మునుగోడు ఉప ఎన్నిక టీఆర్ఎస్, కాంగ్రెస్ లో చిచ్చును రాజేసింది. పార్టీ అభ్యర్థులుగా కొందరి పేర్లు ప్రచారంలోకి రావడంతో అసంతృప్త నేతలు బహిరంగంగానే హెచ్చరికలు జారిచేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్లుకు టికెట్ వస్తుందని ప్రచారం ఊపందుకోవడంతో .. టీఆర్ఎస్ ముఖ్యనేతలు ఆయనకు వ్యతిరేకంగా జట్టు కట్టారు. అటు కాంగ్రెస్ అభ్యర్థిగా చల్లమల్ల కృష్ణారెడ్డి పేరు ప్రచారంలోకి రావడం.. ఆయనకు టికెట్ ఇవ్వొదంటూ పాల్వాయి స్రవంతి మాట్లాడిన ఆడియో వైరల్ కావడం పార్టీలో తీవ్రకు చర్చకు దారితీసింది.
ఇక టీఆర్ఎస్ లో అసమ్మతి నేతలను బుజ్జగించేందుకు మంత్రి జగదీష్ రెడ్డి రంగంలోకి దిగారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో నియోజకవర్గ ముఖ్యనేతలతో సమావేశమై.. దాదాపు మూడు గంటలు చర్చించారు. అనంతరం అసమ్మతి నేతలందరీని సీఎం వద్దకు తీసుకెళ్లి నచ్చజెప్పినట్లు తీసుకొచ్చినట్లు సమాచారం. నేతలందరూ ఏకాభిప్రాయానికి వచ్చారని.. అధినేత ఎవరిని అభ్యర్థిగా ప్రకటించినా కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు జగదీశ్‌రెడ్డి స్పష్టం చేశారు.
కాంగ్రెస్ అభ్యర్థిగా చల్లమల్ల కృష్ణారెడ్డికి టికెట్ ఇవ్వొదంటూ తాను మాట్లాడిన ఆడియో వైరల్ పై పాల్వాయ్ స్రవంతి స్పందించారు. ఆడియోలో తానేమీ తప్పుగా మాట్లాడలేదని ఆమె స్పష్టం చేశారు. కృష్టారెడ్డి ఏనాడు పార్టీ జెండా మోయలేదని.. ఆయనకు టికెట్ ఇస్తే పార్టీ మునగడం ఖాయమని తేల్చిచెప్పారు. కొందరూ పనిగట్టుకొని తనపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.మూడుసార్లు టికెట్ ఇవ్వకున్నా పార్టీ మారలేదని.. అధిష్టానం అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకునే టికెట్ ఇస్తారని భావిస్తున్నట్లు స్రవంతి పేర్కొన్నారు.
అటు బీజేపీ నేతలు ఫుల్ జోష్ లో కనిపిస్తున్నారు.నియోజకవర్గంలో బండి సంజయ్ ప్రజాసంగ్రామయాత్ర కి విశేష ప్రజాదరణ లభిస్తుండటం.. త్వరలోనే కోమటిరెడ్డి రాజగోపాల్ తో పాటు ముఖ్యనేతలు పార్టీలోకి చేరుతుండటంతో కమలం పార్టీలో సరికొత్త ఉత్సాహం కనిపిస్తోంది. అంతేకాక టీఆర్ఎస్ , కాంగ్రెస్ అసంతృప్తులను తమవైపు తిప్పికునేందుకు కమలనాథులు వ్యూహాలు రచిస్తున్నారు.
మొత్తంమీద మునుగోడు ఉప ఎన్నిక ఆదిలోనే హంసపాదు మాదిరి టీఆర్ఎస్, కాంగ్రెస్ లో అసమ్మతి సెగను రాజేసింది. ప్రస్తుతానికి నేతలంతా ఏకతాటిపైకి వచ్చిన సూచనలు కనిపిస్తున్నా.. ఉప ఎన్నిక సమరంలో ట్విస్ట్ ఇస్తే పరిస్థితి ఏంటన్న చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది.