సీఎం స్టిక్కర్ల కోసం బడ్జెట్ పెట్టినట్లున్నారు: నాదెండ్ల మనోహర్

బడ్జెట్లో కేటాయింపుల ఘనమే తప్ప ఆచరణలో మంజూరు అరకొర అని వైసీపీ పాలన ద్వారా వెల్లడవుతోందని ఆరోపించారు జనసేన నాదెండ్ల మనోహర్. 2023-24లో కూడా ఆంధ్ర ప్రదేశ్ ఆర్థికశాఖ మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల హంగామా తప్ప మరేమీ లేదన్నారు. ప్రజలకు కావలసిన మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి ప్రాజెక్టులకు నిధుల కేటాయింపు గురించి కాకుండా ఇళ్లకు స్టిక్కర్లు, సెల్ ఫోన్లకు స్టిక్కర్లు అతికించడానికి కూడా నిధులు ఇవ్వడాన్ని ఏమనాలని? ప్రశ్నించారు. గడప గడపకు మన ప్రభుత్వమని ఇంటింటికీ వైసీపీ నాయకులు తిరిగారు. ఇప్పుడు ఇళ్లకు, సెల్ ఫోన్లకు స్టిక్కర్లు వేసేందుకు గడప గడపకు ప్రభుత్వం అనే స్కీమ్ పెట్టి రూ.532 కోట్లు ప్రతిపాదించడం విడ్డూరమని నాదెండ్ల మండిపడ్డారు.

ఇక వైద్య, విద్య శాఖల్లోనే కాదు సామాజిక భద్రతకు సంబంధించినవాటిలోనూ సవరించిన అంచనాల్లో కోతలు ఎక్కువగా ఉన్నాయన్నారు మనోహర్. వైద్య ఆరోగ్య శాఖకు గత ఆర్థిక సంవత్సరం కేటాయింపులను కూడా సక్రమంగా ఇవ్వలేదన్నారు. సవరించి రూ.2 వేల కోట్లు తగ్గించారని గుర్తు చేశారు. 2023-24 బడ్జెట్లో మాత్రం కేటాయింపులు ఎక్కువగానే చూపించారన్నారు. ప్రజలను మభ్యపెట్టేందుకే ఇలాంటి అంకెల గారడీ చేస్తున్నారని.. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకాన్ని ఎలా అటకెక్కించారో అందరికీ తెలుసని ఎద్దేవ చేశారు. ఆరోగ్యశ్రీలో ఇప్పటికే రూ.వెయ్యి కోట్ల వరకూ బకాయిలు ఉండటంతో పేదలకు వైద్య సేవలు సక్రమంగా అందటం లేదనేది వాస్తవం కాదా అని మనోహర్ ప్రశ్నించారు.