cinima: ఆడవాళ్ల ఎత్తు..లోతు తెలిసినవాడు..భారతీరాజా

విశీ (వి.సాయివంశీ) :

పొన్నాత్త..ఎట్లాంటి మనిషి? గయ్యాలి గంప కదా! అంత బారు చీర, చెవులు జారే గెంటీలు, ఇంతెత్తున కొప్పు. ఊరిపెద్ద భార్య అన్న మాటే కానీ..ఆ మనిషితత్వం అదో రకం. పనుల్లో అణకువ లేదు. మాటల్లో పొందిక లేదు. నోరు తెరిచిందంటే ఎవరికో మూడిందన్నమాటే! కూతురికి పెళ్లయ్యి మనవడు కూడా పుట్టాడు. అయినా ఆ తత్వంలో మార్పు రాలేదు. ఈ జన్మకి రాదని భర్త నిశ్చయం. భర్త లోకం కోసం పేరుకు మాత్రమే! ఏనాడూ అతడామెను తాకింది లేదు. కాపురం చేసింది లేదు. ఎవరో మగాడు చేసిన మోసానికి బిడ్డ కడుపులో పడితే..బావ వరసయ్యేవాడు తాళి కట్టి పరువు నిలిపాడు. కృతజ్ఞత ఎలాగూ లేదు. కనీసం ఆ మనిషిని అర్థం చేసుకునే ఒడుపు, నేర్పు కూడా లేదు పొన్నాత్తకి.

1985లో భారతీరాజా తీసిన ‘ముదల్ మరియాదై’(తెలుగులో ‘ఆత్మబంధువు’) సినిమాలో నటి వడివుక్కరసి వేసిన పాత్ర ఇది. పల్లె మూలల్లో ఇలాంటి పొన్నక్కలు ఉంటారని ఎవరు ఊహించరు? ఊహించినా ఎవరు తెరపై చూపించారు? భారతీరాజాకే చెల్లింది ఆ ఘనత. అప్పటికి శివాజీ గణేశన్‌కు 57 ఏళ్లు, వడివుక్కరసికి 28 ఏళ్లు. వీళ్లిద్దర్నీ భార్యాభర్తల్ని చేయాలన్న ఆలోచన..చేయగలనన్న ధీమా భారతీరాజాకు తప్ప మరెవరికైనా వస్తుందా? భారతీరాజా తీసిన అన్ని సినిమాలనూ ఎవరో ఒకరు రీమేక్ చేయొచ్చు. కానీ ‘ముదల్ మరియాదై’ మాత్రం ఇంపాజిబుల్. తెలుగులో ఈ సినిమాను డబ్ చేస్తూ, శివాజీ గణేశన్‌కి డబ్బింగ్ చెప్పాలని తెలుగు నటుడు జగ్గయ్యని పిలిచారు. సినిమా అంతా చూసి, ఆయన శివాజీ గణేశన్‌కి ఫోన్ చేసి ‘ఎంత బాగా యాక్ట్ చేశావయ్యా! తెలుగు డబ్బింగ్ నువ్వే చెప్తే బాగుంటుంది కదా!’ అన్నారంట. అది కుదరక చివరకు జగ్గయ్యే వాయిస్ ఇచ్చారు.

‘ఆరాధన’లో గంగమ్మను చూడండి. తను ప్రాణంలా ప్రేమించిన పులిరాజు బావ జెన్నిఫర్‌ను ప్రేమించాడని తెలిసి ఆమె మనసు ముక్కలైంది. అయినా సర్దుకుంది. జెన్నిఫర్ బావని విడిచివెళ్లిపోయిందని తెలిసి బాధపడింది. అతనికి సేవలు చేస్తూ బతకాలనుకుంది. ఎవడో పోకిరీవాడు పులిరాజుకు వినబడేలా జెన్నిఫర్ గురించి ఏదో కూశాడు. అతణ్ని కొట్టబోయేలోగా గంగమ్మ అడ్డుపడి ‘వాళ్లు జెన్నిఫర్‌ గురించి తప్పుగా అనలేదు బావా! నా గురించి అన్నారు’ అని తప్పు తన వైపుకు తిప్పుకుంది. ఆ పిచ్చిమాతల్లి మనసు అంత స్వచ్ఛమైనది. పులిరాజు తన వంక చూసి ‘గంగమ్మా! నన్నెంత తేలిగ్గా అంచనా వేశావ్! నీ గురించైతే ఒకటీ..జెన్నిఫర్ గురించైతే ఒకటీనా?’ అని మనసులో అనుకుంటాడు. ‘ఆరాధన’ అంటే చిరంజీవి, సుహాసిని అంటారు కానీ..రాధిక చేసిన గంగమ్మ పాత్ర గురించి కదా మాట్లాడుకోవాలి.

