BJPTELANGANA: అధ్యక్షుడిగా బండి? కలిసొచ్చిన చలో సెక్రటేరియట్..!

BJP Telangana:

తెలంగాణ బీజేపీ అధ్య‌క్ష కుర్చీ పై మ‌రోసారి చ‌ర్చ జ‌రుగుతోంది.త్వ‌ర‌లోనే పార్టీ అధ్య‌క్షుడి ఎంపిక జ‌ర‌గ‌నున్న‌ నేప‌థ్యంలో ఎవ‌రికివారు ప్ర‌య‌త్నాల‌ను ముమ్మ‌రం చేశారు. ఈక్ర‌మంలోనే గ్రూపు 1 అభ్య‌ర్థుల మ‌ద్ద‌తుగా మాజీ అధ్యక్షుడు , కేంద్ర‌హోంశాఖ‌ స‌హాయ‌మంత్రి బండిసంజ‌య్ కుమార్ చేప‌ట్టిన చ‌లో సెక్రెటేరియ‌ట్ ర్యాలీ క‌మ‌లం పార్టీలోపెద్ద‌చ‌ర్చ‌కు దారితీసింది. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల త‌ర్వాత స్తబ్దుగా ఉన్న పార్టీ కేడ‌ర్‌లో బండి ప్రోగ్రాంతో ఒక్క‌సారిగా జోష్ పెరిగింది. దీంతో మ‌రోసారి అధ్యక్షుడిగా బండిసంజ‌య్ ను నియ‌మించాల‌న్న ప్ర‌తిపాద‌న క్యాడ‌ర్ తో పాటు అన్నివ‌ర్గాల నుంచి వినిపిస్తోంది. ఇదే ఊపును కొన‌సాగిస్తే రెండు మూడు నెలల్లో జ‌ర‌గ‌న‌నున్న స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లోనూ స‌త్తాచాటే అవ‌కాశం ఉంద‌న్న అభిప్రాయం పార్టీ నేత‌ల నుంచి వ్య‌క్త‌మ‌వుతోంది.

 

తెలంగాణ‌లో పార్ల‌మెంట్ ఎన్నిక‌ల త‌ర్వాత యాక్టివిటీ ప‌రంగా బీజేపీ చేప‌ట్టిన ఏ కార్య‌క్ర‌మం అంత‌గా స‌క్సెస్ కాలేదు. ప‌దేళ్ల త‌ర్వాత చేప‌ట్టిన‌ మెంబ‌ర్ షిప్ డ్రైవ్ న‌త్త‌న‌డ‌క‌న సాగుతోంది. దీంతో పార్టీ నేతలు, కేడ‌ర్ నైరాశ్యంలో మునిగిపోయింది. ఎనిమిది మంది ఎమ్మెల్యేలు, ఎనిమిది మంది ఎంపీలు ఉన్నా.. రాష్ట్ర ప్ర‌భుత్వం చేప‌ట్టిన మూసీ పున‌రుజ్జీవ‌న‌, హైడ్రాపై పార్టీ విధానం ఏంటో తెలియ‌క నేతలు ఇష్టానుసారం మాట్లాడ‌టం పార్టీకి న‌ష్టం చేకూరింది. ఇది చాల‌ద‌న్న‌ట్లు అధ్య‌క్ష‌ కుర్చీకోసం పార్టీ సిద్దాంతాల‌కు విరుద్ధంగా కొత్త‌మంది ముఖ్య‌నేత‌లు బ‌హిరంగంగానే పార్టీపై విమ‌ర్శ‌లు చేయ‌డం అధిష్టానానికి త‌ల‌నొప్పిగా మారింది. ఈ తరుణంలో గ్రూప్ 1 అభ్యర్థుల ఆందోళన రూపంలో అందివచ్చిన అవకాశాన్ని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అందిపుచ్చుకొని బీజేపీ కేడర్ లో జోష్ నింపారు. చలో సెక్రటేరియట్ పిలుపుతో  సంజయ్  చేపట్టిన ర్యాలీకి వేలాదిమంది యువత తరలిరావడం..ఆయన అరెస్టు కావడం కమలం పార్టీకి కలిసొచ్చింది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు  బండి సంజయ్ నాయకత్వంలో బీజేపీ పార్టీ ఫుల్ స్వింగ్లో కనిపించింది. అప్పటి అధికార బిఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఎదిగింది. అనూహ్యంగా ప్రెసిడెంట్ పదవి నుంచి సంజయ్ తొలగింపుతో అసెంబ్లీ ఎన్నికల్లో 8 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. అనంతరం జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో మోదీ హవా పుణ్యామని అధికార పార్టీతో సమానంగా 8 సీట్లు గెలుచుకుంది. అయితే గత ఆరు నెలలుగా నాయకత్వ లోపంతో పార్టీలో జోష్ లోపించింది. దీంతో బండి సంజయ్ చేపట్టిన చలో సెక్రెటేరియట్ ర్యాలీ నిద్రావస్థలో ఉన్న పార్టీ నేతలకు, బీజేపీ అనుబంధ సంఘల్కను మేల్కొల్పింది. ఇదే దూకుడును కొనసాగిస్తే.. త్వరలో జరబోయే స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో అధిక పంచాయతీలను గెలుచుకునే అవకాశం ఉంటుందని వాదన తెరపైకి వచ్చింది.

 బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్, ఎమ్మెల్యే కడియం శ్రీహరి బండి ప్రాబల్యం పెరుగుతుందని గుర్తించి వ్యక్తిగత దూషణలు చేశారు. దూకుడుకు కేరాఫ్ అడ్రస్ అయిన బండి తనదైన శైలిలో కేటీఆర్ ను మాటల తూటాలతో ఆటాడుకున్నారు. ఇదే విషయమై ఓ ప్రెస్ మీట్ సందర్భంగా బండి వ్యాఖ్యలపై విలేఖరి కేటిఆర్ ను ప్రశ్నించగా సమాధానం దాటవేశారు.

తాజాగా  గ్రూపు 1 అభ్యర్థులకు మద్దతుగా సంజయ్ చేపట్టిన ర్యాలీ,అరెస్టు బీజేపీ పార్టీకి బూస్టప్ అనడంలో ఎలాంటి సందేహం లేదు.రానున్న రోజుల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇలాంటి కార్యక్రమాలు కొనసాగిస్తే బాగుంటుందన్న మాట పార్టీ నేతల నుంచి వ్యక్తమవుతుంది. ముఖ్యంగా కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు, మూసి ప్రక్షాళన, హైడ్రా అంశాలపై ప్రతిపక్ష బిఆర్ఎస్ ధీటుగా పోరాడితే 2029 ఎన్నికల నాటికి పార్టీ అధికారంలోకి వచ్చేందుకు వీలు ఉంటుందనం వాదన వినిపిస్తోంది. అంతేకాకుండా క్షేత్ర స్థాయిలో పార్టీ ఎస్టాబ్లిష్ అయ్యేందుకు ఆస్కారం ఉంటుందన్న మాట పార్టీ నేతల నుంచి వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలోనే కొంత మంది పార్టీ శ్రేణులు, ముఖ్య నాయకులు,అభిమానులు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, పార్టీ చీఫ్ జేపీ నడ్డాకు సంతకాలతో కూడిన లేఖల ద్వారా సంజయ్ అభ్యర్థిత్వానికి మద్దతు  తెలిపినట్లు వార్తలు వస్తున్నాయి.

ఒకే దెబ్బ‌కు రెండు పిట్ట‌ల సామెత..

గ్రూప్ 1 అభ్యర్ధుల ర్యాలీతో బండి సంజయ్ ఒకే దెబ్బ‌కు రెండు పిట్ట‌ల సామెత మాదిరి అటు ప్రత్యర్థులకు.. ఇటు సొంత పార్టీలోని వ్యతిరేకులకు కోలుకోలేని దెబ్బ కొట్టారన్న మాట వినిపిస్తోంది . తన నాయకత్వ పోరాట పటిమ పై కొద్దోగొప్పో సందేహాలు ఉన్నా వారికి చలో సెక్రెటేరియట్ ర్యాలీ తో తిరుగులేని సమాధానమిచ్చారు.  ప్రస్తుత తరుణంలో పార్టీకి  తన నాయకత్వం ఎంత అవసరం చెప్పకనే చెప్పారు. బండి దూకుడుతో.. తెరవెనక  అధ్యక్ష  పదవి కోసం కుట్రలు పన్నిన నాయకులతో పాటు ఆశావహులు సందిగ్ధంలో సతమతమవుతున్నారు.