తెలంగాణలో బీజేపీ నేతలు దూకుడుమీదున్నారు. అధికార పార్టీ పై మాటల తూటాలు పేలుస్తునే.. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై దృష్టిసారించారు. ప్రజాగోస భరోసా కార్యక్రమం పేరిట ప్రజాసమస్యలను తెలుసుకుంటూ.. అధికార టీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగడుతున్నారు. మరోవైపు కమలం పార్టీలోకి చేరికల పర్వం కొనసాగుతోంది.ఇప్పటికే హస్తం పార్టీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి బీజేపీ కండువా కప్పుకోవడం ఖాయంగా కనిపిస్తుండగా.. అతనితో పాటు మరికొంతమంది కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతలు అదే దారిలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
బీజేపీలోకి చేరికలపై ఆపార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలోకి ఎవరూ వచ్చిన ఆహ్వానిస్తామని ఆయన స్పష్టం చేశారు.కోమటిరెడ్డి కమిట్ మెంట్ ఉన్న నాయకుడు అని.. టీఆర్ఎస్ ఓడించాలనే పట్టుదల అతనిలో కనిపిస్తుందన్నారు. టీఆర్ఎస్ కు బీజేపీ ప్రత్యామ్నాయం అని సంజయ్ తేల్చిచెప్పారు.
అటు ఎమ్మెల్యే ఈటల చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కేసీఆర్ తో ఇష్టంలేని కాపురం చేస్తున్నారని..ఈ నెల 27 తర్వాత బీజేపీలోకి భారీగా చేరికలు ఉంటాయని బాంబ్ పేల్చారు ఈటల. టీఆర్ఎస్ ను ఓడించే సత్తా బీజేపీకి మాత్రమే ఉందని.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సైతం ఇప్పటికే అనేకసార్లు చెప్పారని.. అతను పార్టీలో చేరతారని ఆశాభావం వ్యక్తం చేశారు. బీజేపీ అధిష్టానం ఆదేశిస్తే.. సీఎం కేసీఆర్ పై పోటీ చేస్తానని .. తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని ఈటల ధీమా వ్యక్తం చేశారు.
టీఆర్ఎస్ పాలన పట్ల అన్ని వర్గాల ప్రజలు విసుగు చెందారని మండిపడ్డారు ఎంపీ ధర్మపురి అరవింద్. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలో పల్లెగోస-బీజేపీ భరోసా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు . బీజేపీ పట్ల ఆదరణ పెరుగుతుండటంతో టీఆర్ఎస్ వాళ్ళు తట్టుకోలేకపోతున్నారని ఎంపీ అర్వింద్ వ్యాఖ్యానించారు .
వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే మంత్రి కేటీఆర్ ఓటీటీలో సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారని బీజేపీనేత వివేక్ వెంకటస్వామి మండిపడ్డారు. ప్రజాగోస- బీజేపీ భరోసా యాత్రలో భాగంగా ఆయన కామారెడ్డి జిల్లా వాజిద్ నగర్ లో పర్యటించారు. రాష్ట్రంలో కేసీఆర్ అవినీతి పాలన అంతం కావాలంటే కలిసి పోరాడాలని రాజగోపాల్ రెడ్డికి సూచించినట్లు తెలిపారు . బీజేపీలోకి రమ్మని ఆహ్వానించామని.. తుదినిర్ణయం ఆయనకు వదిలేశామని వెంకటస్వామి అన్నారు.
బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేయడంలో కేసీఆర్ దిట్ట అన్నారు ఎమ్మెల్యే రాజాసింగ్ . నిజామాబాద్ జిల్లాలోని కొనసాగుతున్న ‘ప్రజాగోస బీజేపీ భరోసా యాత్ర’లో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో అవినీతి అక్రమాలకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేరాఫ్ అడ్రస్ గా మారారన్నారు. ప్రజలు టీఆర్ఎస్ ను పొగిడే స్థాయి నుంచి తిట్టే స్థాయికి వచ్చారని రాజాసింగ్ మండిపడ్డారు.
వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్ కు ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమన్నారు జిట్టా బాలక్రిష్ణారెడ్డి. భువనగిరి నుంచే సీఎం కేసీఆర్ పతనం మొదలవుతుందన్నారు. ప్రశ్నిస్తున్న ఉద్యమకారులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. ఎనిమిదేండ్ల పాలనలో కేసీఆర్ ఇప్పటివరకు ఒక్క హామీని కూడా నెరవేర్చలేదన్నారు. రాష్ట్రానికి ఏమీ చేయనోడు… దేశానికి ఏం చేస్తాడని జిట్టా ఎద్దేవా చేశారు.