ఎంపీ అరవింద్ పై దాడి కేంద్రం సీరియస్.. బీజేపీ నేతలు ఫైర్!

బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ పై దాడిని కేంద్రం సీరియస్ గా పరిగణిస్తోంది. కే్ంద్ర హోమంత్రి అమిత్ షా దాడిని ఖండించారు. నేరుగా అరవింద్ కి ఫోన్ చేసి ఘటన వివరాలను ఎంపీని అడిగి తెలుసుకున్నారు. అటు రాష్ట్ర బీజేపీ నేతలు దాడిని ఖండించారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై ప్రశ్నిస్తే భౌతిక దాడులు చేయడం సిగ్గు చేటన్నారు బండిసంజయ్. బీజేపీకి వస్తున్న ఆదరణ తట్టుకోలేక దాడులకు దిగుతున్నారని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

జగిత్యాల జిల్లా ఎర్దండిలో బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ దాడిపై కేంద్ర హోమంత్రి ఆరాతీశారు. ఈసందర్భంగా దాడి వివరాలను ఎంపీ.. అమిత్ షాకు ఫోన్లో వివరించారు. అధికార టీఆర్ఎస్ నేతలు ప్లాన్ ప్రకారమే దాడిచేశారని.. కార్యకర్తలపైనా దాడులు జరుగుతున్నాయని అరవింద్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాసమస్యలపై ప్రశ్నిస్తే దాడులు చేయడం టీఆర్ఎస్ నేతలకు పరిపాటిగా మారిందని ఆయన మండిపడ్డారు.

అరవింద్ దాడి ఘటనను రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఖండించారు. సీఎం కేసీఆర్ నియంత వైఖరిపై ప్రశ్నిస్తే భౌతిక దాడులకు దిగడం సిగ్గుచేటని మండిపడ్డారు.టీఆర్ఎస్ నేతల బెదిరింపులకు, దాడులకు భయపడే ప్రసక్తే లేదని ఆయన తేల్చిచెప్పారు. ఎడతెరపి లేని వర్షాలకు ప్రజలు అల్లాడుతుంటే.. సీఎం కేసీఆర్ కు చీమకుట్టినట్లు కూడ లేదని ఆగ్రహం  వ్యక్తం చేశారు. కేసీఆర్ కు తగిన గుణపాఠం చెప్పేందుకు ప్రజల ఎదురుచూస్తున్నారని సంజయ్ పేర్కొన్నారు.

అటు ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సైతం దాడిని ఖండించారు.రాష్ట్రంలో బీజేపీకి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకే..టీఆర్ఎస్ నేతలు భౌతిక దాడులు చేస్తున్నారని ఆగ్రహాం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ నేతల అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారని .. రానున్నందని బీజేపీ ప్రభుత్వమేనన్నారు. ఎవరెన్ని దాడులు చేసినా..భయపడే ప్రసక్తే లేదని ఈటల స్పష్టం చేశారు.