literature: రచయితలై బతికి బట్టకడదామనేనా?

విశీ( సాయి వంశీ): 

(Note) : ఇది సరదాగా రాసిన పోస్టు. ఇది ఎవర్నీ ఉద్దేశించింది కాదు. చదివి సరదాగా నవ్వుకోండి…. అని నేనంటే అచ్చంగా నమ్మేరు! అలా ఏమీ లేదు. ఇది సీరియస్‌గా రాసిందే. నాతోసహా కొంతమంది స్వీయ అనుభవాలు విని రాసింది.

మనకు ‘రచయిత’ అని పేరు రావడమూ, మన ఇంటిని పోలీస్‌స్టేషన్‌కు అద్దెకివ్వడమూ ఒక్కలాంటివే! వేళాపాళా లేని అనేక విషయాలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. అనేక ఊహాగానాలు మన మీద చెలరేగుతూ ఉంటాయి. అన్నీ భరించాల్సిందే, అన్నీ మోయాల్సిందే! అందులో మచ్చుకు కొన్ని ఇవి.

* తెలుగు రచయితలం అయ్యామా అని చచ్చామే! ‘Good Morning’ అనొద్దు, ‘శుభోదయం’ అనాలి‌. ‘Ok’ అనకూడదు, ‘సరే’ అనాలి. మనం రచయిత అనగానే కొందరు ఇవి ఎక్స్‌పెక్ట్ చేస్తారు. నోరు జారి మన నోటి నుంచి ఇంగ్లిష్ వస్తే అంతే, మనల్ని భాషా విద్వేషకుల కింద జమకడతారు.

* ‘అంబాజీపేటలో ఆరేళ్ల బాలుడు తిండి లేక చనిపోయాడు. మీరు స్పందించరేంటి?’, ‘ఆముదాలవలసలో ఐదంతస్తుల మేడ గాలివానకు కూలింది. మీరేమైనా దాని గురించి రాశారా!?’.. ఇలా అడుగుతారు కొందరు. ప్రపంచంలో జరిగే ప్రతి విషయానికి రచయితలు స్పందిస్తారనీ, స్పందించాలనీ ఓ వెర్రి ఆలోచన కొందరికి.

* ‘1965 మార్చి 22న జ్యోతిలో ఒక కథ వచ్చింది. అది మీ దగ్గర ఉందా?’, ‘2001 ఇండియాటుడే ఆగస్టు సంచికలో ఒక వ్యాసం ఉంది. అది మీ దగ్గరేమైనా దొరుకుతుందా?’.. ఇవీ కొందరి ప్రశ్నలు. మనల్ని రచయితలు అనుకుంటారో, లైబ్రేరియన్లని భావిస్తారో అర్థం కాదు. వాళ్లకు సమాధానం చెప్తే ఒక తంటా, చెప్పకపోతే మరో తంటా!

* ‘మా కథ ఎప్పుడు రాస్తారు?’, ‘మా కథ ఎప్పుడు రాబోతున్నారు’.. వీళ్లు సరదాగా అడుగుతారో, సీరియస్‌గా అడుగుతారో అర్థమై చావదు. ఏదో ఒకసారి వాళ్ల కష్టాలు, కన్నీళ్లు మనకు చెప్పి ఉంటారు. దాన్ని కథగా రాయమని అడిగి ఉంటారు. మనం అవునో కాదో అన్నట్టు తల ఊపి ఉంటాం! అప్పట్నుంచి మనల్ని పట్టుకుంటారు ఈ నక్షత్రకుడి బ్యాచ్! ఇంతా చేసి రాసినా వాళ్లకు తృప్తీ ఉండదు. చదివే తీరికా ఉండదు.

* ‘మా బాబాయ్ ఫలానా రచయిత. మీకు తెలియదా!?’, ‘అప్పట్లో స్వాతిలో మా నాయనమ్మ సీరియల్స్ వేశారు. మీరు చదవలేదా?’.. ఇవీ కొందరి ప్రశ్నలు. మనం టెలీఫోన్ డైరెక్టరీలు మెయిన్‌టెయిన్ చేస్తే తప్ప ఆ వివరాలు గుర్తు ఉండవు. వాళ్ల గురించి మనకు ఎలా తెలుస్తుంది? ఆ కనీస అవగాహన లేకుండా హడావిడిగా అడుగుతూ ఉంటారు. తెలియదంటే చచ్చామే, ఇంక వాళ్ల ఆటోబయోగ్రఫీ మొదలుపెడతారు.

