బీజేపీ సెగతోనే ఉద్యోగాల ప్రకటన: బండి సంజయ్

బీజేపీ ప్రభుత్వానికి భయపడే సీఎం కేసిఆర్ ఉద్యోగాల ప్రకటన చేశారన్నారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ఉద్యోగ నియామకాల ప్రక్రియ పూర్తయ్యే వరకు కేసీఆర్​ను వదిలిపెట్టేదే లేదని తేల్చిచెప్పారు. కేంద్రం వల్ల ఉద్యోగాల భర్తీ ఆలస్యమైందని కేసీఆర్ అనటం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధంగా 317 జీవో జారీ చేశారన్నారు. 2016లో నోటిఫికేషన్ ఇచ్చిన ఫార్మాసిస్టులకు ఇప్పటికీ ఉద్యోగం ఇవ్వలేదని.. ప్రకటించిన ఉద్యోగాలకు వెంటనే నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు.

ఎన్నికల్లో నిరుద్యోగ భృతిపై హామీ ఇచ్చిన సీఎం..ఇప్పటివరకు ఎందుకు ప్రకటన చేయలేదని సంజయ్ ప్రశ్నించారు. బీజేపీ సెగతోనే కేసీఆర్ ప్రగతిభవన్ వీడి జిల్లాలు తిరుగుతున్నారన్నారు. ఉద్యోగాల ప్రకటనతో నిరుద్యోగులకు ఆశపెట్టి నెరవేర్చకుంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. పరీక్షలు నిర్వహించి, నియామక పత్రాలు ఇచ్చే వరకు పోరాడతామని సంజయ్ స్పష్టం చేశారు.