ఐదు రాష్ట్రాల ఎన్నికలపై బీజేపీ ఫోకస్!

వచ్చే ఏడాది జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై కమలనాథులు గురిపెట్టారు. గోవా, ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌, మణిపూర్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గెలుపే లక్ష్యంగా కమలనాథులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. అటు ప్రధాని మోదీ.. ఇటు అమిత్‌ షా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఉత్తరాఖండ్‌లో పర్యటించిన మోదీ.. అక్కడి ప్రజలపై వరాల జల్లు కురిపిస్తూనే… విపక్షాలను ఎండగట్టారు. అలాగే యూపీలో పర్యటించిన అమిత్‌ షా… సంక్షేమ మంత్రమే ఆయుధంగా ప్రచారాన్ని హోరెత్తించారు.
ఇక ఉత్తరాఖండ్‌లో పర్యటనలో ప్రధాని మోదీ అనేక అభివృద్ధి పథకాలను శంకుస్థాపన చేశారు. గత ప్రభుత్వాలు అభివృద్ధిని విస్మరించాయని ప్రధాని మోదీ ఆరోపించారు. అక్కడ పర్యటించిన ఆయన.. 17 వేల కోట్ల విలువైన 23 అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. కాంగ్రెస్ తీరు వల్లే ప్రజలు వలసలు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడిందని విమర్శించారు. తమ ప్రభుత్వం ఉత్తరాఖండ్ అభివృద్థికి కట్టుబడి ఉందన్నారు. అభివృద్ధే ఎజెండాగా సబ్‌ కా సాత్, సబ్ కా వికాస్ నినాదంతో ముందుకెళ్తున్నామని ప్రధాని మోదీ తెలిపారు.
అటు యూపీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సైతం విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వరుసగా రెండోరోజు యూపీలో ప్రచారం చేశారు. ఎస్పీ, బీఎస్పీలు కులతత్వ పార్టీలని ఆరోపించారు. ప్రధాని మోదీ, సీఎం యోగి ఆధ్వర్యంలో ఉత్తరప్రదేశ్ ఎంతో పురోగమిస్తోందని తెలిపారు. మోదీ హయాంలో సబ్ కా సాత్, సబ్ కా వికాస్ జరుగుతుందన్నారు. గత పాలకులకు యూపీలో అభివృద్ధి ధ్యాసే లేదన్న అమిత్ షా.. వచ్చే ఎన్నికల్లో బీజేపీని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
మొత్తంగా కమలదళం ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచింది. ఈనేపథ్యంలో బీజేపీ నేతలు ప్రతిపక్షాలపైనా విమర్శలు గుప్పిస్తున్నారు. ర్యాలీలు, బహిరంగ సభలతో హోరెత్తిస్తున్నారు