INCTelangana: తెలంగాణలో బడుగు బలహీన వర్గాలు సంబురాలతో ప్రత్యేక పండుగ చేసుకునే చారిత్రాత్మక వాతావరణాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించింది. రాజకీయంగా ఎలాంటి పరిణామాలు ఎదురైనా, ఎంతటి వ్యయప్రయాసాలైనా ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలనే ఏకైక దృఢ సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాలకు సామాజిక న్యాయం చేసింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ మార్చి 17వ తేదీన, ఎస్సీ వర్గీకరణకు సంబంధించి మార్చి 18వ తేదీన బిల్లులను చట్టసభల్లో ఆమోదించి బడుగు బలహీన వర్గాలకు సామాజిక న్యాయం అందించడంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచింది.
జనాభా ప్రాతిపదికన సామాజిక న్యాయం జరగాలనే లక్ష్యంతో దేశ వ్యాప్తంగా కులగణన చేపట్టాలని జాతీయ స్థాయిలో డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ అధికారంలో ఉన్న తెలంగాణలో ప్రయోగాత్మకంగా పూర్తి చేసింది. భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ తెలంగాణలో కులగణన చేపడుతామని చెప్పారు. అందుకు తగ్గట్టు అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ కామారెడ్డిలో 2023 నవంబర్లో నిర్వహించిన బీసీ డిక్లరేషన్లో కులగణపై హామీ ఇచ్చింది. ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన తర్వాత యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకొని శాస్త్రీయ పద్ధతిలో కులగణనను విజయవంతంగా పూర్తి చేసింది. అంతేకాక అనుకోని కారణాలతో ఎవరైనా నమోదు చేసుకోని వారికి కూడా నష్టం జరగకూడదనే సంకల్పంతో వారికి రెండోసారి అవకాశం కల్పించి కాంగ్రెస్ తన మానవ దృక్పథాన్ని చాటుకుంది. జనాభాలో సగంపైగా ఉన్న బీసీ సామాజిక వర్గానికి న్యాయం చేయాలనే లక్ష్యంతో తెలంగాణలో దిగ్విజయంగా కులగణనను పూర్తి చేసిన కాంగ్రెస్ ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిగా నిలబడిరది. మరోవైపు ఎస్సీ వర్గీకరణపై ఉన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా ఎస్సీ వర్గీకరణ చేపట్టిన తొలి రాష్ట్రంగా కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో తెలంగాణ చరిత్ర సృష్టించింది.
బడుగు బలహీన వర్గాలకు సామాజిక న్యాయం చేయాలని కంకణం కట్టుకున్న కాంగ్రెస్ కులగణన పూర్తి చేసి చేతులు దులుపుకోకుండా ఆ ఫలాలు నిజమైన లబ్దిదారులకు అందించేందుకు వేగవంతమైన చర్యలు తీసుకుంది. శాస్త్రీయంగా చేపట్టిన కులగణనలో రాష్ట్రంలో 56 శాతానికిపైగా బీసీ జనాభా ఉందని నిర్ధారణ కావడంతో వారికి విద్యా, ఉపాధి, స్థానిక ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టసభలో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదానికి రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిస్వార్థంగా కృషి చేసింది. కాలయాపన జరగకుండా తెలంగాణలోని బడుగు బలహీన వర్గాలకు త్వరగా సామాజిక న్యాయం అందేందుకు కేంద్ర ప్రభుత్వంపై అన్ని వైపుల నుండి ఒత్తిడి తెచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఎలాంటి సాంకేతిక, న్యాయపరమైన చిక్కులు ఎదురవకుండా రాజ్యాంగం 9వ షెడ్యూల్లో చేర్చి రిజర్వేషన్ల బిల్లుకు చట్టబద్ధత తేవాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వాన్ని కోరుతోంది.
