Karimnagar:
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటూ అరాచకాలకు పాల్పడుతున్నారని కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ బండి సంజయ్‌కుమార్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పోలీసుల వైఫల్యాన్ని ఆసరాగా చేసుకుని కాంగ్రెస్ శ్రేణులు రెచ్చిపోతున్నాయని ఆయన ఆరోపించారు.
కరీంనగర్‌లో జరిగిన మీడియా సమావేశంలో బండి సంజయ్ మాట్లాడుతూ.. బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై కాంగ్రెస్ నేతలు దాడికి పాల్పడిన ఘటనపై తీవ్రంగా స్పందించారు. ఇలాంటి ఘటనలను చూస్తూ పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని విమర్శించారు. అధికార పార్టీకి చెందిన వారిపై చర్యలు తీసుకోవడంలో పోలీసులు వెనుకంజ వేస్తున్నారని ఆరోపించారు.
“పోలీసుల వైఫల్యాన్ని కాంగ్రెస్ నాయకులు చేతకానితనంగా భావిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాంగ్రెస్ నాయకులారా ఖబడ్దార్!” అని బండి సంజయ్ హెచ్చరించారు.
రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యత పోలీసు యంత్రాంగంపై ఉందని, అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గకుండా చట్టప్రకారం వ్యవహరించాలని ఆయన సూచించారు. రాజకీయ విభేదాలు ఉన్నంత మాత్రాన ప్రత్యర్థి పార్టీల కార్యాలయాలు, కార్యకర్తలపై దాడులకు పాల్పడటం ప్రజాస్వామ్య పద్ధతి కాదన్నారు.
బీజేపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులను సహించేది లేదని స్పష్టం చేసిన బండి సంజయ్.. పార్టీ శ్రేణులకు అండగా ఉంటామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇకనైనా దాడులు, దౌర్జన్యాలకు అడ్డుకట్ట వేసి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
