బీజేపీ ఎమ్మేల్యే ఈటల రాజేందర్ చేసిన హాట్ కామెంట్స్ అధికార టీఆర్ఎస్ లో అలజడి రేపుతోంది.నల్లగొండ, ఖమ్మం జిల్లాల గడ్డపై కాషాయ జెండా ఎగరబోతుందని ఈటల ధీమాగా కామెంట్స్ చేశారు.ఇటీవల రెండు జిల్లాలోని అధికార పార్టీ, కాంగ్రెస్ నేతలు కారు దిగనున్నారని ప్రచారం జరిగింది. ఇప్పుడు ఈటల చేసిన వ్యాఖ్యలతో.. ప్రచారానికి ఆజ్యం పోసినట్లయింది. అంతేకాక సీఎం కేసిఆర్ తో కలిసి 20 ఏళ్లు అడుగులో అడుగు వేసిన వాడినని.. ఆయన బలం బలహీనత తెలిసిన వాడినని ఈటల బాంబ్ పేల్చారు.అటు జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళాలని కేసిఆర్ సన్నాహాలు చేస్తున్న తరుణంలో ఈటల చేసిన కామెంట్స్ రాజకీయంగా చర్చనీయాంశమైంది.
కాగా ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఈటల. రాజగోపాల్ యాదృచ్ఛికంగా రాజీనామా చేయలేదని.. ఇద్దరిలో ఎవరు ఎప్పుడూ రాజీనామా చేయాలన్న అంశాన్ని కొన్ని సంవత్సరాలుగా చర్చించుకున్నట్లు రహస్యాన్ని బయటపెట్టాడు. తాను రాజీనామా చేసినప్పుడు.. రాజగోపాల్ మోరల్ వాల్యూస్ కు కట్టుబడి తెర వెనక నుండి గెలుపునకు ప్రయత్నం చేశాడని.. ఇప్పుడు రాజగోపాల్ గెలుపు కోసం ప్రత్యక్షంగా నాయకత్వం వహించే బాధ్యత దక్కినందుకు గర్వంగా ఉందని ఈటల స్పష్టం చేశారు.
రాజగోపాల్ కు మాటిచ్చా..
ఇక తాను అనుభవించిన వేదన ..కార్చిన కన్నీరు రాజగోపాల్ కు రానివ్వని మాట ఇచ్చానని ఈటల వెల్లడించారు. మునుగోడు ఉప ఎన్నిక..కేసిఆర్ అహంకారాన్ని తుదముట్టించే ఎన్నిక కాబోతుందని ఆగ్రహాంతో ఊగిపోయారు. హుజూరాబాద్ లో కేసిఆర్ విద్యలు పనిచేయలేదని.. ఇప్పుడు ప్రదర్శించాడనికీ ఏమీ మిగిలలేదని ఎద్దేవాచేశారు. నల్లగొండ ఖమ్మం జిల్లాలో కాషాయం జెండా.. టీఆర్ఎస్,కాంగ్రెస్ పార్టీల పునాదులను కబలిస్తుందని ఈటల ధీమా వ్యక్తంచేశారు.
కేసిఆర్ బలం..బలహీనత తెలుసు..
కేసిఆర్ తో కలిసి 20 ఏళ్లు అడుగులో అడుగు వేసిన వాడినని..ఆయన బలం..బలహీనత తెలుసంటూ ఈటల ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.ఉప ఎన్నికలో సందర్భానుసారం వ్యూహాలు అమలు చేస్తామని తేల్చిచెప్పారు. మునుగోడు ప్రజలు మద్యం సీసాలకు డబ్బులకు కకావికులం అవుతారని కేసీఆర్ భావిస్తున్నాడని.. కానీ కకావికలం అయ్యేది టిఆర్ఎస్ పార్టీ అంటూ ఘాటూ కామెంట్స్ చేశారు.
జాతీయ రాజకీయాల్లోకి వెళ్లకుండా అడ్డుకునే ప్లాన్..?
ఓ వైపు సీఎం కేసిఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో అతనిని అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా బీజేపీ వ్యూహాలు అమలు చేస్తోందన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కేసిఆర్ కూతురు కవిత పై లిక్కర్ స్కాం ఆరోపణలు రావడం.. మరోవైపు పార్టీ నుంచి వలసలు ఉన్నాయన్న ప్రచారంతో కేసిఆర్ ఉక్కిరబిక్కిరి అవుతున్నారు. ఈ అంశాలను ఆసరాగా చేసుకొని కేసిఆర్ ను.. ఇరుకున పెట్టాలని కమలం పార్టీ ఆలోచనగా తెలుస్తోంది.ఇప్పుడు ఈటల చేసిన కామెంట్స్ కూడా పార్టీ ప్లాన్ లో భాగమేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మొత్తమీద బీజేపీ మైండ్ గేమ్ కి సీఎం కేసిఆర్ క్లీన్ బౌల్డ్ అయినట్లు కనిపిస్తోంది. ఇప్పటికే దుబ్బాక, హుజూరాబాద్, జిహెచ్ఎంసిలో కారు పార్టీని టక్కర్ చేసిన కాషాయం నేతలు.. మునుగోడు ఉప ఎన్నికలో చావు దెబ్బ కొట్టేందుకు వ్యూహాలను తమదైన రీతిలో అమలుచేస్తున్నారు.