బెంగాల్ మంత్రి అరెస్ట్ కలకలం..

YELUVAKA SRAVAN(Journalsit):

===================

బెంగాల్లో మంత్రి అరెస్ట్ కలకలం రేపుతోంది. దీంతో మరోసారి బీజేపీ, టీఎంసీ నేతలు పరస్పరం మాటల తూటాలు పేలుస్తున్నారు.అసలు సినిమా ఇప్పడే మొదలైందని బీజేపీ నేత ట్విట్ చేయగా..కావాలనే టార్గెట్ చేసి దాడులు చేస్తున్నారని టీఎంసీ నేత కౌంటర్ చేయడం తీవ్ర చర్చకు దారితీసింది.

ఇక టీచర్ రిక్రూట్‌మెంట్ లో అవకతవకలకు పాల్పడ్డారనే నెపంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు మంత్రి చటర్జీని అరెస్టు చేశారు. దాదాపు 26 గంటల విచారణ అనంతరం అతనిని సాల్ట్ లేక్ ప్రాంతంలోని సీజీవో కాంప్లెక్స్‌లోని ఈడీ కార్యాలయానికి తరలించారు. స్కాంకి సంబంధించి శుక్రవారం జరిపిన దాడుల్లో మంత్రి సన్నిహితురాలైన అర్పితా ముఖర్జీ నుంచి సుమారు రూ.20 కోట్లను స్వాధీనం చేసుకున్నారు. నగదుతో పాటు 20కి పైగా సెల్‌ఫోన్లను ఆమెనుంచి జప్తు చేసినట్లు అధికారులు తెలిపారు.

కాగా విద్యా శాఖ మంత్రిగా ఉన్న సమయంలో పార్థా ఛటర్జీ పై ఉపాధ్యాయ నియామకాల్లో భారీ అక్రమాలు జరిగాయన్న ఆరోపణలున్నాయి. అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం కోల్‌కతాలో టీఎంసీ భారీ ర్యాలీ నిర్వహించింది. ఆ మరుసటి రోజే ఈడీ దాడులు చేయడం వెనుక తమ నాయకులను వేధించాలన్నదే ఈడీ వ్యూహంగా ఉందని టీఎంసీ నేతలు ఆరోపించారు. ఈ అంశంలో ఈడీ పూర్తి పారదర్శకతతో వ్యవహరిస్తుందని..అవినీతి ఎలుకలు ఎక్కడ దాకున్న బయటికి లాగడం ఖాయమని బీజేపీ నేతలు కౌంటర్ ఎటాక్ చేస్తున్నారు.