బీసీలకు న్యాయం జరిగేందుకు ప్రభుత్వానికి ప్రతిపక్ష పార్టీలు బీఆర్ఎస్, బీజేపీ రాజకీయాలకు అతీతంగా సహకరించాలి. కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు రాష్ట్ర బీజేపీ నేతలు కృషి చేయాలి. తెలంగాణ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లతో పాటు మిగతా ఆరుగురు ఎంపీలు కూడా బీజేపీ అధిష్టానాన్ని ఒప్పించి బీసీ రిజర్వేషన్ల బిల్లుకు చట్టబద్దత కల్పించి తమ నిబద్ధతను చాటుకోవాలి. మరోవైపు బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ కూడా కేంద్రంలోని బీజేపీపై బిల్లు చట్టబద్దత కోసం ఒత్తిడి తీసుకురావాలి. కేంద్రంలో బిల్లు ఆమోదం కోసం రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలను కలుపుకొని పోయేందుకు కాంగ్రెస్ సిద్దంగా ఉన్నట్టు ఇప్పటికే ప్రకటించింది. అనుకోని కారణాలతో కేంద్రంలో బిల్లు ఆమోదానికి ఏమైనా ఆలస్యం జరిగినా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం టికెట్లిస్తామని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రకటించి సామాజిక న్యాయంపై తమకున్న నిబద్ధతను నిరూపించుకుంది. బీఆర్ఎస్, బీజేపీ నుండి కూడా ఇదేతరహా స్పందన ఆశించినా ఇప్పటి వరకూ సానుకూల పరిణామాలు, ప్రకటనలు వెలువడలేదు.
దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న ఎస్సీ వర్గీకరణ బిల్లుపై సుప్రీం కోర్టు చారిత్రాత్మక తీర్పు స్వాగతిస్తూ మాటలకే పరిమితం కాకుండా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఆచరణలో అడుగులు వేసింది. సుప్రీం కోర్టు తీర్పు అనంతరం ఎస్సీ వర్గీకరణను అమలు చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ చరిత్ర సృష్టించి ఇందులో కూడా ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచి సామాజిక న్యాయం అందించడంలో అందరి కంటే ముందుంటామని కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి నిరూపించుకుంది. ఎస్సీ వర్గీకరణపై సుప్రీం కోర్టు తీర్పు అనంతరం తెలంగాణ ప్రభుత్వం దీనిపై అధ్యయనానికి రిటైర్డ్ జస్టిస్ డాక్టర్ షమీమ్ అక్తర్ నేతృత్వంలో కమిషన్ నియమించింది. ఎస్సీల్లో 59 వర్గాలకు సంబంధించిన అక్షరాస్యత, ఉపాధి, నియామకాలు, వారి ఆర్థిక స్థితిగతులు, రాజకీయ అవకాశాలపై సమాచారాన్ని సేకరించిన కమిషన్ కూలంకుషంగా అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది.
డ్టాకర్ షమీమ్ అక్తర్ కమిషన్ నివేదిక సూచనలు మేరకు రిజర్వేషన్ల ఫలితాలు అందరికీ దక్కాలనే ఆశయంతో ఎస్సీలను మూడు గ్రూపులుగా విభజించి అందరికీ సామాజిక న్యాయం అందేలా కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ బిల్లు రూపొందించింది. గ్రూప్ 1లో 15, గ్రూప్ 2లో 18, గ్రూప్ 3లో 26 కులాలను చేర్చి మూడు గ్రూపుల్లోని 59 కులాలకు 15 శాతం రిజర్వేషన్లు కల్పించారు. ఏకపక్ష నిర్ణయం తీసుకోకుండా, ఎలాంటి అనుమానాలకు తావులేకుండా రిజర్వేషన్ల ప్రయోజనాలు అందరికీ దక్కేలా జాతీయ ఎస్సీ కమిషన్ను కూడా తెలంగాణ ప్రభుత్వం సంప్రదించి అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా ఎస్సీ వర్గీకరణ బిల్లు సభలో ప్రవేశపెట్టి ఆమోదింప చేసి అన్ని వర్గాలకు న్యాయం చేసింది.