అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన యోగి!

ఉత్కంఠకు తెరపడింది. ఎగ్జిట్ పోల్ అంచనాలు తారుమారు అయ్యాయి. 30 ఏళ్ల చరిత్ర రికార్డు బద్దలయ్యింది. ఆ రాష్ట్రంలో ఓ ప్రాంతానికి వెళితే మళ్ళీ అధికారంలోకి రాడు అన్న మూఢ నమ్మకాన్ని పటా పంచలైంది. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ రెండో సారి యూపీ సీఎం పీఠాన్ని అధిరోహించబోతున్నారు యోగి ఆదిత్యనాథ్.

సార్వత్రికానికి సెమీఫైనల్స్‌గా భావించే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కమలం పార్టీ అద్భుత ఫలితాలు సాధించింది. ఎగ్జిట్‌పోల్స్‌ అంచనాలను తలకిందులు చేసి నాలుగు రాష్ట్రాల్లో (గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్, యూపీ) అధికారం నిలబెట్టుకుంది. ఇక దేశంలో అతిపెద్ద రాష్ట్రం ఉత్తర్‌ప్రదేశ్‌లో కాషాయం మరోసారి కమలం వికసించింది. వరుసగా రెండోసారి మెజార్టీ సీట్లతో అధికారాన్ని హస్తగతం చేసుకుంది. 403 అసెంబ్లీ స్థానాలకు 273 సీట్లను కైవసం చేసుకుని విజయదుందుభి మోగించింది.

ఇక యూపీలో 1985 నుంచి ముఖ్యమంత్రిగా చేసిన.. ఏ సీఎం కూడా ఆ తర్వాతి ఎన్నికల్లో గెలిచిన దాఖలాలు లేవు. అంతేకాక నోయిడాకు వెళ్లిన ఏ ముఖ్యమంత్రి మళ్ళీ అధికారంలోకి రాలేదు. ఈ అపోహలన్నింటిని యోగి పటాపంచలు చేస్తూ.. తాజాగా వెలువడిన ఫలితాల్లో గోరఖ్ పూర్ అర్బన్ నుంచి గెలిచి.. వరుసగా రెండో సారి యూపీ సీఎం పీఠాన్ని అధిరోహించబోతున్నారు.