తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ రైతు బంధు పథకాన్ని ఈసీ నిలిపివేసిన నేపథ్యంలో తెలంగాణ సర్కారుపై మండిపడ్డారు. వరుస ట్వీట్లలో ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శలు ఎక్కుపెట్టారు. సీఎం కేసీఆర్ వైఫల్యం వల్లే దళిత బంధు పథకాన్ని నిలిపివేస్తూ ఈసీ ఆదేశాలిచ్చిందని మండిపడ్డారు.దళితులను మరోసారి మోసం చేసినందుకు నైతిక బాధ్యత వహిస్తూ కేసీఆర్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తన కుట్ర బుద్దితోనే దళితబంధు పథకం కింద ఒక్కరికి కూడా నిధులు విడుదల చేయకుండా ఆపారని సంజయ్ అన్నారు.
కాగా దేశంలో బ్యాంకులు ఇప్పటికీ లబ్దిదారుల అకౌంట్లో పడిన సొమ్మును ఫ్రీజ్ చేసిన దాఖలాల్లేవని స్పష్టం చేశారు. కానీ, కేసీఆర్ మాత్రం ఉద్దేశపూర్వకంగా దళిత బంధు డబ్బులను లబ్దిదారుల అకౌంట్లో వేస్తూనే….అదే సమయంలో డ్రా చేసుకోకుండా ఫ్రీజ్ చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితబంధు ప్రకటించినప్పుడు బేషరతుగా దళితులు ఆ నిధులను వాడుకుని ఉపాధి పొందవచ్చని చెప్పిన కేసీఆర్….ఆ తర్వాత మాట మార్చి షరతులు విధించారన్నారు. బ్యాంకులో పడిన నిధులను లబ్దిదారులు డ్రా చేసుకునే వెసులుబాటు కల్పించాల్సిందేని బండి సంజయ్ పేర్కొన్నారు.
ఇక కేసీఆర్ ఏదొక రకంగా దళిత బంధు పథకాన్ని నిలిపివేయించి ఇతరులపై ఈ నెపాన్ని నెట్టాలని కుట్ర చేశారన్నారు సంజయ్. ఎన్నికల కమిషన్ నుండి ఆదేశాలు రాబోతున్నాయని ముందే తెలిసి, దళిత బంధుపై సమీక్ష నిర్వహించి చిలుక పలుకులు పలికారని ఎద్దేవ చేశారు. ఇప్పటిదాకా ఒక్క దళిత లబ్దిదారుడికి కూడా ఆ నిధులను వాడుకునే అవకాశం లేకుండా చేసినప్పటికీ…మరో రూ.250 కోట్లు విడుదల చేస్తున్నట్లు ప్రకటించి దళితుల పట్ల కేసీఆర్ మరో డ్రామాకు తెరలేపారని సంజయ్ ఆరోపణలు గుప్పించారు.