కరీంనగర్: హుజురాబాద్ రాజకీయం వేదికగా బీజేపీ ఎంపీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఇటీవల బండి సంజయ్ చేసిన పరోక్ష వ్యాఖ్యలకు ఈటల ఘాటుగా బదులిచ్చారు. “నువ్వేవడివి అసలు? నా చరిత్ర నీకు తక్కువ తెలుసు. నేను ఎప్పుడూ స్ట్రెయిట్ ఫైట్ చేస్తాను. నీలాగా కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకోవడం నాకు రాదు. శత్రువుతో కూడ నేరుగా ఎదురెదురు పోరాడతాను. నీలాంటి వారితో పోరాడితే నా పతారేంటి?” అంటూ ఈటల తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
ఇక బండి సంజయ్ వ్యాఖ్యల నేపథ్యంలో శనివారం ఈటల నివాసానికి ఆయన వర్గీయులు బీజేపీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. “నీ శక్తి ఏంటి? నీ స్థాయి ఏంటి? నీ చరిత్ర ఏంటి? మా చరిత్ర ఏంటి? 2002 నుంచి రాజకీయాల్లో ఉన్న నేను, రెండు సార్లు కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా, రెండు సార్లు మంత్రిగా పని చేశాను. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నా అడుగు పడని గ్రామం లేదు” అని ఆయన స్పష్టం చేశారు.
ఈటల మాటల్లోని కీలక అంశం…”హుజురాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేకు ఎన్ని ఓట్లు వచ్చాయో, ఎంపీకి కూడా అన్ని ఓట్లు వేయించాను. 2019లో నువ్వు ఎంపీగా గెలిచినా, హుజురాబాద్‌లో మాత్రం అప్పటి టీఆర్ఎస్ పార్టీకి 53 వేల మెజారిటీ వచ్చింది. ఆ మద్ధతును బీజేపీకి తిప్పించి, తిరుగులేని ఆధిక్యాన్ని నేనే కల్పించాను” అంటూ గుర్తు చేశారు.అంతేకాకుండా, బండి సంజయ్ చేసిన “ఓ వర్గానికి టికెట్లు ఇవ్వను” అన్న పరోక్ష వ్యాఖ్యలపై స్పందిస్తూ..”రేపు నా వర్గమే ఎన్నికల్లో సర్పంచ్‌లు, వార్డ్ మెంబర్లు అవుతారు” అంటూ తేల్చిచెప్పారు.
మొత్తంగా ఈటల – బండి సంజయ్ మాటల యుద్ధంతో బీజేపీలోని అంతర్గత విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. వీరిద్దరి వర్గపోరుపై కమలం పార్టీ అధిష్టానం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి…!