‘నాటునాటు’కు ఆస్కారం తెలుగోళ్లందరిపై రుద్దే ప్రయత్నం ..‘తెలుగుతల్లి’ని అవమానించడం కాదా?

Nancharaiah merugumala : (senior journalist)
‘నాటునాటు’కు ఆస్కారంపై ఓ ‘జాతి’ బాధను తెలుగోళ్లందరిపై
రుద్దే ప్రయత్నం చేయడం ‘తెలుగుతల్లి’ని అవమానించడం కాదా?
తమిళ సోదరుడు ప్రేమ్‌ రక్షిత్, తెలుగు దిగ్గజాలు కనుకుంట్ల సుభాష్‌ చంద్ర బోస్, రాహుల్‌ సిప్లీగంజ్, కోడూరి ఎంఎం కీరవాణి, కోడూరి కాలభైరవ, అందరికన్నా ఎక్కువ శ్రమపడిన కోడూరి కార్తికేయ ఇంకా కోడూరి ఎసెస్‌ రాజమౌళి, వారి కుటుంబ సభ్యులు, అత్యధిక తెలుగు ప్రజానీకం– నిన్నటి నుంచి అనుభవిస్తున్న అతులిత ఆనందాన్ని, ఎల్లలు దాటిన సంతోషాన్ని కొందరు తెలుగు బుద్ధిజీవులు తమకు అత్యంత విషాదంగా మల్చుకుంటున్నారు. వర్ణింప అలవికాని బాధలో మళ్లీ మడికట్టుకుంటున్న ఈ ప్రత్యేక తెలుగు జాతిజనులు– అసలు ఆస్కార్‌ అవార్డు అంటే ఏమిటి? ఏ కేటగిరీలో ఏ పురస్కారం ఏ కొలతల ఆధారంగా ఇస్తారు? అని వివరిస్తూ సోమవారం నుంచి తెలుగు ప్రజానీకాన్ని వేధిస్తున్నారు. నాటునాటుకు అవార్డు ప్రకటించడం ఎంతటి ఘోర అపరాధమో విశ్లేషిస్తున్నారు. క్లాసుల మీద క్లాసులు పీకుతున్నారు.
అంతేకాదు, ఆరారార్‌లోని ‘నాటు నాటు’కు ఆస్కార్‌ అవార్డు వచ్చిన సందర్భాన్ని ఒక ‘పైకొచ్చిన’ తెలుగు కులంపై తమకు ఎప్పటి నుంచో ఉన్న అసూయాద్వేషాలను–తెలుగు పౌరులందరిపై రుద్దడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. గుడ్డలు చింపుకుంటున్నారు. అరిచి బొబ్బలు పెడుతున్నారు. అసలే రెండు రాష్ట్రాలుగా చీలిన తెలుగు ప్రపంచం యావత్తూ ‘నాటు నాటు’తో కాస్త ఊపు మీద ఉంది. ఎక్కడో కాలిపోర్నియా లాస్‌ ఏంజలస్‌ లోని డాల్బీ థీయేటర్‌ వేదికపై రెండు ప్రాంతాల కళాకారులు చేతులు కలిపి నడవడం కూడా ఈ మేధావివర్గానికి ఆనందంతో కన్నీళ్లు తెప్పించలేదు. తెలంగాణకు చెందిన వెనుకబడినవర్గాలకు చెందిన ఇద్దరు కళాకారులు చంద్రబోస్, రాహుల్‌ భాగస్వామ్యంతోపాటు తమిళ కొరియోగ్రాఫర్‌ (నుదుటిన బొట్టుపెట్టుకున్న హిందూ–క్రైస్తవ–హిందూ కళాకారుడు) ప్రేమ్‌ రక్షిత్‌ నాటునాటు సృష్టిలో పాలుపంచుకున్నందుకైనా పైన చెప్పిన తెలుగు మేధావి జాతి ఇక శాంతించాలి. కన్నీళ్లు తుడుచుకోవాలి. ‘తెలుగు ఒరిజినల్‌’ మేధావులు, సాహితీవేత్తలుగా పేరుమోసిన ఈ జాతి మేధావుల కొందరి తాజా పోకడలను ఆకాశం అవతలి నుంచి చూస్తున్న వేదాంతం రాఘవయ్య, కమలాకర కామేశ్వరరావు, ఆదుర్తి సుబ్బారావు, కె.విశ్వనాథ్, బాపు, ఘంటశాల వెంకటేశ్వరరావు, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తదితరులు హర్షించరు.