సీబీఎస్ఈ ర్యాంకర్ కథ వింటే మెచ్చుకోకుండా ఉండలేరు!

టెక్నాలజీ ఇంతగా అభివృద్ధి చెందిన కాలంలోనూ ఆడపిల్లలపై వివక్ష కొనసాగుతూనే ఉంది. పుట్టిపుట్టగానే ఎక్కడో ఓ చోట చెత్తకుండీల్లోనూ , నిర్మానుష ప్రాంతాల్లో పసికందులు దర్శనమిస్తున్న ఉదంతాలు కోకొల్లలు. మనిషి ముసుగులో దాగున్న మానవమృగాల ముప్పు చెప్పనవసరం లేదు. ఇలా చెప్పుకుంటే ఒకటేమిటి అనేక సంఘటనలు నిత్యం చూస్తుంటాం. అలా వివక్షకు గురైన బాలిక ఎన్నో అవమానాలు చీత్కారాలు ఎదుర్కొని సీబీఎస్ఇ ఫలితాల్లో సత్తాచాటింది. ఆమె కథను బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ వెలుగులోకి తెచ్చారు. ప్రస్తుతం బాలిక ఇంటర్వ్యూ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 

పాట్నాకు చెందిన శ్రీజ తాజాగా వెలువడిన సీబీఎస్ఇ 10 వ తరగతి ఫలితాల్లో 99.4 శాతం ఉత్తీర్ణత సాధించింది. ఈసందర్భంగా ఓమీడియా ఛానల్ బాలికతో పాటు ఆమె అమ్మమ్మను ఇంటర్వ్యూ చేశాడు. ఈక్రమంలో బాలిక అమ్మమ్మ మాట్లాడుతూ శ్రీజ విజయం వెనకున్న కఠోర శ్రమను వివరించింది. శ్రీజ తల్లి చిన్నతనంలోనే చనిపోయిందని.. ఆతర్వాత తండ్రి వదిలేశాడని చెప్పుకొచ్చింది. శ్రీజను వదిలించుకున్నాక ఆమె తండ్రి మరో పెళ్లి చెసుకున్నాడని..అప్పటినుంచి శ్రీజ తమదగ్గరే ఉంటుందని తెలిపింది. ఇప్పుడు శ్రీజ సాధించిన విజయం చూసి..ఆమె తండ్రి కచ్చితంగా పశ్చాత్తాప పడతాడని వెల్లడించింది.ఇక శ్రీజ.. భవిష్యత్ లో తాను ఎలక్ట్రికల్ ఇంజనీర్ కావాలనుకుంటున్నట్లు మీడియాకు తెలిపింది.

ఇక శ్రీజ వీడియోపై నెటిజన్స్ ఆసక్తికరంగా స్పందిస్తున్నారు. ” ముందుగా అమ్మాయికి అభినందనలు.. ఆమెను స్ఫూర్తిగా తీసుకుని అమ్మనాన్నలకు పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలి అంటూ నెటిజన్ కామెంట్ చేశాడు. మరోనెటిజన్ “ఈ విజయాన్ని సాధించినందుకు శ్రీజకు శుభాకాంక్షలు. సహనం ,నిరంతర శ్రమ విజయానికి బీజాలు అని మరోసారి నిరూపితమైందంటూ కామెంట్ జోడించాడు.