మంత్రి ‘కంటోన్మెంట్’ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఫైర్!

రక్షణ శాఖ ఆధీనంలో ఉండే కంటోన్మెంట్​ బోర్డుపై అసెంబ్లీ వేదికగా మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఫైర్ అయ్యారు. విద్యుత్ వాటర్ సప్లై నిలిపివేస్తామనడానికి.. ఆ ప్రాంతం కల్వకుంట్ల జాగీరా అంటూ ఆగ్రహాం వ్యక్తం చేశారు. పాతబస్తీలో విద్యుత్‌ బిల్లులు వసూలు చేయడం చేతగాక.. కంటోన్మెంట్​లో కరెంట్ కట్ చేస్తామనడం దేశద్రోహ చర్యగా బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.

అటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కేటీఆర్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కంటోన్మెంట్‌కు కరెంట్‌, నీళ్లు నిలిపివేస్తామనటం సిగ్గుచేటన్నారు. కంటోన్మెంట్​లో సైనికులతోపాటు తెలంగాణ ప్రజలు ఉంటారని గుర్తు చేశారు. ఆ ప్రాంతంలోని విలువైన భూముల ఆక్రమణకు సీఎం కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారని సంజయ్ ఆరోపించారు.
ఇటు రక్షణ శాఖ ప్రాంతంలో నీళ్ళు,విద్యుత్ నిలిపివేయడానికి.. ఆ ప్రాంతం కల్వకుంట్ల జాగీరా అంటూ ప్రశ్నించారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. ఈ విషయంలో మంత్రి కేటీఆర్… రక్షణ శాఖ అధికారులను హెచ్చరించడం సిగ్గు చేటన్నారు. కాశ్మీర్.. భారతదేశంలో భాగం కాదని ఎమ్మెల్సీ కవితా అనడం ఉద్దేశ్యం ఏంటో తెలపాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా.. దేశ సరిహద్దుల్లో పోరాడుతున్న సైనికులకు మద్దతుగా నిలవడం మరిచి.. వారిపై అవాకులు చెవాకులు పేలడం ఆపార్టీ నేతల అహంకారానికి నిదర్శనమన్నారు డీకే అరుణ.