకాలను అడ్డుకోవాడం కూడా ఒక లక్ష్యమే. దేశంలో ఇతర రాష్ట్రాల్లో ఉన్నట్టు అక్కడ కూడా అదే రకమైన పాలన, చట్టాలుండాలి. ప్రకృతి అందాలతో మెరిసే అక్కడ పర్యాటకులు పెరగాలి. పర్యాటక రంగంగా జమ్మూ కశ్మీర్ అభివృద్ధి చెందాలి. ఇవేవీ పట్టించుకోకుండా కశ్మీర్ ముస్లింలకు ఏదో అన్యాయం జరిగిపోయిందని చెప్పే మేధావులు జమ్మూతో పాటు దేశం ప్రజల మనోభావాలను పరిగణలోకి తీసుకోకపోడం విచారకరం.
జమ్మూ కశ్మీర్‌లో గెలుపు కోసం ‘ఇండి’ కూటమితో పాటు ఇతర ప్రాంతీయ పార్టీలు బీజేపీని లక్ష్యంగా చేసుకుంటున్నాయి. బీజేపీని బూచిగా చూపి ముస్లింల ఓట్లను గంపగుత్తగా పొందాలని చూస్తున్నాయి. అవామీ ఇత్తేహాద్, అప్నీ వంటి చిన్న చిన్న పార్టీలు బీజేపీకి తోక పార్టీలుగా వ్యవహరిస్తున్నాయని ‘ఇండి’ కూటమి, పీడీపీ విమర్శిస్తుంటే, ఎన్సీ, పీడీపీ పార్టీలే బీజేపీతో తెరచాటున ఒప్పందాలు కుదుర్చుకున్నాయని ఆరోపిస్తుండడంతో బీజేపీ కేంద్రకంగా ఎన్నికలు జరుగుతున్నాయి.
జమ్మూ కశ్మీర్ ఎన్నికలకు ఆర్టికల్ 370 రద్దుకు లంకె పెడుతున్న మన కుహనా లౌకికవాదులు దేశంలోనే కాకుండా ప్రపంచం వ్యాప్తంగా సంచలనం రేపిన ఆర్టికల్ రద్దు నిర్ణయాన్ని 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఎందుకు ప్రస్తావించలేదు…? ఎందుకంటే దేశ ప్రజల వాంఛ వారికి తెలుసు. ప్రజా తీర్పు ఎలా ఉంటుందో వారికి తెలుసు. అప్పుడు మిన్నకుండా ఉన్న వారు ఇప్పుడు ఎదో జరగబోతుందనే ఆశతో 370 ఆర్టికల్ రద్దుపై గొంత్తెతున్నారు. 370 ఆర్టికల్ తిరిగి తీసుకొచ్చి జమ్మూ కశ్మీర్‌లో మళ్లీ అగ్నికి ఆజ్యం పోయడమే వీరి లక్ష్యమా..? కాలం మారింది. ఆర్టికల్ 370 రద్దు చరిత్రలో నిలిచిపోయింది. జమ్మూ కశ్మీర్ గతంతో పోలిస్తే ఇప్పుడు రక్తసిక్తం దిశగా కాకుండా అభివృద్ధి వైపు పయనిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా ఎదురు చూస్తున్న జమ్మూ కశ్మీర్ ప్రజాతీర్పు భారతదేశ కీర్తిని మరింత పెంచేలా ఉంటుందని ఆశిద్దాం.
============