ఇప్పుడు అసలైనది..అతి ముఖ్యమైనది. ‘సీతాకోకచిలుక’లో డేవిడ్ భార్య లిస్సీ పాత్ర. వేసిందెవరు? ది గ్రేటెస్ట్ యాక్ట్రస్ సిల్క్ స్మిత. పనివాడు లేనప్పుడు..పనివాడి భార్య ఒంటరిగా ఉన్నప్పుడు ఆ గుడిసెలోకి భర్త వెళ్లడం కిటికీలోంచి చూసి ఆమె గుండె పగిలిపోతుంది. కన్నీళ్లతో దీనంగా పెరటి వాకిలి గడప దగ్గర కూర్చుంటుంది. పనివాడు వచ్చాడు. లోపలికి వెళ్తే..భర్త ఘాతుకం బయటపడితే..ఈ విషయం బయటకు పొక్కితే? పనివాణ్ని ఆపి..హడావిడిగా ఏదో పని పురమాయిస్తుంది. ‘లోపల పులుసు మరిగిపోతుందిరా!’ అంటూ పసుపు తెమ్మని పంపిస్తుంది. వెళ్లబోయేలోగా భర్త గుడిసెలోనుంచి బయటకు వస్తూ పనివాడి కంటపడతాడు. ఆ క్షణాన ‘మీరు చేసిన హడావిడంతా ఇందుకా అమ్మగారూ?’ అంటూ పనివాడు ఆమెవైపు చూపు చూస్తాడు. అక్కడికక్కడే భూమిలోకి కూరుకుపోతే బాగుండు అన్న భావం లిస్సీలో కనిపిస్తుంది. సిల్క్ స్మితకే ఆ పాత్ర ఇవ్వాలని ఎలా కనిపెట్టారో భారతీరాజా? హ్యాట్సాఫ్!

‘తింటే గారెలే తినాలి..తీస్తే మహిళల సమస్యల మీద కె.బాలచందరే సినిమాలు తీయాలి’ అని తమిళ సినీరంగం భావిస్తున్న టైంలో ‘పదినారు వయదినిలే’తో దూసుకొచ్చినవాడు భారతీరాజా. 16 ఏళ్ల కన్నెపిల్ల గుండెల్లో కోరికలు..కళ్లల్లో ఆశలు..ఒంట్లో యవ్వనం..చుట్టూ సమాజంలో రకరకాల మనుషులు..1977 నాటికి ఎవరైనా ఊహించారా ఇట్లాంటి కథలొస్తాయని? 13 ఏళ్ల చైల్డ్ ఆర్టిస్ట్ శ్రీదేవితో హీరోయిన్‌గా సినిమా ఏమిటని అందరూ చెవులు కొరుక్కున్నారు. అయినా భారతీరాజా వెనకడుగు వేయలేదు. వేసే ఉద్దేశం లేదు. ‘సెందూర పువ్వే..సెందూర పువ్వే’ అని పాట పాడుతూ..ఆ చేలగట్ల మీద శ్రీదేవిని సరికొత్తగా చూపించి అందరి నోళ్లు మూయించాడు. కమల్‌హాసన్ హీరోగా..రజినీకాంత్ విలన్‌గా మెప్పించారు. ఈ సినిమాలో కమల్‌హాసన్ పారితోషికం రూ.29 వేలు..శ్రీదేవికి రూ.9 వేలు..రజినీకాంత్‌కి రూ.3 వేలు.

ఆ తర్వాత ‘కిళక్కే పోగుమ్ రైల్’తో రాధికను తెర మీదకు తీసుకొచ్చారు. కథ చూడండి ఎట్లాంటిదో! భారీ వర్షం పడి, ఊరు మునిగిపోకుండా ఉండాలంటే కన్నెపిల్ల నగ్నంగా ఊరంతా తిరగాలంటున్నారు పెద్దలు. చెయ్యక తప్పదు. ఓ పేదింటి పిల్ల బలికాబోతుంది. ఆ పిల్ల అప్పటికే ఒకతణ్ని ప్రేమించింది. ఉద్యోగం కోసం అతను ఊరొదిలి వెళ్లాడు. ఈ పిల్ల ఇక్కడ ఇలాంటి స్థితిలో పడింది. ఊరి కోసం ఈ పని చేయక తప్పదు. దిగంబరంగా ఊరేగక తప్పదు. చివరకు ప్రేమికుడు వచ్చాడు. ఆమెను కాపాడి, తన వెంట తీసుకెళ్లాడు. ఇద్దరూ తూర్పు వెళ్లే రైలు ఎక్కారు.

