హుజూరాబాద్ ఎన్నికల ప్రచారం మరో కొన్ని గంటల్లో ముగియనుండగా ప్రధాన పార్టీలన్నీ ఓటర్లని ఆకర్షించే పనిలో చివరి ఘట్టానికి చేరుకున్నాయి. అందులో భాగంగా బిజేపి మ్యానిఫెస్టో విడుదల చేసింది.
కాగా సబ్ కా సాథ్, సబ్ కా వికాస్… సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్… అనే ప్రధాని మోడీ నినాదం స్ఫూర్తితో హుజూరాబాద్‌లో అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికీ, అభివృద్ధికీ కృషి చేస్తామని రాష్ట్ర బిజెపి మ్యానిఫెస్టోను విడుదల చేసింది. ఇందులో పొందు పరిచిన హామీలను పరిశీలిస్తే, హుజూరాబాద్ నియోజక వర్గంలో రైల్వే స్టేషన్ల అభివృద్ధి, ఓవర్ అండర్ బ్రిడ్జిల నిర్మాణం, జమ్మి కుంట రైల్వే స్టేషన్ అభివృద్ధికి ముందు ప్రాథాన్యత ఇచ్చినట్లు కనిపిస్తోంది.
ఇక నియోజకవర్గంలో వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్, కనీస ధరలు ఇప్పించడం, 60 ఏళ్లు పైబడిన చిన్న,సన్నకారు రైతులకు ప్రధాన మంత్రి కిసాన్ మన్ ధన్ యోజన వర్తింపు… నిరుద్యోగుల కోసం ప్రధాన మంత్రి ఉపాథి కల్పన పథకం, కౌశల్ యోజన, ముద్ర రుణాలు…. అలాగే, విద్యారంగ అభివృద్ధిలో భాగంగా, దేశవిదేశాల్లో ఉన్నత విద్య కోసం విద్యాలక్ష్మి పథకం తీసుకురావడం… స్త్రీలకు బేటీ బచావో… బేటీ పడావో…, ఆయుష్మాన్ భారత్, పీఎం ఉద్యోగినీ యోజన, గ్రామ్ సడక్ యోజన, క్రిషి సించాయి యోజన వంటి పలు కేంద్ర పథకాలను వర్తింపజేయడం వంటి హామీలను ఇచ్చారు. అలాగే, హుజూరాబాద్ నియోజకవర్గంలో శ్యామ ప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్ అమలు చేయడం, గ్రామ మండలాల అభివృద్ధికి ఆర్థిక సంఘం ఏర్పాటు వంటి కార్యక్రామాలను చేపడతామని హామీల్లో పేర్కొన్నారు.