ప్రజామోదం పొందిన ప్రగతిశీల బడ్జెట్_ మోదీ

2022 23 ఆర్థిక సంవత్సరానికి గానూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం కేంద్ర బడ్జెట్‌ ను ప్రవేశపెట్టారు. ఉపాధి, గృహనిర్మాణం, విద్య తదితర అంశాలకు సంబంధించి పలు భారీ ప్రకటనలు చేశారు ఆర్థికమంత్రి. దేశ సమగ్ర అభివృద్ధికి బడ్జెట్ లోని అంశాలు ఉపకరిస్తాయని పలువురు నేతలు హర్షం వ్యక్తం చేశారు. కరోనాతో కుదేలైన ఆర్ధిక వ్యవస్థను పట్టాలెక్కించడానికి ఈ బడ్జెట్ ఎంతగానో తోడ్పడుతుందని కొనియాడారు.

పేదల సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా బడ్జెట్ రూపకల్పన జరిగిందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ బడ్జెట్​తో మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, ఉద్యోగ కల్పనకు అధిక అవకాశాలున్నాయన్నారు. ప్రజామోదం పొందిన ప్రగతిశీల బడ్జెట్ గా ఆయన అభివర్ణించారు. కొవిడ్​తో కుదేలైన ఆర్థికవ్యవస్థకు ఊతమిచ్చే విధంగా బడ్జెట్ వుందన్నారు. బడ్జెట్‌ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​కు అభినందనలు తెలిపారు మోదీ.

అటు బడ్జెట్‌పై ప్రశంసలు కురిపించారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. ఈ బడ్జెట్ దేశ ఆర్థిక వ్యవస్థ స్థాయిని మారుస్తుందన్నారు. దీనిని “దార్శనిక బడ్జెట్ గా షా అభివర్ణించారు. బడ్జెట్ పరిమాణాన్ని రూ.39.45 లక్షల కోట్లకు పెంచడం వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థను సూచిస్తోందని అమిత్ షా స్పష్టం చేశారు.
కాగా ఉత్పాదక, వ్యవసాయ రంగాలను బలోపేతం చేయడం ద్వారా దేశ ప్రగతిని ముందుకు తీసుకువెళ్లే విధంగా కేంద్ర బడ్జెట్​ను ప్రభుత్వం రూపకల్పన చేయడం ఆశావహ పరిణామమన్నారు జనసేన అదినేత పవన్ కళ్యాణ్. సేంద్రీయ ప్రకృతి సేద్యానికి ప్రాధ్యానం ఇవ్వడం శుభపరిణామం అని పేర్కొన్నారు.

కేంద్ర ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను స్వాగతిస్తున్నామన్నారు కామినేని హాస్పిటల్స్ సీవోవో డాక్టర్ గాయత్రి కామినేని . దేశంలోని ప్రజలు నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ అందించడానికి కేంద్రం సంసిద్ధంగా ఉందన్నారు. డిజిటల్ హెల్త్ ఎకోసిస్టమ్, మెంటల్ హెల్త్ అండ్​ వెల్​బీయింగ్​తో సహా ఆరోగ్యం వంటి అన్ని రంగాలపై ఆర్థికమంత్రి దృష్టి సారించడం హర్షణీయమన్నారు.

Optimized by Optimole