* ‘మీ కథలు చదివాను. బాగున్నాయి’ అంటారు. మనం థ్యాంక్యూ అంటాం. ‘నేనూ కథలు రాశాను’ అంటారు. మనం అవునా అంటాం. ‘మీ వాట్సప్ నెంబర్ ఇవ్వండి పంపిస్తా’ అంటారు. ఖర్మ కాలి ఇస్తే ఇంక‌ సావే! వాళ్ల ఇంటి పచారీ సామాన్ల లిస్టు సహా వాళ్లు రాసిన గ్రంథాలన్నీ బాణాల్లా మన మీద ఒదులుతారు.

* రాత్రి అంతా బాగానే ఉంటుంది. తెల్లారి లేచి చూస్తే కాళ్ల కింద అడుగు మందం నీళ్లుంటే ఎలా ఉంటుంది? అలా కొందరు రాత్రికి రాత్రి సాహిత్య సేవ కోసం వాట్సాప్ గ్రూప్స్ తయారు చేసి, మనల్ని అందులోకి తోలతారు. చేరితే ఇంక దండయాత్ర మొదలు. మన పర్మిషన్ ఉంటే తప్ప మనల్ని గ్రూప్‌లో చేర్చలేని ఆప్షన్ ఒకటి వాట్సప్‌లో వచ్చింది. ఆహా! బతికామ్రా సామీ!

* కొందరి ఇళ్ళల్లో మురుకులు, కారప్పూస, బూందీ చేస్తే ఇరుగుపొరుగు వారికి పంచినట్టు, కొందరు తమ పుస్తకాలు పంచుతూ ఉంటారు. వాళ్లు వేసిన ప్రతి పుస్తకం పంపుతారు. మనం చదివినా, చదవకపోయినా దగ్గర వాళ్ల పుస్తకం ఉంటే చాలంటారు. అదేం ఆనందమో అర్థం కాదు.

* “మేమూ కథలు రాశాం! కానీ ఎవరూ వేసుకోవట్లేదు. ఏం చేస్తాం? అంతా రాజకీయం” అనే బ్యాచ్ ఉంటుంది. మనం కదిలిస్తే కన్నీళ్లు కురిపిస్తారు. తమలాంటి రచయితల్ని అటు సమాజం, ఇటు సాహిత్య లోకం పట్టించుకోవడం లేదని ఫీలవుతూ ఉంటారు. మనం సలహాలివ్వబోతే గయ్యిమంటారు. వాళ్లకు ఆ సింపతీలో బతకడమే బాగుంటుంది కాబోలు.

* “ఏంటడీ ఆ కథలు? ఒక్క సామాజిక సమస్య లేదు. ఒక్క పరిష్కారం లేదు. ఒక్క రైతు లేడు. ఒక్క నిరుపేద లేడు. ఛస్!” అంటారు కొందరు. మనం ఎంత రాసినా వాళ్లకు కావాల్సింది రాయలేదని ధుమధుమలాడే అగ్నిహోత్రావధాన్లు బ్యాచ్ ఇది‌. వాళ్లు రాయరు. మనం రాసింది మెచ్చరు. అదో టైపు.

* “ఆగస్టు 15 వస్తోంది. ఏం కథ రాశారు?’, ‘నవంబర్ 14 బాలల దినోత్సవం.. దాని గురించి ఏమైనా కథ రాశారా?’.. ఇలా ప్రశ్నలు వేసే క్యాలెండర్ బ్యాచ్ ఉంటుంది. సమయానికి తగ్గ కథలు, కవితలు మనం రాస్తే వారికి ఆనందం. అదేం తృప్తో అర్థం కాదు.

* “ఎవడూ! ఆ రచయితా!? ఛత్! అంతకంటే నికృష్టుడు మరొకడు లేడు. వాడి చరిత్ర తెలుసా…’ ఉత్తమ పాఠకులు అనుకునే కొందరి దగ్గర ఉండే సమాచార ప్రకోపం ఇది. తమకు నచ్చినవారే రచయితలు, తాము మెచ్చిందే రచన. లేదంటే ఆయా రచయితల ముందు, వెనుక వ్యవహారాలు మొత్తం మనకు అప్పజెప్తారు.