ప్రేమ కథలు తీయడంలో భారతీరాజా సిద్ధహస్తులు. పల్లె ఆయన కథలకు పట్టు. నేటివిటీ ఆయన కథలకు జీవం. బ్రాహ్మణ అబ్బాయి – క్రిస్టియన్ అమ్మాయి ప్రేమకథను అద్భుతంగా తీస్తే జనం చూశారు. ఓ పెద్ద వయసు వ్యక్తి – పడన నడిపే అమ్మాయి మధ్య అలౌకిక ప్రేమను సినిమాగా తీస్తే చూశారు. సముద్రం పక్కన పెరిగిన ఓ మొరటోడు ఓ క్రిస్టియన్ టీచర్‌ని మనసారా ప్రేమించిన కథను తీసినా (తమిళంలో) చూశారు. అన్నీ ప్రేమలే అయినా..ఒక్కొక్కటి ఒక్కో విధం. అదే భారతీరాజా స్టైల్. ఇక ఇళయారాజా సంగీతం తోడయితే చెప్పేదేముంది? మాటే మంత్రము..మనసే బంధము.

ఆడపాత్రల విషయంలో చాలా జాగ్రత్త చూపడం భారతీరాజాకు చెల్లు. అంటే వాళ్లని దేవతల్లా చూపించడం, వాళ్ల గొప్పతనాలు మాత్రమే చెప్పడం కాదు. అందరూ మంచివాళ్లే అయితే కథ నడిచేదెలా? వాళ్ల లోపాలు, బలహీనతల్ని కూడా తెర మీదకు తీసుకొచ్చారు. వడివుక్కరసి చేత గయ్యాలి పాత్ర వేయించినట్టే, స్టార్‌ హీరోయిన్ రాధిక చేత ‘తాజ్‌మహల్’ సినిమాలో తాగుబోతు పాత్ర చేయించారు. సమాజంలో ఉన్న పాత్రలను యథాతథంగా చూపించారు. ఆడవాళ్ల ఎత్తు, లోతు తెలిసిన మనిషి ఆయన. అందుకే పుట్టుకతో చిన్నసామి అయిన ఆయన..సినిమాల్లోకి వచ్చాక, తన చెల్లి పేరుతో భారతీరాజా అయ్యారు. ఆ తర్వాత తన తల్లి ‘కరుత్తమ్మ’ పేరును ఇనీషియల్‌గా చేర్చుకొని, కె.భారతీరాజాగా మారారు.

రాధిక, రాధ, రేవతి, రంజిత, ముచ్చెర్ల అరుణ, రతి అగ్నిహోత్రి, భాగ్యరాజా, సత్యరాజ్, వడివుక్కరసి, కార్తిక్, నెపోలియన్, మహేశ్వరి, జనకరాజ్, అశ్విని, సుకన్య..వీళ్లంతా భారతీరాజా టీమ్. ఆయన స్కూల్ నుంచి వచ్చినవారు. ఆయన సినిమాల ద్వారా తెరకు పరిచయమైనవారు. ఆయన చేత దెబ్బలు తిని పాఠాలు నేర్చుకున్నవారు.

పోయినేడాది భారతీరాజా కొడుకు మనోజ్ 48 ఏళ్ల వయసులో గుండెపోటుతో మరణించడం ఆయన జీవితంలో తట్టుకోలేని విషాదం. 1999లో ‘తాజ్‌మహల్’ అనే సినిమాతో భారతీరాజా అతణ్ని హీరోగా పరిచయం చేశారు. పెద్దగా ఆడలేదు. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసినా బ్రేక్ రాలేదు. కాలం గడుస్తున్న టైంలో ఉన్నట్టుండి అతను మరణించడం ఎవరూ ఊహించని విషయం. అప్పట్నుంచి అనారోగ్యంతో ఉన్న భారతీరాజా ఇప్పుడు శాశ్వతంగా వెళ్లిపోయారు. కొన్ని కథల్ని ప్రేక్షకుల దోసిట్లో పోసి వెళ్లిపోయారు. ఆయనకు నివాళి.

Optimized by Optimole