Bandisanjay: బండి సంజయ్ యాత్రతో కాషాయం దళంలో జోష్..

Bandisanjay: బిజేపి జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రజాహిత యాత్ర మూడో రోజు వేములవాడ రూరల్ గ్రామాల్లో సాగింది.యాత్రకు అడుగడుగునా ప్రజలు నుంచి అనూహ్య స్పందన లభించింది. గడప గడపకు తిరుగుతూ సంజయ్ ప్రజల కష్టాలను స్వయంగా అడిగితెలుసుకున్నారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం వేములవాడ నియోజక వర్గానికి ఇచ్చిన నిధులను లెక్కలతో ప్రజలకు అర్థమయ్యే రీతిలో తెలియజేశారు. కృష్ణా జిల్లాల వాటా విషయంలో అసెంబ్లీ వేదికగా  కాంగ్రెస్, బీఆర్ఎస్ ఆడుతున్న డ్రామాను బట్టబయలు చేశారు.కేంద్రంలో నరేంద్ర మోడీ మరోసారి ప్రధాని  కావాల్సిన అవశ్యకతను నొక్కి వక్కాణించారు.

ఇక ప్రజాహిత యాత్రలో భాగంగా సంజయ్ కు అడుగడుగునా జనం నీరాజనం పట్టారు. సంజయ్ తమ గ్రామానికి వస్తున్నాడని తెలిసి మహిళలూ, యువత ఇళ్ల ముందు వేచి చూశారు.ఆయన రాగానే కరచాలనం చేస్తూ సెల్ఫీలు దిగి ..జై శ్రీరామ్.. భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు. చిన్న పిల్లల హడావుడి అంతా ఇంతా కాదు. సంజయ్ అన్న కి జై..జై శ్రీరామ్ నినాదాలు చేస్తూ సంజయ్ తో అడుగులో అడుగు వేస్తూ యాత్రలో నడిచారు. ఆయా గ్రామాల్లోని చిరు వ్యాపారులు, షాపు యాజమానులు సంజయ్ రాగానే ఆనందాన్ని వ్యక్తం చేస్తూ పార్లమెంట్ ఎన్నికలలో మా ఓటు బీజేపీ కే అంటూ మద్దతు తెలిపారు.

ఇక ప్రజాహిత యాత్రలో భాగంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై సంజయ్ నిప్పులు చెరిగారు.అసెంబ్లీలో క్రిష్ణా నీళ్లపై కాంగ్రెస్, బీఆర్ఎస్ అసెంబ్లీలో నువ్వెంత అంటే నువ్వెంత అని కొట్లాడుతున్నయ్. కేసీఆర్ ను కడిగిపారేస్తనని సీఎం అంటున్నడు… సీఎం సంగతి చూస్తామని బీఆర్ఎస్ నేతలంటున్నరు. ఈ రెండు పార్టీల నాయకులు ఎంత దుర్మార్గులంటే.. ఆ నాడు కేసీఆర్  ఒక అడుగు ముందుకేసీ తెలంగాణ నీళ్లను రాయలసీమకు ఇచ్చిండట. ఎంత దుర్మార్గమంటే…కేసీఆర్ ఆంధ్రోళ్ల కోసం ఒకడుగు ముందుకేసి… దక్షిణ తెలంగాణ ప్రజల గొంతులను ఎండబెట్టిండు. ఉమ్మడి పాలమూరు, నల్లగొండ, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాలను ఎడారిగా మార్చిండు. ఇయాళ సాగర్ ఆయకట్టు రైతులు రెండు పంట వేసుకుందామంటే నీళ్లు లేకుండా చేసిండు… ఆంధ్రోళ్లకు అమ్ముడుపోయి కేసీఆర్ క్రిష్ణా నీళ్లను ఏపీకి తాకట్టుపెడితే… ఈ కాంగ్రెసోళ్లు పోతిరెడ్డిపాడుకు పొక్కపెట్టి దక్షిణ తెలంగాణ ప్రజల గుండె మీద తన్నిర్రు… ఆనాడు నిండు అసెంబ్లీలో క్రిష్ణా నీటిని అక్రమంగా పోతిరెడ్డిపాడు ద్వారా వైఎస్సార్ నీళ్లు తీసుకుపోతున్నారని తెలిసి కూడా నోరు మెదపని దద్దమ్మలు తెలంగాణ కాంగ్రెస్ నేతలు.. వీళ్లా క్రిష్ణా నీళ్లపై మాట్లాడేది? సిగ్గుండాలే అంటూ సంజయ్ ద్వజమెత్తారు.

Bandisanjay

అటు వేములవాడ రూరల్ మండలంలోని పలు గ్రామాల్లోని ప్రజలు తమ సమస్యలను వినతి పత్రం రూపంలో సంజయ్ కి ఏకరువు పెట్టుకున్నారు.   శాత్రారాజు పల్లి గ్రామంలోని  పల్లె దవాఖానలో  కరెంట్, వాటర్  సరఫరా లేకపోవడం తో అధికారులకు ఫోన్ ద్వారా సమస్యను సంజయ్ తెలియజేశారు. గ్రామస్థులకుసమస్యల పరష్కారానికి కృషి చేస్తానని  భరోసా కల్పించారు.

మరోవైపు సంజయ్ యాత్రతో వేములవాడ నియోజకవర్గం బీజేపీ లో జోష్ కనిపిస్తోంది. యాత్రకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తుండడంతో కాషాయ దళంలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో నిరాశలో ఉన్న బీజేపీ కార్యకర్తలకు బండి సంజయ్ ప్రజాహిత యాత్ర ఊపును తీసుకొచ్చింది.