* “మేమూ కథలు రాయాలని అనుకుంటున్నాం. మీ సలహాలు కావాలి” అని మొదలు పెడతారు. గంటా, రెండు గంటలు మన టైం తింటారు. ఏదేదో అడుగుతారు, ఏదేదో చెప్తారు. ఫలానా ఫేమస్ పత్రికలో మా కథ ఎప్పుడొస్తుంది అనే ఆలోచనతో ఉంటారు. ఆ కలలు కంటూ ఉంటారు. వాళ్లు రాయడం ఉండదు, మనం చదవడం ఉండదు. అంతా అప్పటికప్పటి ఆవేశ వ్యవహారం. మన సమయం వృథా.

* “ఎలా సార్.. అరె ఎలా సార్ అలా” అని చిడతలు వాయించే బ్యాచ్ ఒకటి ఉంటుంది. మనం ‘అ’ అంటే ఆహా అంటారు. ‘ఓ’ అంటే ఓహోహో అంటారు. మనం ఏం రాసినా బాకా వాయిస్తారు. ఏం మాట్లాడినా వాళ్ళే ప్రాసలు వెతుక్కుని మరీ పొగిడేస్తారు. వీళ్లతో చాలా చిరాకు వ్యవహారం.

* మొపాసా ‘Devil’లో ఆ ముసలి తల్లి పాత్ర ఔచిత్యం ఎలాంటిదో తెలుసా?, ‘మార్గరేట్ మిచెల్ గాన్ విత్ ది విండ్‌లో స్ల్కారెట్ ఒహారా పాత్ర వెనుకాల పెద్ద చరిత్రే ఉంది’.. మనం వినని పేర్లు, చదవని పుస్తకాల గురించి గొప్పగా చెప్తూ మనల్ని ఠారెత్తించే బ్యాచ్ ఒకటి ఉంటుంది. వాళ్ల దృష్టిలో ఇంగ్లీషు సాహిత్యమే గొప్ప, అది చదవని మనం అథమాథములం.

* “మా స్కూల్ యాన్యువల్ డే ఉంది. ఒక కవిత రాసివ్వండి..”, “నా లవర్‌ కోసం ఒక కవిత రాయండి. నేనే రాశానని చెప్తాను” ఇలా ఉంటాయి కొందరి డిమాండ్లు. మనం రచయితలం అని తెలియగానే మనల్ని ఎలా ఉపయోగించాలి అనే పక్కా ఐడియాతో ఉంటారు.

* “కథలు రాస్తుంటారా? ఏ సినిమాకి పని చేశారు? ఎవరికి అసిస్టెంటు?..’ ఇత్యాది విషయాలన్నీ తెలుసుకొని మనం ఏమేరకు పనికి వస్తాం అనే బృందం ఒకటి ఉంటుంది. వాళ్లకు సినిమా రాతే రాత. తక్కినదంతా రోత.

* “నా పుస్తకం నీకు పంపిస్తా! చదివి దాని గురించి రాయ్.. నీ పుస్తకం నాకు ఇవ్వు. దాని గురించి నేనూ రాస్తాను..” అనే పరస్పర సహకార బ్యాచ్ కూడా ఉంటుంది. ఈ ఇచ్చిపుచ్చుకోలు కార్యక్రమంతోనే బండి నడిపిస్తుంటారు.

* ‘మీ పుస్తకం వచ్చిదంటగా! ఎన్ని అమ్ముడుపోయాయి? అంతేనా? అయ్యో! ఎలా మరి?’ అని పరామర్శించి సంతృప్తి పడే రకాలు కొందరుంటారు. ఎవరి పుస్తకాలు ఎన్ని అమ్ముడుపోయాయి, ఎన్ని రీప్రింట్లు వెళ్లాయి తదితర విషయాలు సేకరించి, పరామర్శించి సంతుష్టులవుతారు.

* ‘మా తమ్ముడికి ఇంకా ఉద్యోగం రాలేదు. మీరు కాస్త మోటివేట్ చేయండి’, ‘మా ఆవిడ నన్ను రాచి రంపాన పెడుతోంది. కాస్త సలహా ఇవ్వండి..’ మనమేదో గొప్ప రచయితలం, మేధావులం అని ఫీలై మనల్ని సలహాలు, సాయలూ అడుగుతారు. మనం మన పనులు మానేసి వాళ్లకు సలహాలు ఇస్తూ కూర్చుంటే వాళ్లకు హాయి.

” ఇలా ఇంకా చాలా ఉన్నాయి. రాస్తే ఫేస్‌బుక్ గోడలు సరిపోవు.”

Optimized by Optimole