నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్ర పై కమలం ఫోకస్..

తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్ర పై రాష్ట్ర నాయకత్వం దృష్టి సారించింది. ఇప్పటికే మూడు విడతల యాత్రలు విజయవంతం కావడంతో.. నాలుగో విడత యాత్రకు భారీ ఎత్తులో ప్లాన్ సిద్ధం చేసేందుకు కమలం నేతలు సమయతమవుతున్నారు. పాద‌యాత్ర ఎక్క‌డ ప్రారంభించాలి? ఎక్క‌డ ముగించాలి అనే అంశాల‌పై సెప్టెంబ‌ర్ 2,3 తేదీల్లో  జిహెచ్ఎంసి, ఉమ్మ‌డి రంగారెడ్డి  ప‌రిధిలోని నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లతో స‌మావేశం నిర్వ‌హించి తుదినిర్ణ‌యం తీసుకోనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

మ‌ల్కాజ్ గిరి పార్ల‌మెంటు నియోజ‌క వ‌ర్గంలో నాలుగోవిడ‌త పాద‌యాత్ర …

సెప్టెంబ‌ర్ 12వ తేదీ నుంచి ప్రారంభించ‌నున్న నాలుగోవిడ‌త పాద‌యాత్ర మ‌ల్కాజ్‌గిరి పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గంలో నిర్వ‌హించాల‌నే యోచ‌న‌లో తెలంగాణా బిజెపి నాయకత్వం ఉన్నట్లు తెలిసింది. ఇక్కడ నిర్వ‌హించ‌డానికి ప్ర‌ధాన ఉద్దేశ్యం .. నేతలంతా హైద‌రాబాద్ న‌గ‌రంలోనే  ఉంటూనే.. ప్ర‌తిష్టాత్మ‌క‌మైన మునుగోడు ఉప ఎన్న‌కను  ప‌ర్య‌వేక్షించ‌డానికి వీలుటుందని కమలం నేతలు భావిస్తున్నారు. అంతేకాక గ్రేటర్ లో మరింత పట్టు సాధించేందుకు అవకాశం ఉంటుందని ఆలోచనగా కనిపిస్తోంది.

కాగా నాలుగో విడ‌త పాద‌యాత్ర‌ను కుత్బుల్లాపూర్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలోని గాజుల‌రామారం లో వున్న చిత్తార‌మ్మ అమ్మ‌వారి ఆల‌యం లేదా సూరారంలోని క‌ట్ట‌మైస‌మ్మ అమ్మ‌వారి గుడి వ‌ద్ద ప్రారంభిస్తే బాగుంటుంద‌ని ఇప్ప‌టికే నాయ‌కులు అధిష్టానానికి సూచించినట్లు సమాచారం. పాదయాత్రను అబ్దుల్లాపూర్ మెట్ ఓఆర్ ఆర్ వ‌ద్ద ముగించాలని నేతలు ఆలోచనగా తెలుస్తోంది. దీని  వలన పాదయాత్ర  ప్ర‌భావం మునుగోడు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం పై ఉండేలా కాషాయం నేతలు వ్యూహాలను రచిస్తున్నట్లు పార్టీ నేతల ద్వారా తెలిసింది.

నాలుగోవిడ‌త పాద‌యాత్ర పూర్తిగా మెజారిటిగా ప‌ట్ట‌ణ ప్రాంతంలో మ‌ల్కాజ్‌గిరి పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గంలో జరుగుతుందని కమలం నేతలు చెబుతున్నారు. కుత్బుల్లాపూర్, కూక‌ట్‌ప‌ల్లి, మేడ్చెల్‌, సికింద్రాబాద్ కంటోన్మెంట్‌, మ‌ల్కాజ్ గిరి, ఉప్ప‌ల్, ఎల్‌బి న‌గ‌ర్‌, ఇబ్ర‌హీంప‌ట్నం నియోజ‌క‌వ‌ర్గాల్లో యాత్ర కొన‌సాగేలా రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నారు. ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలో రోజున్న‌ర పాటు యాత్ర కొన‌సాగించాల‌ని,l.. ప్ర‌తీ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో ఒక భారీ ఎత్తున స‌భ‌ను నిర్వ‌హించాల‌ని కమలం నేతలు భావిస్తున్నారు.  ప్ర‌తీ రోజు 12 నుండి 16 కిలోమీట‌ర్లు యాత్ర కొన‌సాగించాల‌ని ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది.

 

మ‌ల్కాజ్‌గిరి పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గంలో  నాలుగో విడ‌త పాద‌యాత్ర నిర్వ‌హించ‌డంలో దాగివున్న మరో వ్యూహం.. జిహెచ్ఎంసి ప‌రిధిలో బిజెపి పార్టీ పటిష్టం చేయడం..  టిపిసిసి అధ్య‌క్షులు  రేవంత్‌రెడ్డి సొంత నియోజ‌క‌వ‌ర్గంలో పాగా వేసి.. కాంగ్రెస్‌పార్టీని పూర్తిగా నామ‌రూపాలు లేకుండా చేయాల‌ని కమలం నేతల ఉద్దేశంగా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే పాద‌యాత్ర‌లో  గోరేటి వెంక‌న్న “పాట గ‌ల్లీ చిన్న‌ది … గ‌రీబోళ్ల క‌థ పెద్ద‌ది … “పాట‌ని విస్తృతంగా వాడుకోవాల‌నే  యోచ‌న‌లో బిజెపి నాయకత్వం ఉన్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు.

మొత్తం మీద నాలుగో విడత పాదయాత్ర తో ఒక దెబ్బకు రెండు పిట్టలు మాదిరి.. ఇటు గ్రేటర్.. అటు మునుగోడు ఉప ఎన్నికలో లబ్ది పొందాలని కాషాయం నేతలు భావిస్తున్నారు.