స్టాండప్‌ కమిడియన్‌ కు బీజేపీ నేతల హెచ్చరిక!

వివాదాస్పద స్టాండప్‌ కమిడియన్‌ మునావర్‌ ఫరూఖీ తెలంగాణ టూర్‌ పై హిందూసంఘాలు భగ్గుమంటున్నాయి. కామెడీ షోలలో హిందూ దేవతలను అవమానించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని.. రాష్ట్రంలో ఎలా షో నిర్వహించుకోనిస్తున్నారని.. తెలంగాణ సర్కార్‌పై ఫైర్‌ అవుతున్నాయి. అతనిపై.. ఇప్పటికే 16 రాష్ట్రాలు నిషేదం విధించాయన్న విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఎట్టిపరిస్థితిలోనూ హైదరాబాద్‌లో అడుగుపెట్టనివ్వబోమని హెచ్చిరిస్తున్నాయి.

ఇక హైదరాబాద్‌లో జనవరి 9న షో నిర్వహిస్తున్నానని వారం క్రితం మునావర్‌ ఫరుఖీ ప్రకటించారు. దీన్ని స్వాగతించిన మంత్రి కేటీఆర్‌.. మునావర్‌తో పాటు మరో కమెడియన్‌ కునాల్‌ కమ్రాను హైదరాబాద్‌కు ఆహ్వానించారు. ఇప్పుడు ఇదే వివాదానికి దారితీస్తోంది. మునావర్‌పై ముందునుంచి తీవ్ర ఆగ్రహంగా ఉన్న హిందూ సంఘాలు, బీజేపీ నేతలు.. కేటీఆర్‌ ఆహ్వానించడాన్ని తప్పుబడుతున్నారు. మునావర్‌ను ఆహ్వానించడం ద్వారా హిందువులుకు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారని ఎమ్మెల్యే రాజాసింగ్‌ ప్రశ్నించగా.. హిందూ సమాజం కామెడీగా కనిసిస్తుందా అంటూ ఎంపీ ధర్మపురి అరవింద్‌ ఘాటుగా రియాక్ట్‌ అయ్యారు. రాముడిని, రామాయణాన్ని అవమానించిన మునావర్‌ను..
హైదరాబాద్‌లో అడుగుపెట్టనివ్వబోమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ హెచ్చరించారు.

కాగా గత జనవరిలో మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో.. హిందూ దేవుళ్లను అవమానిస్తూ మాట్లాడారని.. బీజేపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదుతో అతన్ని అరెస్ట్‌ చేశారు. ఈ కేసులో 37 రోజులు జైల్లో ఉన్న మునావర్‌.. సుప్రీంకోర్టు బెయిల్‌ ఇవ్వడంతో బయటకొచ్చారు. అప్పటి నుంచి హిందూ సంఘాలు, బీజేపీ నేతలు.. మునావర్‌ షోలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొద్ది నెలల క్రితం.. బెంగళూర్‌, గుర్‌గావ్‌, రాయ్‌పూర్‌, సూరత్‌, అహ్మదాబాద్‌, వడోదర, గోవా, ముంబైలలో మునావర్‌ ఫరుఖీ షోలు రద్దయ్యాయి. హిందూ సంఘాల హెచ్చరికలతో నవంబర్‌ 28న బెంగళూర్‌లో జరగాల్సిన షో కూడా రద్దయ్యింది. మునావర్‌ చుట్టూ ఇంత వివాదం జరుగుతున్న నేపథ్యంలోనే.. మంత్రి కేటీఆర్‌, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌.. హైదరాబాద్‌, భోపాల్‌లలో షోలు చేసుకోవాడానికి ఆహ్వానించారు. ఇప్పుడిదే హిందూ సంఘాల ఆగ్రహానికి కారణమవుతోంది. మరీ హైదరాబాద్‌లో షో జరుగుతుందో లేక మిగితా నగరాలలో మాదిరిగానే రద్దవుతుందో చూడాలి.