తెలంగాణలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఇటు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామయాత్ర లో బీజేపీ ,టీఆర్ఎస్ నేతల మధ్య తీవ్ర ఘర్షణ చెలరేగగా.. అటు మంత్రి జగదీష్ రెడ్డికి..దమ్ముంటే తాను అక్రమాలకు పాల్పడినట్లు నిరూపించాలని మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సవాల్ విసరడం సంచలనంగా మారింది. టీఆర్ఎస్ నేతలు గుండాల వ్యవహరిస్తున్నారని.. ప్రజాస్వామ్యబద్ధంగా నడుచుకోవాల్సిన పోలీసులు అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారంటూ బీజేపీ నేతలు ఆరోపించడం చర్చనీయాంశమైంది.
కాగా మంత్రి జగదీష్ రెడ్డి కి సవాల్ విసిరారు రాజగోపాల్ రెడ్డి. తాను అక్రమాలకు పాల్పడినట్లు నిరూపిస్తే రాజకీయం సన్యాసం తీసుకుంటానని..నిరూపించని పక్షంలో జగదీష్ రెడ్డి మంత్రి పదవికి రాజీనామా చేయాలని చాలెంజ్ చేశారు.త్వరలోనే మంత్రి అవినీతి చిట్టా బయటపెడతానని రాజగోపాల్ బాంబ్ పేల్చారు.
తాను రాజీనామా చేసిన తర్వాతే నియోజక వర్గంలోని పనులను ఆగమేఘాల మీద పూర్తిచేస్తున్నారని గుర్తు చేశారు. మునుగోడు ప్రజలు ఇచ్చే తీర్పుతో రాష్ట్ర రాజకీయ రూపు రేఖలు మారబోతున్నాయని రాజగోపాల్ జోస్యం చెప్పారు.
ఇక ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా బండి సంజయ్ ప్రసంగాన్ని టీఆర్ఎస్ నేతలు అడ్డుకోవడం ఘర్షణకు దారితీసింది. ఈఘటనలో బీజేపీ కార్యకర్తలకు గాయాలవడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. దీంతో ఆగ్రహాంతో ఊగిపోయిన సంజయ్ ..బీజేపీ కార్యకర్తల తలల పగలకొడుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు.లా అండ్ ఆర్డర్ చేతకాని సీపీ ఇంట్లో కూర్చోవడం బెటర్ అంటూ మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వం ఉండేది ఆరు నెలలు మాత్రమేనని..ఆవిషయం గుర్తుంచుకుని పాదయాత్ర ప్రశాంతంగా సాగేలా చూడాలని సంజయ్ డిమాండ్ చేశారు.
అటు ఎమ్మెల్యే ఈటల రాజేందర్ బీజేపీ కార్యకర్తలపై దాడిని ఖండించారు. టీఆర్ఎస్ కార్యకర్తలు గూండాల్లా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలను చూసి ఓర్వలేకే టీఆర్ఎస్ నాయకులు బీజేపీ నాయకులపై దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రతిపక్ష నాయకులపై దాడి చేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. చట్టపరంగా వ్యవహరించాల్సిన పోలీసులు టీఆర్ఎస్ ప్రభుత్వానికి కొమ్ముకాస్తున్నారని ఫైర్ అయ్యారు. ఇప్పటికైనా పోలీసులు తమ వైఖరి మార్చుకోవాలని సూచించారు.
మొత్తంమీద మునుగోడు ఉపఎన్నిక నోటిఫికేషన్ రాకముందే రాజకీయ చిచ్చు రాజుకుంది.బీజేపీ ,టీఆర్ఎస్ నేతలు ఢీ అంటే ఢీ తరహాలో మాటల దాడులతో రాజకీయ డ్రామాను రక్తికట్టిస్తున్నారు.