Nalgonda: నల్లగొండ బిఆర్ ఎస్ ఎమ్మెల్సీ సీటు చిచ్చురేపింది. సీఎం కేసీఆర్ పార్టీ ఎమ్మల్సీ అభ్యర్థులను ప్రకటించడంతో ..సీటు ఆశించి భంగపడ్డ పలువురు నేతలు పార్టీని వీడుతున్నారు. తాజాగా తెలంగాణ ఉద్యమకారుడు చకిలం అనిల్ కుమార్ బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ సీటు ఆశించిన ఆయన ఎమ్మెల్సీ దక్కకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురై పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. అనిల్ బాటలోనే మరికొంతమంది నేతలు పార్టీని వీడే యోచనలో ఉన్నట్లు నియోజకవర్గంలో ప్రచారం జరుగుతుంది.
కాగా పార్టీ ఆవిర్భావం నుండి ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో.. స్వరాష్ట్ర సాధన ఉద్యమంలో అనిల్ కీలక భూమిక పోషించారు. 22 ఏళ్లుగా పార్టీ కోసం శ్రమించిన ఆయన.. ప్రతి ఎన్నికల్లోనూ అసెంబ్లీ టికెట్ ఆశించి నిరాశ చెందారు. పలుమార్లు సీఎం కేసీఆర్ స్వయంగా ..తగిన పదవి ఇస్తామని అనిల్ ను మభ్య పెడుతూ వస్తున్నారు. ఇటీవల కేటీఆర్ సైతం అనిల్ తో భేటి సందర్భంగా.. ఈసారి ఎమ్మెల్సీ టికెట్ నీదేనంటూ హామీ ఇచ్చారని.. తమ నేతకు టికెట్ ఖాయమంటూ ఆయన అభిమానులు ప్రచారం చేసుకున్నారు. తీరా ఎమ్మెల్సీ అభ్యర్థుల లిస్టులో తమ నేత పేరు లేకపోవడంతో వారు నిరాశ చెందారు.
ఇటీవల తెలంగాణ ఉద్యమకారుల పేరుతో చకిలం ఆత్మీయ సమ్మేళనం సమావేశం నిర్వహించారు. ఈసమావేశానికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న ఉద్యమకారులు హాజరయ్యారు. పార్టీ ఆవిర్భావం నుంచి కష్టపడిన తమకు గుర్తింపు లేదంటూ పలువురు ఉద్యమకారులు బహిరంగంగానే ఆవేదన వ్యక్తం చేశారు. వీరితో పాటు బిఆర్ ఎస్ పార్టీ పట్ల అసంతృప్తితో ఉన్న నేతలను సైతం చకిలం సముదాయించుకుంటూ వస్తున్నారు. ఈనేపథ్యంలోనే ఎమ్మెల్సీ పదవుల ఎంపికలో తన పేరును పరిశీలనలోకి తీసుకోకపోవడంతో తీవ్ర నిరాశకు గురైన అనిల్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అభిమానులు, కార్యకర్తలతో చర్చించి.. భవిష్యత్ కార్యచరణను ప్రకటిస్తానని వెల్లడించారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా అనిల్ కు మంచి పేరుంది. గ్రామ గ్రామానా పార్టీలకు అతీతంగా అభిమానులున్నారు. తండ్రి దివంగత చకిలం శ్రీనివాసరావు అనుచరుల అండదండలు ఉన్నాయి. ఏళ్లుగా ప్రతి ఎన్నికల్లోనూ కీలక భూమిక పోషిస్తున్న చకిలం .. ఏపార్టీలో చేరుతారన్నది నియోజకవర్గ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆయన అభిమానులు మాత్రం.. ప్రస్తుత రాజకీయ పరిణామాల దృష్ట్యా తమ నేత బీజేపీలో చేరితే బాగుంటుందన్న అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.