ఆర్. దిలీప్ రెడ్డి(సీనియర్ జర్నలిస్ట్):
అది 1978. పదో తరగతి పరీక్షలు పూర్తయి ఫలితాలు రావడానికి ఇంకా సమయముంది. హైదరాబాద్ వెళ్లి, వకీలుగా ఉన్న మా మేనమామ క్రిష్ణారెడ్డి ఇంట దిగాను. అప్పుడక్కడ ఓ అయిదారు రోజులున్నానేమో! మామ సలహా-సహాయం మేరకు అబిద్స్-కోఠి మార్గంలో, ప్రఖ్యాత సినీ దిగ్గజం ఎన్టీయార్ ఇంటికి సమీపాన ఉన్న ఎస్.ఎ.స్పోర్ట్స్ అనే ఆటవస్తువుల దుకాణానికి వెళ్లా. ఒక క్రికెట్ బ్యాట్, నాలుగు స్టంప్స్, రెండు బెయిల్స్, జత గ్లౌజెస్, ఒక గార్డ్ కొన్నాను. డబ్బులు ఎక్కడివి? ఎలా వచ్చాయి? మొత్తం ఎంతయింది? ఉహూ…. బుర్ర ఎంత చించుకున్నా గుర్తు రావట్లేదు! మా పిన్నికొడుకు, నా కన్నా పెద్ద అయిన పాండన్న (పాండురంగారెడ్డి) నాకారోజు తోడున్నాడు. ఆటోలో ముందు దోమల్ గూడ లోని మామ ఇంటికి, తర్వాత బస్ లో మా సొంతూరు యెనగండ్ల కు ఆ క్రికెట్ కిట్ తరలించాను. క్రికెట్ ఆట మా ఊరు యెనగండ్లకు అలా పరిచయమైంది. మొదట్లో…. నేను, మా అన్న క్రిష్ణారెడ్డి, ఒకరిద్దరు దగ్గరి ఫ్రెండ్స్ కలిసి స్కూల్ గ్రౌండ్ లో ఆడుకునేది. క్రికెట్ ఆట గురించి అప్పటికే ఊళ్లో ఎవరెవరికి తెలుసో లేదో నాకు తెలియదు. నాకు మాత్రం తొమ్మిదో తరగతిలో ఉన్నపుడు మా మాథ్స్ టీచర్ ప్రతాపరెడ్డి సార్ ద్వారా తెలిసింది. పెద్దరేడియో, చిన్న సౌండ్ తో చెవి దగ్గర పెట్టుకొని స్టాఫ్ రూంలో ఆయన కామెంటరీ వినేది. ‘ఏంటి సార్? వదలకుండా అంత శ్రద్దగా వింటున్నారు?’ అనడిగితే, నవ్వి ‘అదో ఆట, క్రికెట్ అంటార్రా. చెప్పినా మీకు అర్థం కాదు. చెప్పటం అంత తేలిక కూడా కాదు’ అనే వారు. కానీ, ఒకటికి రెండు సార్లు అడిగినపుడు ఆయన ఓపిగ్గా విడమర్చి చెప్పారు. ‘బేసిగ్గా ఆట అర్థమైతే, కామెంటరీ వినండి, అప్పుడప్పుడు టీవీలో చూపిస్తుంటారు చూడండి ఇంకా బాగా అర్థమౌతుంది’ అని చెప్పారు. నిజంగానే నెమ్మదిగా అర్థమవడం మొదలైంది. సునీల్ గవాస్కర్, గుండప్ప విశ్వనాథ్, మొహిందర్ అమర్ నాథ్, సయ్యద్ కిర్మాణి, శివలాల్ యాదవ్ లాంటోళ్లు వెలుగుతున్న రోజులవి. మా మేనమామ ద్వారా ఈ ఆట మరికొంత తెలిసేది. ఉత్సాహం కొలది కొని ఆట మెటీరియల్ తెచ్చుకున్నా… ఒకరిద్దరమే ఆడుకోవడానికి లేదు. ఇది టీమ్ గేమ్ అవటం వల్ల ఆటగాళ్లు దొరకక ఇబ్బందయేది. ఆటకు రమ్మన్నా ఊళ్లో వచ్చేవాళ్లు ఉండేది కాదు గనక మొత్తం ఆట కాకుండా బ్యాటింగ్, బౌలింగ్ వరకు సరదా తీర్చుకుంటూ మొదట్లో మేమే ఆడుకునేది! పెద్దగా