రాజ్యసభలో బీజేపీ అరుదైన రికార్డు!

పెద్దల సభ(రాజ్యసభ)లో బీజేపీ అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. చరిత్రలో తొలిసారి ఆ పార్టీ బలం 100కి చేరడంతో..1990 తర్వాత ఓ పార్టీ ఎగువసభలో వంద సీట్లు సాధించిన పార్టీగా బీజేపీ చరిత్ర సృష్టించింది. ప్రస్తుతం బీజేపీకి 97 మంది సభ్యులు ఉండగా.. ఈశాన్య రాష్ట్రాలు, హిమాచల్‌ప్రదేశ్‌లో మొత్తం నాలుగు స్థానాలను కమలదళం గెలుచుకోవడంతో ఆ పార్టీ 100 సీట్ల మైలురాయిని చేరుకుంది.
కాగా 2014లో కేంద్రంలో నరేంద్రమోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాటికి రాజ్యసభ లో బీజేపీ బలం 45 మాత్రమే. ఆతర్వాత అనేక రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో అనూహ్య విజయాలు సాధించడంతోఎగువ సభలో ఆపార్టీ బలం 100 కి చేరింది.
మరోవైపు జూలై నెలలో ప్రెసిడెంట్ ఎన్నికలు ఉండడంతో.. రాజ్యసభ చైర్మెన్ ముప్పవరపు వెంకయ్యనాయుడును రాష్ట్రపతి భవన్ కు పంపే యోచనలో కమల దళం ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ వార్తల్లో నిజానిజాలు పక్కన పెడితే.. సభ్యుల బలం ప్రకారం ఎన్డీఏ అభ్యర్థి మరోమారు రాష్ట్రపతిగా ఎన్నిక కావడం ఖాయంగా కనిపిస్తోంది.
ఇక బీజేపీ మొదటి ప్రధాని ఆటల్ విహారీ వాజపేయి హయాంలో.. 2002 రాష్ట్రపతి ఎన్నికల్లో సొంత మెజారిటీ లేక ప్రతిపక్షాల మద్దతుతో ఏపీజే అబ్దుల్ కలాంను రాష్ట్రపతిగా నియమించింది. అనంతరం 2017లో సొంత సభ్యులు బలం ఉండడంతో ఆపార్టీ అభ్యర్ధిగా రామ్ నాథ్ కోవింద్ ఆ పదవిని చేపట్టారు.

Optimized by Optimole