APpolitics: ఉమ్మడి లక్ష్యం… వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ : నాదెండ్ల మనోహర్

Tdpjanasena:   ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండ.. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కావాలనే లక్ష్యంతో జనసేన – తెలుగుదేశం పార్టీలు  సమన్వయంతో ముందుకు వెళ్తున్నాయని  జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తితో పని చేస్తాయని స్పష్టం చేశారు. సీట్లు, ఓట్లు విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకొని, ఇరు పార్టీలకు ఎక్కడా నష్టం వాటిల్లకుండా ఎన్నికలకు వెళ్తామని తెలిపారు. జనసేన – తెలుగుదేశం పార్టీల సమన్వయ కమిటీ సమావేశం గురువారం విజయవాడలో జరిగింది.సమావేశం అనంతరం మీడియాతో  నాదెండ్ల మనోహర్  మాట్లాడుతూ ‘‘రాష్ట్ర ప్రయోజనమే మిన్నగా, ప్రజలకు భవిష్యత్తు అందించే దిశగా రెండు పార్టీలూ ముందుకు వెళ్తున్నాయన్నారు. ఉమ్మడిగా బలంగా కలిసి పనిచేసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని  సూచించారు.పొత్తు ధర్మంలో భాగంగా కొందరు నాయకులు రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని త్యాగాలు చేయడానికి సిద్ధంగా ఉండాలన్నారు. ప్రతి ఒక్కరికీ తగిన న్యాయం జరుగుతుందని… రెండు పార్టీలు ఇప్పటికే పలుమార్లు సమన్వయ సమావేశాలను గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నిర్వహించాయని గుర్తు చేశారు. రెండు పార్టీలకు సంబంధించిన కార్యక్రమాలు జరుగుతున్నాయని.. ఎక్కడా ఇబ్బంది లేకుండా ఇదే స్ఫూర్తితో ఎన్నికలకు వెళ్లేలా ప్రణాళిక ఉంటుందని మనోహర్ వివరించారు.

Nadendla Manohar,

• న భూతో న భవిష్యతి అనేలా ఉమ్మడి సభ..

ఈ నెల 28వ తేదీన తాడేపల్లిగూడెం  ప్రత్తిపాడులో  జరగబోయే ఇరు పార్టీల ఉమ్మడి బహిరంగ సభ న భూతో న భవిష్యతి అనేలా ఉండబోతోందన్నారు మనోహర్. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం ఏ చేయబోతున్నాం… ఈ రాక్షస పాలనకు చరమ గీతం పాడేలా సభను నిర్వహిస్తమని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇరు పార్టీల నాయకులను సభకు ఆహ్వానిస్తామని.. 500 మంది ఆహ్వానితులను వేదికపై ఉండేలా భారీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. రాష్ట్రంలోని ప్రజలు  ‘బైబై వైసీపీ’ అనే పరిస్థితి ఉందని.. ఇదే ఉత్సాహాన్ని ప్రజల్లో నింపేలా, రెండు పార్టీల కార్యకర్తలకు కొత్త ఉత్తేజాన్ని ఇచ్చేలా సభ ఉండబోతోందన్నారు. ఈ ప్రభుత్వం చేస్తున్న హడావుడి, సామాన్యుడిపై తీసుకొస్తున్న మానసిక ఒత్తిడిని వదిలించుకోవడానికి కేవలం 50 రోజుల సమయం మాత్రమే ఉందన్నారు. ఉమ్మడి మేనిఫెస్టోలో యువతకు ఉద్యోగ అవకాశాలు, మహిళలకు భద్రత, రైతులకు భరోసా అనే అంశాలకు ప్రాధాన్యం ఇస్తామని… ఉమ్మడి మేనిఫెస్టో కూడా త్వరలోనే ప్రజల ముందుకు తీసుకువస్తామని మనోహర్ స్పష్టం చేశారు.