మునుగోడు కేంద్రంగా తెలంగాణ రాజకీయం..!

మునుగోడు రాజకీయం తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. నియోజకవర్గ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పార్టీ మార్పుపై చేసిన వ్యాఖ్యలు ..ఉప ఎన్నికకు   దారితీసే అవకాశమున్న నేపథ్యంలో పార్టీలు వ్యూహాలకు పదునుపెడుతున్నాయి.అటు అధికార టీఆర్ ఎస్ నేతలు అభివృద్ధి పనుల పేరిట క్యూకడుతుంటే .. ఇటు జిల్లా పై పట్టుసాధించాలని వ్యూహాలు రచిస్తున్నారు బీజేపీ నేతలు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ క్యాడర్ చేజారిపోకుండా నష్ట నివారణ చర్యలను చేపట్టింది.

మునుగోడు ఉప ఎన్నిక వచ్చే అవకాశమున్న నేపథ్యంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా రాజకీయం వేడెక్కింది. దీంతో అధికార టీఆర్ఎస్ నేతలు నియోజకవర్గానికి క్యూకడుతున్నారు. మంత్రి జగదీశ్వర్ రెడ్డి పార్టీలోకి చేరికలతో పాటు ముఖ్య నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తూ బిజీబిజీగా గడుపుతున్నారు. ఇక గట్ఠుపల్ మండల కేంద్రంగా ప్రకటించడంతో ..ఈఅంశాన్ని ఉప ఎన్నికలో ప్రధాన అస్త్రంగా వాడాలని కారు పార్టీ భావిస్తోంది.కృతజ్థత సభ పేరిట నేతలందరీని ఒకతాటిపైకి తేవడం వ్యూహాంలో భాగమని తెలుస్తోంది. జిల్లాలో మంత్రి హరీష్ రావు ఆకస్మిక పర్యటన కూడా.. అధికార పార్టీ ఎత్తుగడగా పార్టీ నేతలు భావిస్తున్నారు.

బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్.. పార్టీలోకి కోమటిరెడ్డిని ఆహ్వానం పలకడంతో చేరికకు రంగసిద్ధమైనట్లు తెలుస్తోంది. దీంతో నియోజకవర్గ మండలాల నేతల అభిప్రాయాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు కోమటిరెడ్డి.ఈనేపథ్యంలోనే నాంపల్లి మండల నాయకులతో చర్చించలు జరిపినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.  కమలం పార్టీ సైతం ఉప ఎన్నికలో గెలిచి .. ఉమ్మడి జిల్లాలో పాగా వేయాలని భావిస్తోంది.హుజురాబాద్ తరహాలో నేతలందరీని నియోజకవర్గంలో పర్యటించే విధంగా ప్రణాళికలు రచిస్తోంది. 

అటు కాంగ్రెస్ పార్టీ నష్ట నివారణ చర్యలను చేపట్టింది. పార్టీ క్యాడర్ చేజారిపోకుండా.. జిల్లా ముఖ్య నాయకులతో పీసీసీ రేవంత్ రెడ్డి చర్చలు జరిపారు. నియోజకవర్గ పరిస్థితులపై ఆరా తీశారు. అంతేకాక పార్టీ   సీనియర్ నేతలు నియోజకవర్గంలో పర్యటించి.. సమగ్ర నివేదికను పార్టీ అధిష్టానానికి అందజేసే యోచనలో ఉన్నట్లు  తెలుస్తోంది. ఉప ఎన్నికలో అభ్యర్థి విషయంపై కూడా రేవంత్ అభిప్రాయ సేకరణ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

మొత్తంమీద మునుగోడు కేంద్రంగా తెలంగాణ రాజకీయం వేడెక్కింది. హుజురాబాద్ తరహాలో ఇక్కడ గెలిచి జిల్లా పై కాషాయం జెండా ఎగరవేయాలని కమలనాథులు భావిస్తుండగా.. సానా దాన బేధ దండోపాయలు ఉపయెగించి ఉప ఎన్నికలో విజయం సాధించాలని అధికార టీఆర్ఎస్ భావిస్తోంది.