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సామాజిక న్యాయానికి కట్టుబడి అనేక చర్యలు తీసుకుంటుంటే ప్రతిపక్షాలు నిరాధార ఆరోపణలు చేయడం శోచనీయం. కులగణన ప్రక్రియను బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కూడబలుకొని తప్పుపట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. బీసీల సంఖ్యను తక్కువగా చూపుతున్నారంటూ విమర్శిస్తున్న ఈ పార్టీలు ఏ లెక్కల ఆధారంగా మాట్లాడుతున్నారో స్పష్టత లేదు. కులగణన సర్వే లెక్కలు తప్పంటూ బీఆర్ఎస్ అనధికారికంగా సమగ్ర కుటుంబ సర్వే లెక్కలను చెబుతోంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో భయానక వాతావారణం సృష్టించి ఒక ప్రహసనంగా నిర్వహించిన సమగ్ర కుటంబ సర్వే నివేదిక వివరాలను వారి పాలనలో ఎందుకు బహిర్గతం చేయలేదో చెప్పాలి. ఇప్పుడు వారు చెబుతున్న గణాంకాలకు ఆధారాలేమిటో చూపాలి. అవి సమగ్ర కుటుంబ సర్వే లెక్కలే అయితే ఇంతకాలం గోప్యంగా ఉంచడానికి కారణాలేమిటో ఆ పార్టీ నాయకత్వం స్పష్టం చేయాలి. సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ప్రకారం బీసీ జనాభా కులగణన సర్వే లెక్కల కంటే అధికంగా ఉంటే బీఆర్ఎస్ పాలనలో స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుండి 23 శాతానికి ఎందుకు తగ్గించారు..? సామాజిక న్యాయం కోసం ఎవరైనా రిజర్వేషన్లు పెంచుతారు కానీ, బీఆర్ఎస్ ఆప్పుడు రిజర్వేషన్లు తగ్గించి వారికి అన్యాయం చేసి, ఇప్పుడు బీసీలపై మొసలి కన్నీరు కారుస్తోంది.
దేశంలో గతంలో ప్రతి పదేళ్లకు జనాభా లెక్కల్ని సేకరించేవారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చాక జనాభా లెక్కలకు బ్రేక్ పడింది. దీంతో అధికారిక లెక్కలు లేకపోవడంతో ప్రధానంగా బడుగు బలహీన వర్గాల వారు హక్కులు కోల్పోతున్నారు. దేశంలో జనాభా లెక్కలతో పాటు కులగణన కూడా చేపట్టాలని కాంగ్రెస్ కోరుతున్నా నరేంద్ర మోదీ ప్రభుత్వంలో చలనం లేదు. మరోవైపు కులగణనపై రాష్ట్ర బీజేపీ నేతలు బీసీలో ముస్లింలను ఎలా కల్పుతారని మతపరంగా రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. బీజేపీ మోడల్ రాష్ట్రమైన గుజరాత్లో ముస్లింలు బీసీల్లో ఉండగా, ప్రశ్నించలేని వీరు ఇక్కడ మతం పేరుతో ఉద్రిక్తతలు సృష్టించేందుకు కుట్రలు పన్నుతున్నారు. జాతీయ పార్టీ అయిన బీజేపీ ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధానం అనుసరిస్తుందా అనేదానిపై స్పష్టత ఇవ్వాలి.
కాంగ్రెస్ పార్టీ అందించిన అభయహస్తంతో తెలంగాణలోని బడుగు బలహీన వర్గాలకు సామాజిక న్యాయం లభించడంతో వారు పండుగ వాతావరణంలో సంబురాలు చేసుకుంటున్నారు. సామాజిక న్యాయానికి నిత్యం పెద్ద పీట వేసే కాంగ్రెస్ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ, ఎస్సీ వర్గీకరణ చేస్తూ చట్టసభల్లో బిల్లులను ఆమోదించి కాంగ్రెస్ బడుగు, బలహీన వర్గాల పక్షపాత ప్రభుత్వమని మరోసారి నిరూపించుకుంది. తెలంగాణలో సామాజిక న్యాయం కోసం కృషి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు గుడ్డిగా తప్పు పట్టడమే లక్ష్యంగా విమర్శలు చేసే బదులు సహకరిస్తే బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి చేయూత అందిచ్చిన వారవుతారు.
==========