ఆసక్తి చూపక ఎవరూ రాకుంటే, మా వద్ద పనిచేసే గాయిదు కుర్రాళ్లతో, దూరంగా వెళ్లిన బంతి తెప్పించుకుంటూ మా అన్న, నేనే ఆడుకునేది, నిజం ఇది నమ్మండి! ఒకరం బౌలింగ్ చేస్తే మరొకరు బ్యాటింగ్, దట్సాల్! అంతకు ముందు మా ఊళ్లో బాల్ బ్యాడ్మెంటన్, వాలీబాల్ ఆడేది తప్ప క్రికెట్ ఊసే లేదు. మేం మొదలెట్టాక నెమ్మదిగా ఆసక్తి కలిగిన వాళ్ల సంఖ్య పెరుగుతూ వచ్చింది. స్కూల్ గ్రౌండ్ నుంచి, సహకార సంఘం ఆఫీస్ ముందరికి, జాగీరోని తోటలోకి, తర్వాత పాత హనుమాండ్ల దగ్గరి చింత చెట్ల నడుమ బయలు ప్రదేశానికి, చివర్లో …. ఇప్పుడు నవతరం ఆడుతున్న చెరువు పక్క మైదానానికి ఆట స్థలం మారుతూ వచ్చింది. జట్టుకు 11 మంది చొప్పున దొరకటం కష్టమై, ఒక్కో వైపు ఆరుగురి చొప్పున, అందరూ ‘కామన్ ఫీల్డర్స్’గానూ మేం ఆడుకున్న రోజులున్నాయి. అందులోనూ పోటీలు సుమా! మూడు రోజుల పండుగ సంక్రాంతి వచ్చిందంటే క్రికెట్ సందడే సందడి. 1980, నా ఇంటర్ పూర్తయే నాటికి యెనగండ్ల లోనే టీమ్ లు చేసుకొని క్రికెట్ ఆడే పరిస్థితి వచ్చింది. కపిల్ దేవ్ హీరోగా భారత్ అసాధారణ విజయం సాధించిన 1983 ప్రుడెన్షియల్ వల్డ్ కప్ ఫైనల్స్ కామెంటరీ నేను బీబీసీలో ‘బాల్ బై బాల్’ విన్నాను.
80 లలో మా ఊరి క్రికెట్ మరింత ప్రగతి సాధించింది. నేనపుడు జోగిపేట్ లో డిగ్రీ చేస్తున్నా. మేం ఇరుగుపొరుగు ఊళ్లకు వెళ్లి, లేదా ఆయా టీమ్ లను మా ఊరికి పిలిచి ఆడే పురోగతి వచ్చింది. అలా రంగంపేట, చిట్కుల్, ఘన్ పూర్, సిర్పూర్, సంగుపేట్…. తదితర గ్రామాల జట్లతో ఆడటం మొదలైంది. ఒక మ్యాచ్ మేమంతా యెనగండ్ల టీమ్ గా, జోగిపేట కాలేజీ టీమ్ తో జోగిపేటలోనే ఆడాం. మెదక్ లో ‘ఇందిరా ప్రియదర్శిని వార్షిక క్రికెట్ కప్’ టోర్నీకి వెళ్లటం అప్పట్లో యెనగండ్ల క్రికెట్ లో కీలక పరిణామం. మా ఊరి సరుకు సరిపోక పక్కనున్న చిట్కుల్ నుంచి ఒకరిద్దరు మెరికల్ని (పాండురంగం పంతులు, బిక్షపతి….) అరువు తెచ్చుకొని జట్టుకట్టాం. తొలి మ్యాచ్ నర్సాపూర్ జట్టుపై గెలిచి, రెండో మ్యాచ్ లోనే ఆందోల్ జట్టు (అంతిమ విజేత లేండి) చేతిలో ఘోరంగా ఓడిపోయాం. అప్పటి వరకు మట్టి పిచ్ లపై కార్క్ బాల్ తో ఆడుతున్న మా వాళ్లకు మ్యాట్ పైన గ్రేస్ బాల్ వేగం పిచ్చెక్కించింది. అది 1982 అనుకుంటా హైదరాబాద్ లీగ్ క్రికెట్ ఆడే ఖయ్యూం, అమరేందర్ రెడ్డి అనే వాళ్ల సొంతూరి ఆటగాళ్లను టోర్నీకి తెచ్చింది ఆందోల్ టీమ్!
టాస్ ఓడటంతో మొదట బౌలింగ్ చేయాల్సి వచ్చినా, 120 పరుగులకే (20 ఓవర్లు) ప్రత్యర్థుల్ని కట్టడి చేయగలిగామని మేం సంబరపడ్డాం. అయినా లోపల బెరుకుగానే ఉంది, అంత స్కోర్ చేయగలమా అని! అనుమానపడ్డంతా అయింది. వరసపెట్టి పెవిలియన్ చేరుతున్న మా వాళ్లంతా ఒకర్నొకరు గుట్టుగా అడుగుతూ ఉన్నారు ‘నీకు కనిపించిందా బాల్?’ అంటే, ‘….పోనీ నీకైనా కనిపించిందా?’ అని. ఉహూ, అందరి సమాధానం ఒకటే, ‘లేదు, గుయ్… మని శబ్దమొకటి వినిపించింది’ అని! ఆ ఊపులో మా టీమ్, పట్టుమని 10 పరుగులకు ఆలౌటయింది. ఆ ఇద్దరు ఆటగాళ్లు చెలరేగి, పోటీపడి చెరి అయిదు వికెట్లు తీసుకున్నారు. తర్వాత ఒకటి, రెండేళ్లు నేను యెనగండ్ల టీమ్ క్రికెట్ లో భాగం. ఇక అది అక్కడ వదిలేస్తే, వ్యక్తిగతంగా తర్వాతి కాలంలో నేను అక్కడక్కడ, అప్పుడప్పుడు కాసింత క్రికెట్ ఆడానే తప్ప రెగులర్ గా ఎప్పుడూ లేదు. గుల్బర్గాలో లా చదువుతున్నపుడు, సదాశివపేటలో టీచర్ గా ఉన్నపుడు, జర్నలిస్ట్ గా ‘ఈనాడు’ తరపున 90లలో మీడియా టోర్నీల్లో పరిమిత మ్యాచుల్లోనే ఆడెవాడ్ని. ‘చింత చచ్చినా పులుపు చావలేద’న్నట్టు బాగా వయసొచ్చాక కూడా, మా శిరీగిరి విజయకుమార్ రెడ్డి (ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్) పుణ్యమా అని ‘సాక్షి’ ఇన్ హౌజ్ క్రికెట్ పోటీల్లో పాల్గొని బౌలింగ్, బ్యాటింగ్ (2015-16) చేశా. ఈ పిల్లకారు ఆటలు ఎన్నాడినా…. గుర్తుపెట్టుకోదగ్గ పెద్ద ఆట మాత్రం 2004 లో ఆడిందే! లాల్ బహదూర్ (ఎల్బీ) స్టేడియంలో, ఫ్లడ్ లైట్ల కింద ఎమ్మెల్లేలు-జర్నలిస్టులకు మధ్య జరిగిన ఆ పరిమిత ఓవర్ల క్రికెట్ మ్యాచ్ నేను ఆడిన అతి పెద్ద ఆట. నాటి చీఫ్ విప్ (తర్వాతి కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన) కిరణ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేల టీమ్ కెప్టెన్ కాగా జర్నలిస్ట్ టీమ్ కెప్టెన్ గా నన్నుంచారు. లోగడ రంజీ ప్లేయర్ గా ఉండిన (ఒకప్పుడు ఆయన నేతృత్వంలో ప్రఖ్యాత క్రికెటర్ అజరుద్దీన్ కూడా ఆడారు) కిరణ్ కుమార్ రెడ్డి సూపర్బ్ కెప్టెన్ నాక్ (80 నాటౌట్) వల్ల ఎమ్మెల్యేల జట్టే విజేత అయింది. వారిని కప్పు వరిస్తే రన్నర్స్ గా మేం, నాటి స్పీకర్ సురేశ్ రెడ్డి గారు అందించిన మెడల్ తో సరిపెట్టుకున్నాం.
నేను క్రికెట్ ఆడటం ఎప్పుడో ఆపేసినా మా ఊరు యెనగండ్లలో మాత్రం ఆట కొనసాగుతూనే ఉంది. మా అన్న కొడుకు ప్రదీప్ (మ్యాంచెస్టర్ – ఇంగ్లాండ్), మా చెల్లెలి కొడుకు హరీంద్ర (మణికొండ – హైదరాబాద్) ఆ మైదానాల్లో రాటుదేలినవాళ్లే! తరాలు మారుతున్నాయంతే! ఇరుగు పొరుగు గ్రామాల టీమ్ లను ఆహ్వానిస్తూ, క్రమం తప్పకుండా యేటా సంక్రాంతికి టోర్నీ నిర్వహిస్తున్నారు. ఇప్పుడదొక పెద్ద సందడి, వేడుక. ఈ యేటి సంక్రాంతికి ఊళ్లోని టీమ్ లతోనే టోర్నీ జరిగింది.
1978 లో మొదలైందంటే వచ్చే మార్చి-ఏప్రిల్ నాటికి 49వ యేడు ప్రవేశం! అంటే, 2027 “యెనగండ్ల క్రికెట్ స్వర్ణోత్సవ” సంవత్సరమన్న మాట!
ఇదీ, యెనగండ్ల… అనగా, మా ఊరి క్రికెట్ కథ 😊



