విశాఖ స్టీల్ ప్లాంట్‌పై ముఖ్యమంత్రి నోరు విప్పాలి: ఏపిసిసి గిడుగు రుద్రరాజు
విజయవాడ: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నోరు విప్పి ప్రజలకు సమాధానం చెప్పాలని ఏపిసిసి అధ్యక్షులు గిడుగు రుద్రరాజు డిమాండ్ చేశారు. విజయవాడ ఆంధ్రరత్న భవన్‌లో విలేకరుల సమావేశంలో గిడుగు మాట్లాడుతూ.. విశాఖ స్టీల్ ప్లాంట్ లక్షల మందికి జీవనోపాధి కల్పిస్తోందని, సుమారు 35 వేల ఎకరాలలో విస్తరించి వున్న విశాఖ ఉక్కును రక్షించుకునే బాధ్యత మనందరి మీద ఉందని నొక్కి చెప్పారు. ప్రియతమ ప్రధాని ఇందిరా గాంధీ కల విశాఖ స్టీల్ ప్లాంట్ అని, పి.వి.నరసింహారావు, డా॥మన్మోహన్ సింగ్ హయాంలో విస్తరించి దాదాపు రెండు లక్షల కోట్ల ఉత్పత్తి సామర్ధ్యాన్ని కలిగి ఉందన్నారు. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం, దాని వెనుక వున్న ఆర్.ఎస్.ఎస్ పాత్ర స్పష్టంగా కనిపిస్తోందని విమర్శించారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదాన్ని మళ్లీ కాంగ్రెస్ పార్టీ తీసుకువస్తుందని, త్వరలోనే రాహుల్ గాంధీ విశాఖలో పర్యటిస్తారని.. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ఆయన భరోసా ఇస్తారని తెలిపారు. కొన్ని వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయని, ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కళ్లు తెరిచి విశాఖ ఉక్కుపై తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని రుద్రరాజు సలహా ఇచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో రుద్రరాజుతో పాటు కార్యనిర్వహక అధ్యక్షులు సుంకర పద్మశ్రీ, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు లామ్ తాంతియా కుమారి, నగర కాంగ్రెస్ అధ్యక్షులు నరహరశెట్టి నరసింహారావు, తదితరులు పాల్గొన్నారు.